కవిత కొత్త పార్టీ పేరుపై క్లారిటీ వచ్చేసిందా?
తాజాగా అందుతున్న సమచారం ప్రకారం కవిత పెట్టే పార్టీ పేరు విషయంపై తర్జనభర్జనలు పడి చివరకు రెండు పేర్లు సిద్ధం చేశారని చెబుతున్నారు.
By: Tupaki Desk | 25 May 2025 5:00 PM ISTగులాబీ పార్టీలో దెయ్యాలు ఉన్నాయని.. దేవుడు చుట్టూ దెయ్యాలు కాపు కాస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేయటం ద్వారా తెలంగాణ విపక్ష పార్టీలో దుమారం రేపిన కవిత వైనం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. పార్టీ పూర్వ వైభవం కోసం బీఆర్ఎస్ దళాలు కిందా మీదా పడుతున్న వేళ.. అందుకు భిన్నంగా ఆ పార్టీ వ్యవస్థాపకుడి కుటుంబానికి చెందిన ఆడబిడ్డ ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా గళాన్ని విప్పటంతో గులాబీ దండు ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
పార్టీని నడిపే విషయంలోనూ.. పార్టీ వ్యవహారాల్ని చక్కబెట్టే విషయంలోనూ.. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో అనుసరించాల్సిన వైఖరి ఏమిటన్న దానిపై తండ్రి కేసీఆర్ కే సలహాలు ఇచ్చేలా లేఖ రాసిన కవిత తీరు ఒక ఎత్తు అయితే.. తండ్రికి కూతురు రాసిన లేఖ లీక్ వైనం రాజకీయంగా మరింత హాట్ టాపిక్ గా మారింది. కవిత తర్వాతి అడుగు ఏమిటి? అన్న దానిపై ఇప్పటికే కొంత స్పష్టత వచ్చిందని చెప్పాలి.
తాజాగా ఆమె రాజకీయ పార్టీ పెట్టనున్నారన్న విషయంపై క్లారిటీ వచ్చినట్లు చెబుతున్నారు. కవితకు అత్యంత సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కొత్త పార్టీ పెట్టే దిశగా కవిత అడుగులు వేస్తున్నట్లుగా సంకేతాల్ని ఇస్తున్నారు.తాజాగా అందుతున్న సమచారం ప్రకారం కవిత పెట్టే పార్టీ పేరు విషయంపై తర్జనభర్జనలు పడి చివరకు రెండు పేర్లు సిద్ధం చేశారని చెబుతున్నారు. ఆమె మొదటి ప్రాధాన్యత తెలంగాణ జాగృతి పార్టీగా చెబుతున్నారు. ఒకవేళ అలా కాదనుకుంటే బీఆర్ఎస్ పార్టీ పాత పేరు టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పేరుకు దగ్గరగా ఉండే పేరును పెట్టే వీలుందని చెబుతున్నారు.
‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పేరులో బహుజన కానీ బలహీన వర్గాలు.. అణగారిన వర్గాలను ప్రముఖంగా ప్రస్తావించేలా పార్టీ పేరు ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత కొత్త పార్టీ పెట్టేందుకు ఉన్న అవకాశాలు 80 శాతానికి పైనే ఉంటాయని చెబుతున్నారు. నిజానికి ఆ దిశగా అడుగులు వేసే ఆలోచనే లేకపోతే.. లేఖ వరకు విషయం వెళ్లదని చెబుతున్నారు. అధినేతకు కవిత లేఖ రాయటంతో విషయం పూర్తి కాదని.. కొత్త పార్టీ దిశగా ఆమె అడుగులు పడతాయన్న కచ్ఛితమైన అంచనాతోనే ఆమె లేఖ లీక్ అయ్యిందన్న వాదన వినిపిస్తోంది. ఏమైనా రానున్న కొద్ది వారాల్లో ఆమె తన కీలక నిర్ణయాన్ని ప్రకటించటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
