బీఆర్ఎస్‌ను ఓవర్ టేక్ చేస్తున్న కవిత.. తాజాగా అరెస్టు
బీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రక్షణ సేన(టీఆర్ ఎస్) పార్టీని స్థాపించిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత దూకుడు పెంచారు.
By: Garuda Media | 23 May 2026 1:09 PM ISTబీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీని స్థాపించిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత దూకుడు పెంచారు. బీఆర్ ఎస్ పార్టీ రేపో.. మాపో.. అని ప్రకటించేందుకు సిద్ధమైన రైతుల ధర్నాను.. ఆమె ఓవర్ టేక్ చేశారు. తాజాగా ఆమె రైతులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం గత వారం రోజులుగా రాజకీయ దుమారానికి దారి తీసిన విషయంతెలిసిందే. ప్రభుత్వం రైతుల ననుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని బీఆర్ ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కళ్లాల వద్దకు వెళ్లి కేటీఆర్ సహా పలువురు నేతలు పరిశీలించారు.
ఈ క్రమంలో సర్కారుపై కేటీఆర్ విమర్శలు కూడా చేశారు. దీనికి ప్రతిగా సీఎం రేవంత్ రెడ్డి.. మీడియా సమావేశం పెట్టి మరీ బీఆర్ ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. ఇదిలావుంటే.. రైతులకు మద్దతు రాష్ట్ర స్థాయిలో ధర్నాలు, నిరసనలు చేపట్టాలని బీఆర్ ఎస్ పార్టీ నిర్ణయించింది. అయితే.. డేట్ ఇంకా ప్రకటించలేదు. ఇంతలోనే కవిత .. తన కార్యాచరణతో రంగంలోకి దిగిపోయారు. రైతులకు మద్దతుగా ఆమె రాష్ట్ర సచివాలయం వద్ద శుక్రవారం ధర్నాకు దిగారు. రోడ్ల పై ధాన్యం పోసి.. నిరసన చేపట్టారు. ఈ నిరసనలో పలువురు రైతులు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం అంటూ.. సీఎం రేవంత్ రెడ్డి సర్కారుపై విరుచుకుపడ్డారు. రైతులను చిన్న చూపు చూస్తున్నారని.. వారి ఆవేదనను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నామని.. తక్షణమే ధాన్యం సహా మక్కలను కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే.. కవిత చేపట్టిన ధర్నాకు అనుమతి లేదని పోలీసులు రంగంలోకి దిగారు. ఒకదశలో పోలీసులకు, తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం కవితను అరెస్టు చేసిన పోలీసులు.. స్టేషన్‌కు తరలించారు.
అనుకుని చేయని బీఆర్ఎస్..
రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్న ఇబ్బందులపై రాష్ట్ర వ్యాప్త ధర్నా చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ముహూర్తం కోసం వేచి ఉంది. పార్టీ కార్యకర్తలను, నాయకులను సమీకరించే పనిని కూడా చేపట్టింది. కానీ.. ఈ పార్టీని ఓవర్ టేక్ చేస్తూ.. కవిత రైతులకు మద్దతు ధర్నాను చేపట్టడం గమనార్హం. దీనికి సంబంధించి అప్పటికప్పుడు ఆమె నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అందుకే పోలీసులు అనుమతి లేదని.. ధర్నా చేపట్టరాదని కవితను హెచ్చరించారు. మొత్తానికి ఈ ఘటనతో బీఆర్ ఎస్ తన నిరసనను వాయిదా వేస్తుందా.. లేక కొనసాగిస్తుందా? అనేది చూడాలి.
