కవిత ఫస్ట్రేషన్ వెనుకున్న అసలు కారణమేంటి?
ఇంతకూ కవిత కోరుకునేదేమిటి? ఆమె పోలిక పెట్టుకునే వారెవరు? అన్న విషయంలోకి వెళితే.. ఆ జాబితాలో కనిపించే పేర్లు మూడు. ఒకటి తన సోదరుడు కేటీఆర్.. రెండో పేరు తన బావ హరీశ్ రావు.. మూడో వ్యక్తి తమ దగ్గర బంధువు సంతోష్ గా చెప్పాలి.
By: Tupaki Desk | 25 May 2025 9:00 PM ISTబీఆర్ఎస్ కు సుప్రీంగా ఉన్న తన తండ్రి కేసీఆర్ కు సలహాలు ఇచ్చేంతగా కవిత పెద్దమనిషి అయ్యారా? అన్న మాట కొందరి నోట వినిపిస్తోంది. ఇంతకూ ఆమె ఈ దిశగా అడుగులు పడటానికి అసలు కారణం ఏమిటి? అసలు పంచాయితీ ఎక్కడ మొదలైంది? దానికి దారి తీసిన కారణాలేంటి? పార్టీలో తిరుగులేని అధిక్యం కేసీఆర్ దే అయినా.. ఆయన్ను ప్రభావితం చేసే జాబితాలో తను లేకపోవటమే కవిత ఆగ్రహానికి.. ఆవేదనకు కారణాలుగా చెబుతారు. పార్టీలో ఆమె ఎదుర్కొంటున్న ఇష్యూలేంటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఇంతకూ కవిత ఏం కోరుకుంటున్నారు? పార్టీ అధినేత మొదలు ముఖ్యనేతల వరకు అందరూ తన కుటుంబసభ్యులు లాంటివారే. అయినప్పటికీ ఆమె నోటి నుంచి దేవుడి చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయి.. అన్న మాట వచ్చిందంటే దాని వెనుక బలమైన అంశాలు కచ్ఛితంగా ఉంటాయని చెప్పాలి. ఇంతకూ అవేంటి? కవిత కోరుకుంటున్న సముచిత ప్రాధాన్యంలో న్యాయం ఏంత? ధర్మం పాళ్లు కూడా ఉన్నాయా? లాంటి ప్రశ్నలు తలెత్తుతాయి.
ఇంతకూ కవిత కోరుకునేదేమిటి? ఆమె పోలిక పెట్టుకునే వారెవరు? అన్న విషయంలోకి వెళితే.. ఆ జాబితాలో కనిపించే పేర్లు మూడు. ఒకటి తన సోదరుడు కేటీఆర్.. రెండో పేరు తన బావ హరీశ్ రావు.. మూడో వ్యక్తి తమ దగ్గర బంధువు సంతోష్ గా చెప్పాలి. వీరికి పార్టీలో ఉన్న ప్రాధాన్యతకు ఏ మాత్రం తీసిపోని ప్రాధాన్యాన్ని కవిత కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు. నిజానికి కవితకు ఈ ముగ్గురితో ఉన్న పంచాయితీ ఏమిటి? అన్నది చూస్తే.. తన తండ్రితో తాను మాట్లాడుకోవాలన్నా.. తనకు కావాల్సినవారి సమస్యల్ని.. వారి పనుల్ని తండ్రితో మాట్లాడించేందుకు ఆమె ప్రయత్నిస్తే.. సంతోష్ అడ్డుపడుతుంటారని.. ఇది ఆమెకు తీవ్ర ఆగ్రహానికి గురి చేసే అంశంగా చెబుతారు.
హరీశ్ విషయానికి వస్తే..పార్టీలో ఆయన పరిస్థితి మిథ్యగా చెబుతారు. అటు ప్రాధాన్యత ఉందని చెప్పలేరు. అలా అని ఉన్నదని బల్లగుద్ది చెప్పలేని పరిస్థితి. హరీశ్ ఇబ్బందులు కవితకు తెలియనివి కాదు. అయితే.. ట్రబుల్ షూటర్ గా ఆయనకు ఉండే ప్రాధాన్యత పార్టీలో మరెవరికీ ఉండదన్నది తెలిసిందే. ఆ మాటకు వస్తే హరీశ్ కు ఉన్న తనను మాత్రమే అమితంగా అభిమానించే ఎమ్మెల్యేల బలం.. తనకంటూ ఒక వర్గాన్ని నడిపించే శక్తిసామర్థ్యాలు సొంతం. అలాంటివి తనకు లేకపోవటాన్ని కవిత జీర్ణించుకోలేకపోతారని చెబుతారు. హరీశ్ కు ఉండే మార్గాలు తనకు లేకుండా చేశారన్న ఆవేదనను కవిత తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తారని చెబుతారు. ఇక.. తన సోదరుడు కేటీఆర్ విషయానికి వస్తే.. అతడికిచ్చే ప్రాధాన్యత తనకు ఎందుకు ఇవ్వరన్నది ఆమె ప్రధాన ప్రశ్న.
తన సోదరుడి మాదిరి మాటకారితనం.. విషయాల మీద పట్టు.. ప్రత్యర్థులపై విరుచుకుపడే తత్త్వం అన్ని ఉన్నప్పటికి.. సమ ప్రాధాన్యత ఇవ్వకపోవటం ఏమిటి? అన్న వాదనను తరచూ లేవనెత్తుతారని చెబుతారు. కేవలం అమ్మాయి కావటం వల్లే తనకు అవకాశం దక్కుండా చేస్తే తాను ఊరుకోనని తెగేసి చెబుతారన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. కాలక్రమంలో ఇది అంతకంతకూ పెరిగి పెద్దదై..ఈ రోజున ఇక్కడి వరకు వచ్చిందని చెబుతారు. మరి.. రేపేం జరుగుతుందో చూడాలి.
