బీఆర్ఎస్ రాంగ్...కాంగ్రెస్ కరెక్ట్...కవిత రూటు ఎటు ?
ఇదిలా ఉంటే తాజాగా కవిత మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ తనకు మరింత దూరం పెరిగిందని సంకేతాలు ఇచ్చేశారు.
By: Tupaki Desk | 17 July 2025 12:33 PM ISTబీఆర్ఎస్ నుంచి మెల్లగా కవిత దూరం అయిపోతున్నారు. కల్వకుంట్ల కవిత కాస్తా జాగృతి కవితగా పరిణామ క్రమం చెందారు. ఆమెది సొంత జెండా సొంత అజెండాగా మారింది. బీఆర్ఎస్ లో అన్న కేటీఆర్ తండ్రి కేసీఆర్ ఉండగానే తనకు సరైన రాజకీయ న్యాయం జరగదని ఆలోచించారో ఏమో లేక ఈ ఎమ్మెల్సీ పదవే తనకు చివరి అధికార మజిలీ అక్కడ అని ఊహించారో తెలియదు కానీ కవిత మాత్రం సొంతంగానే అడుగులు వేస్తున్నారు.
అయితే ఆమె బీసీలకు మద్దతుగా 42 శాతం రిజర్వేషన్లు వారికి దక్కాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో ఆ రిజర్వేషన్ కోటాతోనే ముందుకు వెళ్ళాలని కూడా కోరారు. దాంతో ఆమె బీసీలను దగ్గర చేసుకుని పార్టీ పెడతారు అన్న ప్రచారం నిన్నా మొన్నా దాకా సాగింది.
ఇదిలా ఉంటే తాజాగా కవిత మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ తనకు మరింత దూరం పెరిగిందని సంకేతాలు ఇచ్చేశారు. తన మీద తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఖండించలేదని కూడా ఆమె ఎత్తి చూపారు. ఇక బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకుని రావడాన్ని ఆమె సమర్ధించారు. ఇది కరెక్ట్ నిర్ణయమే అని అన్నారు. ప్రస్తుతం ఈ ఆర్డినెన్స్ గవర్నర్ పరిశీలనలో ఉంది.
తన మాదిరిగా ఆలోచించడానికి బీఆర్ఎస్ నేతలకు మరో నాలుగైదు రోజులు సమయం పట్టవచ్చు అని ఆమె అంటున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం తప్పేనని ఆమె అంటున్నారు. బీసీలకు న్యాయం చేసే విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కరెక్ట్ గానే వ్యవహరించింది అని ఆమె అన్నారు.
బీసీలకు న్యాయం చేయాలంటే చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తీసుకుని రావడం కంటే ఇపుడు మేలైన మార్గం ఏమిటి అని ఆమె అంటున్నారు. ఆ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది రైట్ అనేశారు. తాను ఈ విషయంలో న్యాయ నిపుణులతో చర్చించిన మీదటనే ఈ ఆర్డినెన్స్ కి మద్దతు ప్రకటించాను అని ఆమె అన్నారు. బీఆర్ఎస్ నాయకులు తన దారికి రావాల్సిందే అని ఆమె అంటున్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ అంటే ఒంటి కాలి మీద లేచే బీఆర్ఎస్ లో అందునా కేసీఆర్ కుమార్తెగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం బాగుందని బాహాటంగా సమర్ధించడం అంటే కవిత ఆలోచనలు వ్యూహాలు ఏమిటి అన్న చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ దే తప్పు అని ఆమె చెప్పడమూ ఆలోచించాల్సిందే అంటున్నారు.
ఇదిలా ఉంటే లిక్కర్ స్కాం లో గత ఏడాది తీహార్ జైలుకు వెళ్ళి వచ్చిన కవిత నాటి నుంచే పార్టీ తీరు మీద అసహనంగా ఉంటున్నారు అని అంటున్నారు. తనకు పార్టీలో మద్దతు దక్కడం లేదని ఆమె ఆవేదన చెందుతున్నారు అని అంటున్నారు
దాంతో ఆమె తన దారి తాను చూసుకుంటున్నట్లుగానే కనిపిస్తోంది. ఆమె తాజాగా కాంగ్రెస్ ని పొగడం తో ఆమె ఆ పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారా అన్నది చర్చగా ఉంది. కాంగ్రెస్ మహా సముద్రం. జాతీయ పార్టీ. అక్కడ అవకాశాలు బాగానే ఉంటాయి. పైగా కవిత కేసీఆర్ కుమార్తె కావడంతో ఆమె వస్తే కనుక ప్రయారిటీ బాగానే ఉంటుంది అని అంటున్నారు.
అయితే సొంతంగా పార్టీ పెట్టి ముందు తన బలాన్ని నిరూపించుకున్న తరువాత అపుడు కాంగ్రెస్ లో చేరేందుకు చూస్తే రాజకీయ లాభం బాగా ఉంటుందని కవిత ఆలోచిస్తున్నారా అన్నది మరో చర్చగా ఉంది ఏది ఏమైనా కవిత మా ఇంటి ఆడపడుచు అయినా రాజకీయంగా ఆమె కాదని కల్వకుంట్ల ఫ్యామిలీ డిసైడ్ అయిన రోజునే కవిత అసలు రాజకీయం మొదలవుతుందని అంటున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ రోజు ఎంతో దూరంలో లేదని అంటున్నారు.
