Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్ : కేసీఆర్ ను కలిసిన కవిత

కట్ చేస్తే.. ఏమైందో కానీ తండ్రి కేసీఆర్ కాళేశ్వరం విచారణకు వెళ్లేముందర కూతురు కవిత ప్రత్యక్షమైంది. ఫాంహౌస్ కు వెళ్లి మరీ కేసీఆర్ ను కవిత కలవడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

By:  Tupaki Desk   |   11 Jun 2025 10:52 AM IST
హాట్ టాపిక్ : కేసీఆర్ ను కలిసిన కవిత
X

అగాధమంత దూరం పెరిగింది. బీఆర్ఎస్ లోని పరిణామాలను ఏకరువు పెట్టింది. ఏకంగా అన్న కేటీఆర్ పైనే విమర్శలు గుప్పించింది. తండ్రి కేసీఆర్ కు దూరమైంది. కట్ చేస్తే.. ఏమైందో కానీ తండ్రి కేసీఆర్ కాళేశ్వరం విచారణకు వెళ్లేముందర కూతురు కవిత ప్రత్యక్షమైంది. ఫాంహౌస్ కు వెళ్లి మరీ కేసీఆర్ ను కవిత కలవడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్‌ఎస్‌లో అంతర్గత రాజకీయ వేడి కొనసాగుతున్న నేపథ్యంలో, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌తో కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం ఎర్రవల్లి ఫాంహౌస్‌లో భేటీ అయ్యారు. ఇటీవల పార్టీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కవిత ఎందుకు కలిసింది? ఆ మతలబు ఏంటన్నది ఆసక్తి రేపుతోంది.

కవిత తన భర్త అనిల్‌తో కలిసి ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వెళ్లారు. కేసీఆర్‌తో ఆమె వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇటీవల కవిత పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాయడం, బీఆర్‌ఎస్‌లో "దెయ్యాలు ఉన్నాయి" అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో జరిగిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ భవిష్యత్ దిశ, అంతర్గత అభ్యంతరాలు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగి ఉండవచ్చని పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఈ సమావేశానికి మరో విశేషం ఏమిటంటే, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు కూడా ఎర్రవల్లికి వచ్చినట్లు సమాచారం. కవిత-కేసీఆర్‌ భేటీ అనంతరం వారు బీఆర్‌కే భవన్‌కు కూడా విచారణ కోసం కేసీఆర్ వెళ్లారు.

- కేసీఆర్‌కు కీలక పరీక్ష: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ

మరోవైపు, కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జరుగుతున్న విచారణలో బుధవారం కీలక పరీక్ష ఎదురుకానుంది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్‌ బుధవారం ఉదయం 11:30 గంటలకు కేసీఆర్‌ను క్రాస్ ఎగ్జామినేషన్‌కు పిలిచింది. రాష్ట్ర చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి విచారణ కమిషన్ ముందు హాజరుకావడం ఇదే తొలిసారి. ఈ విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ బుధవారం ఉదయం 9 గంటలకు ఎర్రవల్లి ఫాంహౌస్‌ నుంచి బయలుదేరనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై కమిషన్‌ ఇప్పటికే సంబంధిత ఇంజినీర్లు, ఐఏఎస్‌ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి సాక్ష్యాలు సేకరించింది. కీలక నిర్ణయాలను అప్పటి సీఎం కేసీఆర్ తీసుకున్నారని పలువురు అధికారులు పేర్కొన్న నేపథ్యంలో ఆయనను కమిషన్ ప్రశ్నించనుంది.

- రాజకీయ ఉత్కంఠ

బీఆర్కే భవన్ కు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు వచ్చాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాయి. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలు బీఆర్‌ఎస్ పార్టీలో హీట్ పెంచుతున్నాయి. కేసీఆర్ విచారణకు ముందు కవిత భేటి కావడం.. అనేక భవిష్యత్ రాజకీయాలపై అనేక ఊహాగానాలకు దారితీశాయి. కవిత-కేసీఆర్‌ భేటీ ద్వారా పార్టీ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయా లేదా మరింత పెరుగుతాయా అన్నది త్వరలో స్పష్టమవుతుంది. కేసీఆర్ ను కవిత ఎందుకు కలిసింది అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం విచారణ కూడా రాష్ట్ర రాజకీయాలపై దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.