కవితా.. అసలు నీ స్థాయేంటి: కాంగ్రెస్ ఫైర్
ఈ వ్యవహారంపై మహేష్ గౌడ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అసలు కవిత ఏ హోదాతో తమకు లేఖ రాశారో చెప్పాలన్నారు.
By: Tupaki Desk | 3 July 2025 10:45 PM ISTతెలంగాణలో రిజర్వేషన్ అంశం.. రాజకీయ రంగు పులుముకుంది. త్వరలోనే హైకోర్టు ఆదేశాల మేరకు.. రాష్ట్ర సర్కారు పంచాయతీ ఎన్నికలకు రెడీ కావాల్సి ఉంది. అయితే.. ఈ క్రమంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని.. బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె గురువారం కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు.ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఏపీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
కవిత రాసిన లేఖలో.. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను రిజర్వేషన్ అమలు కాకుండా నిర్వహించవద్దన్నారు. అంతేకాదు.. తాము రిజర్వేషన్ కోసం రైలు రోకో నిర్వహిస్తున్నామని.. మీరు(కాంగ్రెస్) కూడా మాతో జాయిన్ కావాలని.. తద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. రిజర్వేషన్ విషయాన్ని తేల్చుకుందామని.. కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు పేల్చారు. అంతేకాదు.. రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే.. తాము అడ్డుకుంటామన్నారు.
ఈ వ్యవహారంపై మహేష్ గౌడ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అసలు కవిత ఏ హోదాతో తమకు లేఖ రాశారో చెప్పాలన్నారు. ఆమె బీఆర్ ఎస్ నాయకురాలిగా లేఖ రాశారా? లేక తెలంగాణ జాగృతి సంస్థ తరఫున లేఖ రాశారో ముందు చెప్పాలని నిలదీశారు. అంతేకాదు.. అసలు రాష్ట్రంలో రిజర్వేషన్ల గురించి అడిగే హక్కు బీఆర్ ఎస్ కు కానీ.. కవితకు కానీ లేదన్న మహేష్ గౌడ్ గతంలో ఈ విషయం కవితకు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.
గతంలో మహిళలకు బీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనప్పుడు.. కనీసం ఒక మంత్రిని కూడా తీసు కోనప్పుడు.. కవిత ఎందుకు ప్రశ్నించలేదన్నారు. అంతేకాదు.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌ను 21 శాతానికి తగ్గించింది ఎవరో కవిత తెలుసుకోవాలని విమర్శించారు. బీఆర్ ఎస్ ప్రభుత్వమే స్థానిక రిజర్వేషన్ గొంతు కోసి.. ఇప్పుడు తగుదునమ్మా అంటూ.. కన్నీరు పెడుతోందని ఎద్దేవా చేశారు. ఇలాంటి కుప్పిగంతులు బీఆర్ ఎస్ భవన్ ముందు వేసుకోవాలని మహేష్ చురకలు అంటించారు.
