Begin typing your search above and press return to search.

తెలంగాణ భవన్ కు కవితకు నోఎంట్రీనా?

గులాబీ తోటలో నెలకొన్న విభేదాలు అంతకంతకూ ముదురుతున్నాయా? అంటే అవునన్నట్లుగా కొన్ని పరిణామాలు వెలుగు చూస్తున్నాయి.

By:  Tupaki Desk   |   14 July 2025 11:33 AM IST
తెలంగాణ భవన్ కు కవితకు నోఎంట్రీనా?
X

గులాబీ తోటలో నెలకొన్న విభేదాలు అంతకంతకూ ముదురుతున్నాయా? అంటే అవునన్నట్లుగా కొన్ని పరిణామాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మధ్యన ఎమ్మెల్సీ కవిత చేసిన హాట్ వ్యాఖ్యలు.. తదనంతరం చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆమెకు బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లోకి ఎంట్రీ లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. నిత్యం ప్రతి అంశం మీదా స్పందించే ఆమె.. తన కార్యకలాపాలకు.. మీడియాతో మాట్లాడేందుకు వేర్వేరు వేదికల్ని వినియోగించుకుంటున్నారే తప్పించి.. తెలంగాణ భవన్ లో మాత్రం మీడియాతో మాట్లాడటం కనిపించదు.

ఆదివారం కవిత అభిమానులు పలువురు.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూటీవీ ఆఫీస్ మీదకు దాడికి వెళ్లటం.. ఆందోళనలు చేపట్టటం.. ఆపై దాడికి పాల్పడటం తెలిసిందే. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ఇటీవల జహీరాబాద్ లో నిర్వహించిన బీసీ నేతల సమావేశంలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. జాగ్రతి నేతలు తీన్మార్ మల్లన్న కార్యాలయానికి వచ్చారు. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి దాడి చేశారు.

అడ్డుకున్న సిబ్బందిని తోసేసి ఫర్నిచర్.. కిటికీలను ధ్వంసం చేశారు. ఈ సమయంలో మల్లన్న తన ఛాంబర్ లోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన చేతికి స్వల్ప గాయమైంది. ఆందోళనకు సంబంధించిన సమాచారాన్ని అందుకున్న మేడిపల్లి ఇన్ స్పెక్టర్ ఆర్ గోవిందరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆందోళనాకారులు పలువురు పరారయ్యారు. ఈ ఎపిసోడ్ కు కవిత.. వేగంగా స్పందించటం తెలిసిందే.

ఆమె మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆయన ఇంట్లో కలిసి.. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరటం.. డీజీపీ కార్యాలయంలో ఐజీ శాంతిభద్రతలు రమణకుమార్ కు ఫిర్యాదు చేయటం తెలిసిందే. ఇంతా చేసిన ఆమె.. మీడియాతోనూ మాట్లాడారు. అంతే తప్పించి.. తెలంగాణ భవన్ కు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టకపోవటం గమనార్హం. ఇంత పెద్ద అంశం జరిగినప్పుడు పార్టీ ప్రధాన కార్యాలయంలో కవిత కానీ.. ఆమె తరఫు వారు కానీ.. తోటి బీఆర్ఎస్ నేతలు కానీ ఎవరూ స్పందించకపోవటం.. తెలంగాణ భవన్ లో కవితకు మద్దతుగా మాట్లాడిన వైనం కనిపించదు. ఇదంతా చూసినోళ్లు.. కవితను తెలంగాణ భవన్ లోకి అడుగు పెట్టకుండా అప్రకటిత ఆంక్షలు విధించారా?అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.