Begin typing your search above and press return to search.

విద్వేష ఆయుధాన్ని బయటకు తీస్తున్న కవిత?

‘పోలవరం.. తెలంగాణపై ఖడ్గం’ పేరుతో నిర్వహించిన ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కవిత.

By:  Tupaki Desk   |   21 Jun 2025 9:41 AM IST
విద్వేష ఆయుధాన్ని బయటకు తీస్తున్న కవిత?
X

రాజకీయాలు గమ్మత్తుగా ఉంటాయి. కాలం చెల్లిన మాటల్ని సరికొత్తగా తెర మీదకు తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనాల్ని పొందాలనే ఎత్తుగడను చూస్తే.. తమ తెలివితేటల మీద నేతలకు ఉండే కాన్ఫిడెన్సు ఇంతనా? అన్న భావన కలుగక మానదు. ఇటీవల కాలంలో పార్టీ అధినేత చుట్టూ దెయ్యాలు చేరాయన్న సంచలన వ్యాఖ్యలతో తెర మీదకు వచ్చిన కవిత.. కొత్త పార్టీ దిశగా అడుగులు పడుతున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. ఆమె అంచనాలకు తగ్గట్లు ఆమె వ్యాఖ్యలకు స్పందన రాని వేళ.. ఆయన తన రూటును మార్చుకున్నారా? అన్నది ప్రశ్నగా మారింది.

గడిచిన పదేళ్లలో ఎప్పుడూ టచ్ చేయని అంశాల్ని.. తాజాగా తెర మీదకు తీసుకొస్తూ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారు కవిత. కాలం చెల్లిన ఆంధ్రా సెంటిమెంట్ మీద ఆమె ఆధారపడినట్లుగా ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. అయితే.. ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థే.

‘పోలవరం.. తెలంగాణపై ఖడ్గం’ పేరుతో నిర్వహించిన ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. ‘‘పోలవరం ప్రాజెక్టు పేరుతో ఏపీలో విలీనం చేసిన ఐదు ముంపు గ్రామాల్ని తిరిగి తెలంగాణకు ఇవ్వాల్సిందే. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నం.. క్రష్ణగుండాల.. ఎటపాక.. కన్నాయిగూడెం.. పిచ్చుకుల పాడు గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నారు. ఏ ప్రభుత్వం వారిని పట్టించుకోవటం లేదు. కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే ఆ ఐదు గ్రామాలకు రక్షణ ఉంటుంది. లేనిపక్షంలో బారీ వరదలొస్తే ఈ గ్రామాలన్నీ మునిగిపోతాయి. పోలవరంతో భధ్రాచటం ప్రాంతానికి శాశ్వతంగా ముప్పు పొంచి ఉంది’’ అంటూ వ్యాఖ్యానించారు.

తన తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న వేళలోనే ఐదు ముంపు గ్రామాల్ని ఏపీలో కలపటం.. కేంద్రం తీసుకున్న ఆ నిర్ణయం మీద ఏం చేసినా ఫలితం లేదని.. అది అయిపోన ముచ్చటగా కేసీఆర్ తేల్చేయటం తెలిసిందే. దగ్గర దగ్గర పదేళ్లు తన తండ్రి అధికారంలో ఉన్న వేళలో ముంపు గ్రామాలకు చెందిన ప్రజల గురించి ఒక్క రోజు కూడా మాట్లాడేందుకు టైం లేని కవితకు.. ఇప్పుడు హటాత్తుగా వారు ఎందుకు గుర్తుకు వచ్చినట్లు?

నిజంగా ముంపు గ్రామాల ప్రజల మీద కవితకు అంత అభిమానమే ఉండి ఉంటే.. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వకల్తా ఎందుకు పుచ్చుకోలేదు? తండ్రి అధికారం దూరమై ఏడాది తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళలో కానీ ముంపు గ్రామాల గురించి గుర్తుకు వచ్చిందా? అన్నది ప్రశ్న. అప్పట్లో తమ చేతికి ఆయుధంగా మారిన ఆంధ్రా వ్యతిరేక వాదనను తాజాగా తెర మీదకు తీసుకురావటం ద్వారా మరో శక్తిగా ఎదగాలన్న కవిత ఆత్రుతను అర్థం చేసుకోవచ్చు. తన రాజకీయ ప్రయోజనాల కోసం సెంటిమెంట్ ను రగిల్చి.. రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవటం ఏమిటి? అన్నది ప్రశ్న. ఇప్పటికీ కాలం చెల్లిన సెంటిమెంట్ ఆయుధాల్ని పట్టుకునే కన్నా..ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలు.. వాటికి పరిష్కారాల మీద ఫోకస్ చేస్తే అంతో ఇంతో ప్రయోజనం ఉంటుందన్న విషయం కవితకు ఎప్పుడు అర్థమవుతుందో?