కవితకు సానుభూతి...బీఆర్ఎస్ సంగతి ?
లిక్కర్ స్కాం విషయంలో తెలంగాణాకు చెందిన మాజీ ఎంపీ కేసీఆర్ తనయ అయిన కవితకు పూర్తి ఊరట దక్కింది.
By: Satya P | 1 March 2026 5:00 AM ISTలిక్కర్ స్కాం విషయంలో తెలంగాణాకు చెందిన మాజీ ఎంపీ కేసీఆర్ తనయ అయిన కవితకు పూర్తి ఊరట దక్కింది. దాంతో ఆమె ఇపుడు ఉత్సాహంగా ఉన్నారు. తొందరలో పార్టీని పెట్టాలని అనుకుంటున్న ఆమెకు తాజా తీర్పు నెత్తిన పాలు పోసినట్లు అయింది అని అంటున్నారు. నిజానికి కవిత మీద విమర్శలు ఎక్కువగా చేసింది బీఆర్ఎస్ నేతలే అని అంటున్నారు. ఆమెను లిక్కర్ క్వీన్ గా కూడా విమర్శిస్తూ కల్వకుంట్ల వారి ఆడబిడ్డకు తీరని ఆవేదన కలిగించారు అని అంటున్నారు. నిజానికి లిక్కర్ స్కాం విషయంలో కవిత ఆరు నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. అయితే పార్టీ తరఫున తనకు తగినంత మద్దతు దక్కలేదని ఆమె చాలా సార్లు కలవరం చెందారని గుర్తు చేస్తున్నారు.
ప్రాధాన్యత తగ్గిందనే :
ఇవన్నీ పక్కన పెడితే 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ నుంచి పోటీ చేసిన కవిత ఓటమి పాలు అయ్యారు. అయితే ఆమెకు 2020లో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు కేసీఆర్. కవిత మంత్రి కావాలని అనుకున్నారు అని చెబుతారు. కానీ అది జరగలేదు, కేవలం ఎమ్మెల్సీగానే ఆమె మిగిలిపోయారు. దాంతో ఆమెలో నాడే అసంతృప్తి రాజుకుంది అని అంటారు. ఇక పార్టీలో సైతం తన సోదరుడు కేటీఆర్ కి ప్రయారిటీ ఇవ్వడం అలాగే హరీష్ రావు సహా ఇతర నేతలకు ప్రాముఖ్యత దక్కడంతో కవిత కొంత గ్యాప్ పాటించారు అని అంటారు. ఈ క్రమంలో లిక్కర్ స్కాం లో ఆమె ఇరుక్కున్నారని వార్తలు రావడం ఆ మీదట అరెస్టు కావడం జరిగిపోయాయి. ఈ కేసు తరువాత కవితను ఇంకా దూరం పెట్టారని ఆమె వైపు నుంచి వాదన. మొత్తానికి చూస్తే లిక్కర్ స్కాం విషయంలో ఆమె నిర్దోషి అని తేలింది. ట్రయల్ కోర్టు ఆ విధంగా తీర్పు ఇచ్చింది.
రెట్టించిన ఉత్సాహంతో :
అయితే లిక్కర్ స్కాం లో కలిగిన ఊరటను బీఆర్ఎస్ వాడుకోకుండా కవిత బ్రేకులు వేస్తున్నారు. తన వల్లనే ఓటమి సంభవించింది అని చెప్పడం తప్పు అని బీఆర్ఎస్ అనేక ఇతర కారణాల వల్లనే ఓటమి చెందింది అని ఆమె మండిపడ్డారు ఇక తాను నిర్దోషి అని ఆమె చెప్పుకున్నారు. అనవసరంగా తనను జైలు పాలు చేశారు అన్నది ఆమెకు సానుభూతిగా మారుతోంది. అయితే ఆ సానుభూతి అన్నది తాను కొత్తగా పెట్టబోయే పార్టీకే దక్కాలని ఆమె వ్యూహరచన చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అది మళ్ళకూడదని ముందర కాళ్ళకు బంధం వేస్తున్నారు.
బీఆర్ఎస్ టార్గెట్ గా :
కవిత రాజకీయం అంతా ఇపుడు బీఆర్ఎస్ మీదనే ముడి పడి ఉంది జనంలో బీఆర్ఎస్ ని ఎంత పలుచన చేస్తే అంతే స్థాయిలో తన కొత్త పార్టీకి బలం చేకూరుతుంది అన్నది ఆమె వ్యూహంగా ఉంది. అందుకే ఆమె లిక్కర్ స్కాం తీర్పుని అనుకూలంగా మార్చుకుంటూ అదే సమయంలో బీఆర్ఎస్ మీద విమర్శలు ఎక్కు పెడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ కి ఆప్ అధినేత కేజ్రీవాల్ మాదిరిగా తమ పార్టీని సీబీఐ కేసుల పేరుతో టార్గెట్ చేశారు అని గట్టిగా చెప్పుకునే అవకాశాలు అయితే తగ్గిపోయాయని అంటున్నారు.
సెంటిమెంట్ కార్డు అటు :
చెల్లెమ్మ సెంటిమెంట్ అస్త్రంతో జనంలోకి రావాలని చూస్తున్నారు. అదే విధంగా బీఆర్ఎస్ విషయంలో ఆమె ఎక్కడా తగ్గడం లేదు. దాంతో జస్ట్ ట్వీట్ తోనే బీఆర్ఎస్ తగ్గాల్సి వస్తోంది అని అంటున్నారు రానున్న కాలంలో జనంలోకి మరింతగా ఇదే పాయింట్ తో కవిత రానున్నారు అని అంటున్నారు. లిక్కర్ క్వీన్ అని విమర్శించిన నోళ్ళు మూతపడేలా ఆమె తన వాయిస్ పెంచి మరీ బిగ్ సౌండ్ చేస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే లిక్కర్ స్కాం తీర్పుతో బీఆర్ఎస్ సైలెంట్ అవాలన్నదే చెల్లెమ్మ మాట. అంతే కాదు తన రాజకీయ భవితకు ఇదే పునాది కావాలని ఆకాంక్షిస్తున్నారు అయితే కవిత కొత్త పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారు అన్నది చూడాల్సి ఉంది. జైలుకు వెళ్ళి వచ్చిన వారి బాధలు కానీ కష్టం కానీ ఊరక పోలేదు, అందులోనూ తెలుగు రాష్ట్రాలలో ఆ సెంటిమెంట్ కార్డు బాగా వర్కౌట్ అయింది. ఇపుడు కూడా అవుతుంది. కానీ దానికి తగిన వ్యూహాలు నాయకత్వ దక్షతలు మందీ మార్బలం అన్నీ ఉండాలి. మరి కవిత ఏ విధంగా తన రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తారు అన్న దానిని బట్టి ఆమె ఫ్యూచర్ బీఆర్ఎస్ ఫేట్ కూడా ఆధారపడి ఉన్నాయని అంటున్నారు.
