Begin typing your search above and press return to search.

చింత‌మ‌డ‌క‌కు రా చెల్లె... క‌విత‌కు తండ్రి ఊరి నుంచి ఆహ్వానం

బీఆర్ఎస్ నుంచి స‌స్పెన్ష‌న్ కు గురైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు అనూహ్య పిలుపు అందింది..

By:  Tupaki Desk   |   12 Sept 2025 9:34 AM IST
చింత‌మ‌డ‌క‌కు రా చెల్లె... క‌విత‌కు తండ్రి ఊరి నుంచి ఆహ్వానం
X

అస‌మ్మ‌తి గ‌ళం వినిపించి.. పార్టీ కీల‌క నేత‌ల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు గుప్పించి... బీఆర్ఎస్ నుంచి స‌స్పెన్ష‌న్ కు గురైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు అనూహ్య పిలుపు అందింది.. పుట్టింటికి ఆడ‌బిడ్డ అన్న‌ట్లు.. పండుగ‌కు మ‌న ఊరికి ర‌మ్మ‌ని ఆహ్వానం వ‌చ్చింది. అది కూడా క‌విత ఎంతో ఘ‌నంగా జ‌రుపుకొనే పండుగ ప్రారంభానికి కావ‌డం గ‌మ‌నార్హం.

మ‌రో ప‌దిరోజుల్లో

తెలంగాణ‌లో మ‌రో ప‌ది రోజుల్లో బ‌తుక‌మ్మ సంబురాలు మొద‌లుకానున్నాయి . ఈ నెల 21న ఎంగిలి పూల బ‌తుక‌మ్మ‌తో మొద‌ల‌య్యే ఈ వేడుక‌ల‌కు చింతమడక రావాల్సిందిగా ఆ గ్రామ వాసులు క‌విత‌ను కోరారు. ఈ మేర‌కు పెద్దసంఖ్యలో తరలివచ్చిన చింతమడక గ్రామస్తులు సాద‌రంగా ఆహ్వానం ప‌లికారు. క‌విత తెలంగాణ జాగృతి పేరిట బ‌తుక‌మ్మ వైభ‌వాన్ని ప్ర‌పంచానికి చాటిన సంగ‌తి తెలిసిందే. ఉద్య‌మ స‌మ‌యంలో ఈ సంస్థ ప‌ల్లెప‌ల్లెన బ‌తుక‌మ్మ వేడుక‌ల‌కు తోడ్ప‌డింది. బీఆర్ఎస్ నుంచి స‌స్పెన్ష‌న్ కు గురైనా జాగృతి అధ్యక్షురాలిగా ఆమెనే ఉన్నారు. క‌విత స్థాపించిన సంస్థ‌నే కాబ‌ట్టి దీనిపై ఎవ‌రూ ఏమీ అన‌లేని ప‌రిస్థితి.

నాన్న ఎదిగిన‌ ఊరి నుంచి...

కేసీఆర్ స్వ‌గ్రామం చింత‌మ‌డ‌క‌. సిద్దిపేట నియోజ‌క‌వ‌ర్గంలోని ఈ గ్రామ వ్య‌వ‌సాయ స‌హ‌కార ప‌ర‌ప‌తి సంఘం (పీఏసీఎస్‌) అధ్య‌క్షుడిగా గెల‌వ‌డం నుంచే కేసీఆర్ రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైంది. అక్క‌డినుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీక‌ర్‌గా, టీఆర్ఎస్ వ్య‌వ‌స్థాప‌కుడిగా, ముఖ్య‌మంత్రిగా ఎదిగారు కేసీఆర్‌. ఇప్ప‌టికే కేసీఆర్ త‌మ ఊరి వారు అని చింత‌మ‌డ‌క వాసులు గొప్ప‌గా చెప్పుకొంటారు. ఇక అలాంటి చింత‌మ‌డ‌క వాసులు బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి పెద్దసంఖ్యలో తరలివచ్చి క‌వితతో స‌మావేశం అయ్యారు.

చింత‌మ‌డ‌క చాలా నేర్పింది...

ఇక చింత‌మ‌డ‌క వాసుల‌తో భేటీ సంద‌ర్భంగా క‌విత‌ త‌న చిన్న‌నాటి సంగ‌తుల‌ను గుర్తుచేసుకున్నారు. ఆ గ్రామం నుంచి తాను ఎంతో నేర్చుకున్న‌ట్లు చెప్పారు. చిన్నప్పుడు చింతమడక లో బతుకమ్మ ఆడిన రోజుల‌ను ఇంకా క‌ళ్లెదుటే క‌నిపిస్తున్న‌ట్లు తెలిపారు.

ఈ క‌ష్ట‌కాలంలో...

చింత‌మ‌డ‌క వాసుల‌తో స‌మావేశంలో క‌విత మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలో ఇంత పెద్ద ఎత్తున గ్రామ‌స్థులు వ‌చ్చి త‌న‌ను ఆహ్వానించ‌డం చాలా ధైర్యం ఇచ్చింద‌ని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నుంచి స‌స్పెన్ష‌న్ ను ప‌రోక్షంగా ప్ర‌స్తావించ‌కుండా ఇలా పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో మా చింత‌మ‌డ‌క గ్రామం గొప్ప ఉద్యమకారుడి (కేసీఆర్‌)ని కన్న గొప్ప ఊరు అని ప్ర‌శంసించారు.

తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం గౌర‌వ అధ్య‌క్షురాలి ప‌ద‌వి కోల్పోయి, బీఆర్ఎస్ నుంచి స‌స్పెన్ష‌న్ కు గురైన స‌మ‌యంలో క‌విత‌కు ద‌క్కిన ఊర‌ట‌గా దీనిని భావించ‌వ‌చ్చు.