కవితకు న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీనా ?
కల్వకుంట్ల కవిత్ డాటర్ ఆఫ్ కేసీఅర్. ఈ నేపథ్యం ఆమెను ప్రజా జీవితంలోనూ రాజకీయంగానూ ముందుంచింది.
By: Tupaki Desk | 28 Nov 2025 9:04 AM ISTకల్వకుంట్ల కవిత్ డాటర్ ఆఫ్ కేసీఅర్. ఈ నేపథ్యం ఆమెను ప్రజా జీవితంలోనూ రాజకీయంగానూ ముందుంచింది. ఆమె తెలంగాణా జాగృతి పేరిట సంస్థ నెలకొల్పినా తెలంగాణా ఉద్యమంలో పాలు పంచుకున్నా చాలా మంది నేతల కంటే తెలంగాణా రాజకీయాల్లో ఆమె పేరు ముందు వినిపించడానికి కారణం కేసీఆర్ అన్న మూడు అక్షరాలే అని అంటారు. కవిత తాను కేసీఅర్ ఫోటో వాడను బీఆర్ఎస్ పేరు తలవను అని చెప్పినా జనాలు మాత్రం ఆమెను కేసీఅర్ కుమార్తెగానే ఆదరిస్తున్నారు అన్నది ఒక కఠినమైన విశ్లేషణగా ఉంది.
పర్యటనలతో అలా :
ఇక కవిత గత నెల నుంచి జనంలో ఉంటున్నారు. ఆమె జిల్లా పర్యటనలు చేస్తున్నారు, వివిధ వర్గాల ప్రజలను కలుస్తున్నారు. ఇక మీడియాతో ఇంటరాక్షన్ కూడా బాగానే చేస్తున్నారు. అయితే కవిత ఎక్కడ ఏమి మాట్లాడినా బీఅర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నారు. లోకల్ గా ఉన్న లీడర్లను ఆమె విమర్శిస్తూ ఘాటైన రాజకీయానికి తెర తీస్తున్నారు. అంతే కాదు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఆమె వేసిన ట్వీట్ కూడా రాజకీయంగా వైరల్ అయింది.ఖమ్మం లో ఆమె మాట్లాడుతూ తుమ్మల నాగేశ్వరరావు వంటి వారిని దూరం పెట్టడం వల్లనే పార్టీ ఓడింది అని చెప్పుకొచ్చారు. ఇలా ఆమె బీఆర్ఎస్ తప్పులను ఇవీ అని తనదైన కోణంలో ప్రతీ రోజూ ఎక్కడో ఒకచోట ఏకి పారేస్తున్నారు. దాంతో గులాబీ పార్టీలో నేతలు దీని మీద మల్లగుల్లాలు పడుతున్నారు.
డోస్ పెంచిన బీఆర్ఎస్ :
మరో వైపు చూస్తే బీఆర్ ఎస్ నేతలు కూడా గతంలో మాదిరిగా స్మూత్ గా వ్యవహరించడం లేదు. ఆమెకు మాటకు మాట అప్ప చెబుతున్నారు. అంతే కాదు ఆమె మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఆమె కేసీఆర్ కుమార్తె అని గతంలో కొంత మెత్తగా మాట్లాడిన వారు సైతం ఇపుడు ఆమె మీద హీటెత్తించే విమర్శలు చేస్తున్నారు అంటే దాని వెనక అధినాయకత్వం ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. ఆ జోరుతోనే లిక్కర్ రాణి అని కవితను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించడం చర్చనీయాంశం అయింది. ఇప్పటిదాకా బీఆర్ఎస్ లో ఎవరూ ఆ విమర్శలు చేయలేదు. అఫ్ కోర్స్ కవిత ఈ కేసులో అరెస్ట్ అయి జైలులో కొన్నాళ్ళు ఉన్నారు. దాని మీద ప్రత్యర్ధులు అడపా దడపా ఏమైనా అంటే అన్నారు కానీ బీఆర్ఎస్ నుంచి ఒక్క నేత కూడా ఏమీ అనలేదు. కానీ ఇపుడు ఒక మాజీ మంత్రి ఈ విధంగా విమర్శించారు అంటే కవిత విషయంలో బీఆర్ఎస్ పెద్దల ఆలోచనలు మారుతున్నాయని అంటున్నారు.
బహిష్కరణ అస్త్రం :
ఇక బీఆర్ఎస్ కవితతో తమకు ఎటువంటి బంధం లేదని స్పష్టంగా పార్టీ క్యాడర్ కి అలాగే తెలంగాణా రాజకీయానికి జనాలకు చెప్పడానికి బహిష్కరణ అస్త్రం ఆమె మీద ప్రయోగించవచ్చు అని అంటున్నారు. ఆమెను ఇప్పటిదాకా సస్పెండ్ తోనే సరిపెట్టారు. మనసు మార్చుకుంటే తిరిగి చేర్చుకోవాలని అలా చేశారు అని అంటున్నారు కానీ జరుగుతున్నది వేరుగా ఉందని అంటున్నారు. కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు లేదా వేరే రాజకీయం చేయాలని చూస్తున్నారు అని బీఆర్ఎస్ పెద్దలు అనుమానిస్తున్నారు ఈ క్రమంలో ఆమెకు పార్టీ నుంచి పూర్తిగా బంధాలు తెంచేలా తీవ్ర చర్యలకే దిగబోతున్నారు అని టాక్ అయితే ప్రచారంలో ఉంది. బహుశా అది ఈ ఏడాదిలో జరుగుతుందా లేదా కొత్త ఏడాది గిఫ్ట్ గా రెడీ చేస్తున్నారా అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు.
