అంతర్గత ఘర్షణలకు ఫుల్‌స్టాప్.. కవిత కేటీఆర్ లను కేసీఆర్ కలిపేశాడా?
ఈ ఉదయం ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు మరోసారి నోటీసు పంపారు.
By: Tupaki Desk | 14 Jun 2025 5:42 AMతెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) మరియు ఆయన సోదరి కల్వకుంట్ల కవిత మధ్య పార్టీలో విభేదాలు ఉన్నాయన్న వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నప్పటికీ, ఇవాళ ఈ వార్తలకు చెక్ పెడుతూ కవిత స్పందించారు. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) తాజాగా జారీ చేసిన నోటీసులను ఆమె తీవ్రంగా ఖండించారు.
మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ – "మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు జారీ చేసిన ఏసీబీ నోటీసులు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వపు కక్ష సాధింపు చర్యలే. మేము దీనిని గట్టిగా ఖండిస్తున్నాం. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీని మేము ప్రజల ముందు విఫలమైన ప్రభుత్వం అని నిరూపిస్తూనే ఉంటాం" అని పేర్కొన్నారు.
ఈ ఉదయం ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు మరోసారి నోటీసు పంపారు. జూన్ 16వ తేదీ ఉదయం 10 గంటలకు ఆయన హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. గతంలో మే 26న విచారణ నిమిత్తం నోటీసు జారీ చేసినా, విదేశీ (అమెరికా, బ్రిటన్) పర్యటనల నేపథ్యంలో కేటీఆర్ అభ్యర్థన మేరకు విచారణను వాయిదా వేశారు.
ఫార్ములా ఈ రేస్ ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఏసీబీ, కేటీఆర్‌తో పాటు రాష్ట్ర ఉన్నతాధికారి అర్వింద్ కుమార్‌పై కూడా కేసు పెట్టింది. జనవరిలో రెండు సార్లు కేటీఆర్ ఏసీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. అంతేకాకుండా జనవరి 16న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట కూడా విచారణకు హాజరయ్యారు.
ఈ పరిణామాల నేపథ్యంలో తమ్ముడికి మద్దతుగా సోదరి కవిత ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.