Begin typing your search above and press return to search.

పొలిటికల్ గాసిప్ : కవిత కొత్త పార్టీ TRS+BRS = TBRS (తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి)

ఇక పార్టీపై తుది నిర్ణయం తీసుకునే ముందు కార్యాలయాన్ని కూడా కవిత సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   2 Sept 2025 11:27 AM IST
పొలిటికల్ గాసిప్ : కవిత కొత్త పార్టీ TRS+BRS = TBRS (తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి)
X

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) చీలక దిశగా పయనిస్తోందా? అన్న చర్చ మొదలైంది. పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ధిక్కారంతో బీఆర్ఎస్ రాజకీయాలు వేడెక్కాయి. పార్టీ సీనియర్ నేతలు, సొంత కుటుంబ సభ్యులు అయిన మాజీ మంత్రి హరీశ్ రావు, ఎంపీ జోగినాపల్లి సంతోష్ పై కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెపై వేటు వేసే దిశగా బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచిస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో తన రాజకీయ భవిష్యత్తుపై ఫుల్ క్లారిటీతో ఉన్న కవిత సొంత పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారంటున్నారు. కవిత ప్రారంభించబోయే పార్టీ పేరు.. కార్యాలయం కూడా సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది.

ఆ ఇద్దరిపై ఆగ్రహం

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ జాగృతి పేరుతో సాంస్కృతిక పోరాటం చేసి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న కవిత.. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే తండ్రి వారసత్వంగా పార్టీ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న కవిత.. తనకు అడ్డుగా ఉన్నారని సొంత అన్న కవిత, మేన బావ హరీశ్ రావుపై కొంత కాలంగా వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. ఆ ఇద్దరు తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తున్నారని కవిత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో గత ఆరేడు నెలలుగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఇదే సమయంలో ఆమె విషయంలో ఇన్నాళ్లు బీఆర్ఎస్ వేచిచూసే ధోరణి అవలంభించింది. అయితే తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ప్రభుత్వం సీబీఐకి లేఖ రాయడంతో బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, తన తండ్రికి మచ్చ కలిగేలా హరీశ్ రావు అవినీతికి పాల్పడ్డారని కవిత ఆరోపించడంతో బీఆర్ఎస్ చిక్కుల్లో పడిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై పార్టీ నుంచి బహిష్కరించాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

సొంత పార్టీపై నిర్ణయం

అయితే బీఆర్ఎస్ లో తనకు నాయకత్వం అప్పగించే విషయంలో సానుకూలత కనిపించకపోవడంతో కవిత వేరుదారి చూసుకుంటున్నట్లు చెబుతున్నారు. తండ్రిని ధిక్కరించి వేరే పార్టీలో చేరితే రాజకీయంగా అప్రదిష్ట మూటగట్టుకునే అవకాశం ఉందన్న ఆలోచనతో సొంతంగా పార్టీ పెట్టాలని కవిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన అంతరంగికులతో ఈ విషయమై చర్చించారని, పార్టీ పేరుపైనా ఓ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అంతేకాకుండా కార్యాలయాన్ని ఎంపిక చేశారని కవిత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

టీఆర్ఎస్ లేదా టీబీఆర్ఎస్

తెలంగాణ సమాజంలో బాగా ప్రాచుర్యం పొందిన టీఆర్ఎస్ అన్న పేరును కవిత పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ పేరుతోపాటు ప్రస్తుత బీఆర్ఎస్ పేరు కలిసేలా టీబీఆర్ఎస్ అన్న పేరు కూడా ఆమె పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టీబీఆర్ఎస్ అంటే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితిగా వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేయడంతోపాటు రాష్ట్రంలో బీసీ వర్గాలను బాసటగా నిలిచేలా టీబీఆర్ఎస్ పేరును ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గా ఉండేది. ఆ పేరుతోనే రెండు సార్లు ప్రజా విశ్వాసాన్ని చూరగొని అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ గా మారిన తర్వాతే అధికారం కోల్పోయింది. దీంతో కవిత టీఆర్ఎస్ పేరు అయితే సెంటుమెంటు కలిసివస్తుందని చూస్తున్నారని అంటున్నారు. అయితే ఎక్కువ మంది టీఆర్ఎస్ కన్నా టీబీఆర్ఎస్ అన్న పేరుతోనే పార్టీ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నట్లు చెబుతున్నారు.

అక్కడే కార్యాలయం

ఇక పార్టీపై తుది నిర్ణయం తీసుకునే ముందు కార్యాలయాన్ని కూడా కవిత సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్ లోని తన ఇంటి పక్కనే మూడు అంతస్థుల భవనాన్ని ముందుగా ఎంపిక చేసుకోవాలని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ పేరు, కార్యాలయం సిద్ధమైన తర్వాత వీలైనంత త్వరగా పార్టీ పేరు ప్రకటించాలని కవిత భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రకటన కూడా దసరా లేదా దీపావళిలో ఉంటుందని అంటున్నారు. ఇదే సమయంలో పార్టీ ప్రకటించే ముందు తండ్రి కేసీఆర్ తో కవిత మరోమారు చర్చించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో కవితకు కేసీఆర్ అపాయింట్మెంట్ లభిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కవిత విషయంపై తాడేపేడో తేల్చేయాలన్న ఉద్దేశంతో ఉన్న బీఆర్ఎస్ సీనియర్లతో చర్చిస్తోంది. కవిత విషయంతో కొద్ది రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.