Begin typing your search above and press return to search.

ప్రతిపక్షం.. పాలకపక్షం.. ఇరు వైపులా ప్రసంగంలో ఎలాంటి నిజాయితీ లేదు.. కవిత సంచలన వ్యాఖ్యలు..

ఒకవైపు కేసీఆర్ గారు జగిత్యాల సభతో మళ్లీ పాత ఫామ్ చూపిస్తుంటే, మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న ఈ కొత్త తరహా సెటైర్లు చర్చనీయాంశంగా మారాయి.

By:  Tupaki Political Desk   |   21 April 2026 5:00 PM IST
ప్రతిపక్షం.. పాలకపక్షం.. ఇరు వైపులా ప్రసంగంలో ఎలాంటి నిజాయితీ లేదు.. కవిత సంచలన వ్యాఖ్యలు..
X

ఒకవైపు కేసీఆర్ గారు జగిత్యాల సభతో మళ్లీ పాత ఫామ్ చూపిస్తుంటే, మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న ఈ కొత్త తరహా సెటైర్లు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా 75 ఏళ్ల వయసులో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి చేరిన జీవన్ రెడ్డి ను ‘యువకుడు’ అని సంబోధించడంపై కవిత చేస్తున్న విమర్శలు ఆసక్తికరంగా ఉన్నాయి. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ‘జగిత్యాల, నస్తూర్ పల్లి’ సభల చుట్టూ తిరుగుతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించడం ఒక ఎత్తయితే, ఆ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలను అస్త్రాలుగా వాడుకొని రాజకీయ ప్రయోజనం పొందాలని కొందరు చూస్తున్నారు. ప్రభుత్వంపై ఆయన చేసిన విమర్శలను 'పిట్టకథలు' అని, ప్రతిపక్షం చెబుతున్నవన్నీ 'ఉట్టికథలు' అని విమర్శిస్తూ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పిట్టకథలు వర్సెస్ ఉట్టికథలు!

కవిత విమర్శలు చాలా పదునుగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా, మూసీ ప్రక్షాళన వంటి అంశాలతో ప్రజల్లో భ్రమలు కల్పిస్తోందని, హైడ్రాను ఎత్తేస్తాం అని కేసీఆర్ అనడం 'పిట్టకథలు' మాత్రమేనని కవిత ఆరోపిస్తోంది. కేసీఆర్ సభలో చేసిన వాగ్దానాలు, ఇక రేవంత్ రెడ్డి సభలో 'ఉట్టికథలు' చెప్పారని కవిత కొట్టిపారేస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత మళ్లీ జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.

75 ఏళ్ల ‘యువకుడు’..

ఈ సభలో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం.. 75 ఏళ్ల జీవన్ రెడ్డిని కేసీఆర్ ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు అని కవిత ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో అనుభవం అవసరమే అయినా, 75 ఏళ్ల వయసులో పార్టీ మారిన నేతను ‘యువకుడిలా పనిచేస్తారు’ అని పొగడటంపై సెటైర్లు పేలుతున్నాయి. ‘జీవన్ రెడ్డి యువకుడైతే, ఉద్యోగాల కోసం, భవిష్యత్తు కోసం వేచి చూస్తున్న రాష్ట్రంలోని లక్షలాది మంది అసలైన యువత ఏమవ్వాలి?’ అన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. సీనియర్ నేతలకే మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తుంటే, కొత్త తరం నాయకత్వం ఎప్పుడు వస్తుంది? అని కవిత మండిపడ్డారు. యువతకు దక్కాల్సిన ప్రాధాన్యతను ఇలాంటి రాజకీయ చేరికలు అడ్డుకుంటున్నాయనే అభిప్రాయం ఆమె వ్యక్తం చేశారు.

రాష్ట్ర సమస్యలు ఎక్కడ?

జగిత్యాల సభలో రాజకీయ విమర్శలు, చేరికల మీద ఉన్న శ్రద్ధ.. రాష్ట్రంలోని ప్రధాన సమస్యల మీద లేదనే కవిత చెప్పకనే చెప్పారు. గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు, డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనలు వంటి కీలక అంశాలపై స్పష్టమైన పరిష్కారం చూపకుండా కేవలం రాజకీయ ప్రత్యర్థులను తిట్టడానికే సభలను వాడుకుంటున్నారని కవిత అంటున్నారు. అకాల వర్షాలు, రుణమాఫీ అమలు ఉన్న లోపాల గురించి చర్చించకుండా కేవలం హైడ్రా వంటి నగర ప్రాంత సమస్యలపైనే కేసీఆర్ కేంద్రీకరించడంపై మండాపడ్డారు.

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు 'ప్రహసనం'లా మారుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతున్నామని చెబుతుంటే, మరోవైపు ప్రతిపక్షం మళ్లీ అధికారం కోసం వ్యూహాలు రచిస్తోంది. అయితే, ఈ 'పిట్టకథలు', 'ఉట్టికథల' మధ్య నలిగిపోతున్నది మాత్రం సామాన్య ప్రజలే అంటూ కవిత రెండు పార్టీలు, ఇద్దరు నాయకులపై నిప్పులు చెరిగారు.