Begin typing your search above and press return to search.

కవిత చిట్ చాట్ సారాంశం ఏంటి? గ్రౌండ్ రిపోర్టు!

అదే సమయంలో బీజేపీని పార్టీలో కలిపేందుకు వందశాతం ప్రయత్నాలు జరిగాయని.. తాను జైల్లో ఉన్నప్పుడే ఇదంతా జరిగిందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు.

By:  Tupaki Desk   |   30 May 2025 10:00 AM IST
కవిత చిట్ చాట్ సారాంశం ఏంటి? గ్రౌండ్ రిపోర్టు!
X

కవిత తన స్వరాన్ని పెంచారు. తాజాగా చిట్ చాట్ నిర్వహించిన సందర్భంగా ఆమె ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో మనసు విప్పి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు.. ఎవరిని టార్గెట్ చేశారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర సమాధానాలు లభిస్తాయి. తాను కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన లేదని కుండ బద్ధలు కొట్టిన ఆమె.. మునిగే నావలో నేనెందుకు చేరతా? అన్న సూటి ప్రశ్నతో పాటు.. ఒకవేళ చేరితే నాకు వచ్చే లాభం ఏమిటి? అన్న ప్రశ్నను సంధించారు.

అదే సమయంలో బీజేపీని పార్టీలో కలిపేందుకు వందశాతం ప్రయత్నాలు జరిగాయని.. తాను జైల్లో ఉన్నప్పుడే ఇదంతా జరిగిందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు. తాను జైల్లో ఉన్నప్పుడు పార్టీని బీజేపీలో కలిపే ప్రతిపాదన తీసుకొస్తే తాను వ్యతిరేకించినట్లుగా వెల్లడించారు. బీఆర్ఎస్ ను స్వతంత్రంగా ఉండాలన్నదే తన అభిమతంగా పేర్కొన్నట్లు చెప్పారు. అంతేకాదు.. అవసరమైతే తాను జైల్లో ఆర్నెల్లు కాదు ఏడాది అయినా ఉంటానని.. విలీనం మాత్రం చేయొద్దని చెప్పటం ద్వారా.. కేసీఆర్ కు సంబంధం లేకుండా పార్టీ విలీనంపై బీజేపీతో రాయబారాలు జరిగియాన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు.

తనను కేసీఆర్ నుంచి విడదీసే కుట్రలు.. పార్టీకి.. కుటుంబానికి దూరం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. తనను పార్టీ నుంచి బయటకు పంపితే ఎవరికి లాభం? అన్న ప్రశ్నను సంధిస్తూ.. ఆ ముగ్గురు అన్న విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పేశారు. ‘‘మీడియా సెల్ పెట్టుకొని దాడులు చేస్తూ క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయకుండా ట్విట్టర్ మెసేజ్ లు పెడితే సరిపోతాయా? ట్వీట్లకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఉద్యమం చేయాలి. పార్టీ ఎమ్మెల్సీ అయిన నాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఎందుకు స్పందించటం లేదు? పెయిడ్ ఆర్టిస్టులతో నాపై తప్పుడు ప్రచారం చేయిస్తూ సోషల్ మీడియాలో మహాభారతం కేరక్టర్లు వేస్తున్నారు. ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మంచిదేనా?లీకు వీరులను కట్టడి చేయకుండా పెయిడ్ ఆర్టికల్స్ రాయిస్తే భయపడేది లేదు’’ అంటూ చేసిన వ్యాఖ్యలు మొత్తం కేటీఆర్ ను ఉద్దేశించి చేసినవే అన్న మాట బలంగా వినిపిస్తోంది. పార్టీ సోషల్ మీడియా అంశాల్ని చూసుకునేది కేటీఆర్ అన్న విషయం అందరికి తెలిసిన నేపథ్యంలో.. కవిత మాటలు ఆయన్ను ఉద్దేశించి చేసినవనే చెప్పాలి.

తాను పార్టీ పదవుల్ని ఎప్పుడూ అడగలేదని.. ఆత్మాభిమానం మాత్రమే కోరుకుంటానన్న కవిత.. ‘నేను నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించను. నల్లి కుట్ల రాజకీయాలు.. వెన్నుపోటు రాజకీయాలు చేయకుండా ఏ అంశం పైనైనా నేరుగా మాట్లాడతా’ అన్న మాట రాజ్యసభ సభ్యుడు సంతోష్ ను ఉద్దేశించి చేసినట్లుగా చెబుతున్నారు. ఇక.. మరో ముఖ్యనేత హరీశ్ ను ఉద్దేశించి కూడా ఆమె కీలక వ్యాఖ్య చేశారు. ‘బీజేపీ నాయకుడి ఆసుపత్రిని ప్రారంభించింది ఎవరో చెప్పాలి’ అన్న వ్యాఖ్య హరీశ్ ను లక్ష్యంగా చేసుకునే మాట్లాడినట్లు చెప్పాలి. ఆమె మాటల్లో ఎక్కువగా కేటీఆర్ కు తగిలేలా ఉండటం గమనార్హం. మొత్తంగా చూస్తే చిట్ చాట్ పేరుతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ చుట్టు దెయ్యిలు తిరుగుతున్నాయంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థాన్ని చెప్పకనే చెప్పినట్లుగా కవిత వ్యాఖ్యలు ఉన్నట్లుగా చెప్పక తప్పదు.