కవిత ఈసారి ఇంకొక సంచనల స్టేట్మెంట్...సీఎం అవుతా !
అంటే కవిత తన తండ్రి కేసీఆర్ తన విషయంలో అవలంబిస్తున్న వివక్ష కావచ్చు ఉదాశీనత కావచ్చు అది ఇప్పటిది కాదని చాలా కాలంగా ఉందని చెప్పదలచారా అన్నది కూడా చర్చకు వస్తోంది.
By: Tupaki Desk | 3 July 2025 4:45 PM ISTసీఎం అవుతా. నిజానికి ఇది ఒక రాజకీయ నాయకునికి జీవిత కాలం లక్ష్యం. సగటు రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే దగ్గరే ఆగిపోతారు. మరి కొద్దిగా ఆశలు పెంచుకున్న వారు అయితే మంత్రి అయితే చాలు ఈ జన్మ సార్ధకం అని భావిస్తారు. అయితే కేసీఆర్ లాంటి పవర్ ఫుల్ లీడర్ వారసురాలు కాబట్టి కవిత ఏకంగా సీఎం అవుతాను అని సంచలన ప్రకటన చేశారు. ఇటీవల కాలంలో ఆమె వరుసగా సంచలన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.
ఆ మధ్య తన తండ్రికి లేఖ రాశారు. అందులో పాతికేళ్ళ బీఆర్ఎస్ సభలో కేసీఆర్ మాట్లాడిన కొన్ని అంశాల మీద మాట్లాడని మరి కొన్ని అంశాల మీద కవిత తనదైన శైలిలో విమర్శనాత్మక పంధాలో విశ్లేషించారు అది బాహాటం అయి ఎంత రచ్చ రేపిందో అందరికీ తెలిసిందే. అయితే కవిత ఆ లేఖ తాను రాయలేదు అని ఖండించకపోవడమే ఆమెలోని ఆత్మబలాన్ని తెలియచేస్తుంది.
అంతే కాదు తాను ఇలాంటి లేఖలు ఎపుడూ రాస్తూ ఉంటాను అని సమర్ధించుకున్నారు. అందులో తప్పేమీ లేదని కూడా చెప్పుకున్నారు. పార్టీలో విషయాలను ఎవరో ఒకరు అధినాయకత్వానికి తెలియచేయకపోతే ఎలా అని కూడా అన్నారు. మరో వైపు చూస్తే కవిత ఆ తరువాత తెలంగాణా జాగృతి వేదిక మీద నుంచే ఎక్కువగా కనిపించారు. ఇక లేటెస్ట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అందులో బీఆర్ఎస్ తన సొంత పార్టీ. తాను కూడా పార్టీ నిర్మాణంలో చేయి వేశాను అని క్లెయిం చేసుకున్నారు.
అందువల్ల తాను ఇప్పటికీ ఎప్పటికీ బీఆర్ఎస్ నాయకురాలినే తన సొంత పార్టీ అదే అన్నారు. దానికి పొడిగింపుగానే ఆమె సీఎం అవుతాను అని కూడా చెప్పారు. ఇలా ఆమె సంచలన వ్యాఖ్యలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇక్కడ మరో ముచ్చట చెప్పాలీ అంటే కవిత ఇదే ఇంటర్వ్యూలో పరోక్షంగా కవిత తన తండ్రి కేసీఆర్ మీద విమర్శలు చేసినట్లుగా కనిపిస్తోంది.
నిజమాబాద్ అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ని ఇవ్వమని తాను కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కోరాను అని ఆమె ఫ్లాష్ బ్యాక్ స్టోరీని రివీల్ చేశారు. అయితే తనకు ఆ నిధులు ఆయన ఇవ్వలేదని అన్నారు. మరి ఎందుకు ఇవ్వలేదో అని కూడా అన్నారు. అంటే ఆ విధంగా ఆమె చెబుతూ కేసీఆర్ నిధులు ఇవ్వలేదని ఒక సగటు ప్రజా ప్రతినిధి చేసినట్లుగానే విమర్శించారు. ఇది తన తండి మీద ఆమె బాహాటంగా చేసిన మరో విమర్శగానే అంతా చూస్తున్నారు.
