ఈగ వాలినా ఊరుకోమని.. ఇవేం దెబ్బలు తల్లీ?
మనకో పాత సామెత ఉంది. నోటితో నవ్వి నొసటితో చిట్లించటమన్న దీనికి కాస్త వేరుగా తెలంగాణలోని విపక్ష బీఆర్ఎస్ పార్టీలో పంచాయితీ నడుస్తోంది
By: Tupaki Desk | 1 Jun 2025 10:23 AM ISTమనకో పాత సామెత ఉంది. నోటితో నవ్వి నొసటితో చిట్లించటమన్న దీనికి కాస్త వేరుగా తెలంగాణలోని విపక్ష బీఆర్ఎస్ పార్టీలో పంచాయితీ నడుస్తోంది. బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత.. గడిచిన కొన్నిరోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు.. ఆమె చేతలు పార్టీకి ఎంత డ్యామేజ్ జరగాలో అంత డ్యామేజ్ చేస్తున్న పరిస్థితి. ఓవైపు తన తండ్రి చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్న ఆమె.. వాటి బారి నుంచి తన తండ్రి కం అధినేతను కాపాడేందుకు యుద్ధం చేయాల్సిన ఆమె.. అందుకు భిన్నంగా బహిరంగంగా వచ్చి పార్టీ పరువును బజారున పెట్టటం కనిపిస్తుంది.
ఇదంతా చేస్తూనే.. మరోవైపు కేసీఆర్ ఒంటి మీద ఈగ వాలినా తాను ఊరుకోనన్న హెచ్చరికను చేస్తున్నారు కవిత. ఈగ వాలటం కూడా ఇష్టం లేనప్పుడు.. గడిచిన వారంగా ఆమె చేస్తున్నదేమిటి? ఆమె మాటలతో పార్టీకి మేలు జరుగుతుందా? ఆమె తీరుతో కేసీఆర్ ఆత్మరక్షణలో పడిపోయారు కదా? ఇలా కేసీఆర్ కు ఇబ్బంది కలిగించే పనులన్నీ చేస్తూ.. మరోవైపు అందుకు భిన్నమైన మాటలు మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకుందని పేర్కొంటూ కాళేశ్వరం కమిషన్ ఆయనకు నోటీసులు ఇవ్వటాన్ని నిరసిస్తూ.. ఈ నెల నాలుగున ఇందిరాపార్కు వద్ద మహాధర్మా చేస్తున్నట్లుగా వెల్లడించారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటమంటే.. యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చేసినట్లేనని పేర్కొన్నారు. తన పోరాటాన్ని చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని చెబుతున్న కవిత.. త్వరలోనే జాగ్రతి ఎస్సీ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
రాష్ట్ర యువకుల కోసం చేపట్టే ఏ పథకానికైనా తెలంగాణ వాదుల పేర్లు పెట్టాలన్న కవిత.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. మహిళలకు రూ.2500 ఆడపిల్లలకు.. స్కూటీలు విద్యార్థినులకు చేరే వరకు తాను ఉద్యమిస్తానని పేర్కొన్నారు. యువత కోసం చేపట్టే పథకాలకు తెలంగాణవాదుల పేర్లు పెట్టాలన్న కవిత.. తన తండ్రి పదేళ్ల పాలనలో ఎన్ని తెలంగాణవాదుల పేర్లు పెట్టారో వెల్లడించాలని కోరుతున్నారు. ఇదంతా చూసినప్పుడు ఓవైపు ఈగవాలినా ఊరుకోమంటూనే.. దానికి మించి డ్యామేజ్ చేస్తున్న కవిత మాటలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడేనో? ఎవరు బ్రేకులు వేస్తారో ? అన్నదిప్పుడు అసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.
