అదే పేరు కావాలి.. కవిత పట్టు!
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ ఎస్) పేరును మార్చుకోవాలంటూ.. కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన దరిమిలా.. ఆ పార్టీ చీఫ్ కవిత తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి సుదీర్ఘ లేఖ రాశారు.
By: Garuda Media | 13 July 2026 9:58 AM ISTతెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పేరును మార్చుకోవాలంటూ.. కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన దరిమిలా.. ఆ పార్టీ చీఫ్ కవిత తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి సుదీర్ఘ లేఖ రాశారు. తమకు అదే పేరు కావాలని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటి కే రాష్ట్ర వ్యాప్తంగా వంద నియోజకవర్గాలకు పైగా తమ పార్టీ పేరుతో జెండాలు ఎగురవేశామని.. ఇప్పుడు మార్చుకోమంటే ఎలా ? అని కవిత ప్రశ్నించారు. ఈ మేరకు కవిత పేరుతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ లేఖ సంధించారు.
ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు కూడా సంధించారు. తమ పార్టీ పేరును మార్చు కోవాలని వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని చెబుతున్న ఎన్నికల సంఘం ఆ అభ్యంతరాలను ఎవరు వ్యక్తం చేశారో.. చెప్పాలని కోరారు. ఆ లేఖలను కూడా తమకు పంపాలని పట్టుబట్టారు. ఎవరో ముక్కు మొహం తెలియని వారు రాసిన లేఖలను ఆధారంగా చేసుకుని పార్టీ పేరును మార్చుకోమని కోరడం సమంజసం కాదని పేర్కొన్నారు.
పార్టీ పేరు విషయంలో గతంలో కేంద్ర ఎన్నికల సంఘం తమకు కొన్ని సూచనలు చేసిందని.. దాని ప్రకారమే పేరును మార్చుకున్నామని.. తెలంగాణ రక్షణ సేన పేరుతో 105 నియోజకవర్గాల్లో పార్టీ జెండాను కూడా ఆవిష్కరించామని తెలిపారు. ప్రస్తుతం ప్రజలు తమకు అనుకూలంగా ఉన్నారని.. అలాంటప్పుడు పేరును మార్చుకోమని కోరడం సరికాదని తెలిపారు. ఇది తమ హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొన్నారు.
ఇప్పటికే ఒకే రమమైన పేర్లతో అనేక పార్టీలు తెలంగాణలో ఉన్నాయని కూడా అనిల్ కుమార్ పేర్కొన్నా రు. తమకు మాత్రమే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. తమ వైపు నుంచి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచన చేయాలని కోరారు. కాగా.. ఎన్నికల సంఘం సూచించిన గడువు.. సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్-1951 సెక్షన్ 29A ప్రకారం.. తమ అభ్యర్థనను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