అంటే కవిత తన తండ్రి కేసీఆర్ తన విషయంలో అవలంబిస్తున్న వివక్ష కావచ్చు ఉదాశీనత కావచ్చు అది ఇప్పటిది కాదని చాలా కాలంగా ఉందని చెప్పదలచారా అన్నది కూడా చర్చకు వస్తోంది. అదే కేసీఆర్ ప్రభుత్వంలో ఆమె సోదరుడు కేటీఆర్ మంత్రిగా ఉన్నారు. ఇక బంధువు హరీష్ రావు మరో మంత్రిగా ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న కవితను మంత్రి పదవి కావాలని ఉందని అప్పట్లోనే ప్రచారం సాగింది. అందరికీ పదవులు ఇస్తే పూర్తి స్థాయిలో కుటుంబ పార్టీగా విమర్శలు రావచ్చు అని భావించవచ్చు అని అనుకున్నారు.
మరి ఆ విషయం అలా ఉంచితే నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు ఇవ్వవచ్చు కదా అది చేతిలో ఉన్న పనే కదా దాని వల్ల కవిత 2014లో తొలిసారి ఎంపీగా గెలిచిన నిజామాబాద్ నుంచి మళ్లీ గెలిచేందుకు ఆస్కారం ఉండేది కదా అన్న చర్చ కూడా ఉంది. అయితే కవిత ఎపుడైతే 2019 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారో ఆనాటి నుంచి ఆమెకు అక్కడ పట్టు పెద్దగా లేదని కేసీఆర్ భావించారా అన్నది కూడా చర్చగా ఉంది. అందుకే ఆమెకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి అక్కడికి పరిమితం చేశారా దాంతోనేనా ఆమెకు అసంతృప్తి కలిగిందా అన్నది కూడా అంతా అనుకునే మాట.
అయితే కవిత మాత్రం తన పొలిటికల్ ఆశలను ఆకాంక్షలను ఎక్కడా దాచుకోవడం లేదు అయితే తాను వెళ్లే దారిలో సరైన ప్రోత్సాహం ఏదీ కేసీఆర్ నుంచి పెద్దగా దక్కలేదని ఆమె చెప్పదలచుకున్నారా అందుకేనా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వలేదు అని ఇన్నాళ్ళ తరువాత ఇంటర్వ్యూ వేదికగా బయట పెట్టారా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా కవిత ఇదే ఇంటర్వ్యూలో మరో రెండు మాటలు చెప్పారు.
తన కంటే తన భర్త అంటే కేసీఆర్ కి చాలా ఇష్టమని అన్నారు. ఇక తనకు కేసీఆర్ కంటే తన సోదరుడి కేటీఆర్ తోనే మంచి సాన్నిహిత్యం ఉంది అన్నారు. అంటే ఏదో తెలియని గ్యాప్ అయితే ఉందని చెప్పదలచారా అన్నది కూడా ఉంది ఇవన్నీ చెబుతూనే ఆమె మరో మాట కూడా అన్నారు. బీఆర్ఎస్ లో కేసీఅర్ వన్ అండ్ ఓన్లీ లీడర్ అని. ఆయన స్థాయిలో మరో నాయకత్వం ఎదగలేదని చెబుతూ సోదరుడి మీద కామెంట్స్ చేశారా అన్నది చర్చగా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే కవిత మాత్రం తన రాజకీయ వాటా బీఆర్ స్ లో తేల్చుకునే విషయంలో స్పష్టంగానే ఉన్నారు అన్నది ఆమె వ్యాఖ్యల ద్వారా అర్ధం అవుతోంది అన్నది ఒక విశ్లేషణగా ఉంది.
