Begin typing your search above and press return to search.

అహంకారంతోనే అధికారం కోల్పోయారు..కేసీఆర్ పై కవిత షాకింగ్ వ్యాఖ్యలు

కేసీఆర్ ముందు కూర్చునే ధైర్యం చేయని ఆయన కుటుంబ సభ్యులు.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఆయన కన్నకుమార్తె చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే.. కాలానికి మించిన శక్తివంతమైనది మరేదీ ఉండదన్న భావన కలుగుతుంది.

By:  Garuda Media   |   13 Feb 2026 11:39 AM IST
అహంకారంతోనే అధికారం కోల్పోయారు..కేసీఆర్ పై కవిత షాకింగ్ వ్యాఖ్యలు
X

కాలం మహాసిత్రమైంది. తిరుగులేదనుకునే వారెవరూ.. ఆ తర్వాతి కాలంలో అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. ఎవరినైనా కనుసైగతో నియంత్రించి.. నోట్లో నుంచి మాట రాకుండా చేసే పవర్ ఫుల్ వ్యక్తులు తర్వాతి కాలంలో ప్రతి ఒక్కరి నోట్లో నానే ధోరణి పలు సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు దీనికి మించి ఉందన్నట్లుగా మారింది. కేసీఆర్ ముందు కూర్చునే ధైర్యం చేయని ఆయన కుటుంబ సభ్యులు.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఆయన కన్నకుమార్తె చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే.. కాలానికి మించిన శక్తివంతమైనది మరేదీ ఉండదన్న భావన కలుగుతుంది.

తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవసభలో మాట్లాడిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోయాయని.. అహంకార ధోరణితో వ్యవహరించటం.. సహనశీలత లేకపోవటంతోనే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందన్నారు. కేసీఆర్ హయాంలో ధర్నాచౌక ఎత్తేశారని.. నాటి పాలకుల్లో అసహనం ఎక్కువై.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే వారిని అక్రమంగా అరెస్టు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పదేళ్లు అధికారం ఇస్తే ఉద్యమకారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేయలేకపోయిందన్న కవిత.. ‘‘కేసీఆర్ కు మొదటిసారి అధికారం ఇస్తే.. అన్ని పార్టీలు బీఆర్ఎస్ లో విలీనం అయ్యాయి. దీంతో ఏ పార్టీకి ఓటు వేసినా ఆ నేతలు బీఆర్ఎస్ లోకే వస్తారన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారంతా టీఆర్ఎస్ లోకి రావటాన్ని ఉద్యమకారులుగా మేం ఎవ్వరం తట్టుకోలేకపోయాం. మమ్మల్ని పోలీసులతో కొట్టించిన వాళ్లే తిరిగి కేసీఆర్ పక్కన కూర్చోవటం ఉద్యమకారులను బాధించింది. తెలంగాణేతరులైన ఎంతోమందికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం.. కేశవరావు జాదవ్ లాంటి వారి పట్ల ఎందుకు వివక్ష చూపింది? ఉద్యమారుల పట్ల గత ప్రభుత్వ వైఖరిపై వారు బయట బాధ పడి ఉంటే.. నేను పార్టీలో ఉండి బాధపడ్డా. జీ హుజూర్ అని ఉంటే నేను బాగానే ఉండేదాన్ని. క్యాహుజూర్ అని ప్రశ్నించటంతోనే పార్టీలో నుంచి బయటకు వచ్చా’’ అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

అప్పట్లో ఉద్యమకారులను పొట్టనబెట్టుకున్న కాసుబ్రహ్మానందరెడ్డి పేరుతో ఉన్న కేబీఆర్ పార్కు ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా ఆ పేరుతో కొనసాగటం బాధాకరమన్న కవిత.. ఆ పార్కు ముందు జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తాను మున్సిపల్ మంత్రిని ఇదే విషయాన్ని పదే పదే అడిగినా లాభం లేకపోయిందన్నారు. ఇప్పుడు వచ్చిన ఆయన అయితే ఎవరెవరి బొమ్మలు పెడుతున్నారో అర్థం కావటం లేదని.. సీఎం రేవంత్ తీరును తప్పు పట్టారు.

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు పట్టించుకోలేదు కాబట్టే పెద్దమనిషి ఓడిపోయారంటూ కేసీఆర్ ను ఉద్దేశించి కవిత కీలక వ్యాఖ్య చేశారు. అలాంటి పనే చేస్తే బంగ్లా బయటకు గుంజుతారు రేవంత్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె రేవంత్ పేరును ప్రస్తావించకుండా.. ‘‘మీరు అదే పని చేస్తే బంగ్లా బయటకు గుంజుతాం రెడ్డి గారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మరీ ఉద్యమకారుల పట్ల వ్యవహరించండి’’ అంటూ వార్నింగ్ ఇవ్వటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. కేసీఆర్ ను పలువురు విపక్ష నేతలు సైతం అనలేని మాటల్ని కవిత అనటం చూస్తే.. రానున్న రోజుల్లో ఈ విమర్శల తీవ్రత మరింత పెరగటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.