Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన.. ఆగస్టు 4 నుంచి 72 గంటల దీక్ష

బీసీ రిజర్వేషన్ల పెంపు కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహిస్తున్న ధర్నాను ఆమె తప్పుపట్టారు.

By:  Tupaki Desk   |   29 July 2025 1:31 PM IST
ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన.. ఆగస్టు 4 నుంచి 72 గంటల దీక్ష
X

తెలంగాణ జాగృతి నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దూకుడు పెంచారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ 72 గంటల దీక్ష చేస్తానంటూ ఆమె ప్రకటించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఈ సంచలన ప్రకటన చేశారు. గత కొంతకాలంగా బీసీ నినాదం అందుకున్న కవిత కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను అభినందిస్తూ గతంలో ప్రకటనలు చేశారు. అయితే తాజా సమావేశంలో ఆమె కాంగ్రెస్ వైఖరిపైనా విమర్శలు గుప్పించారు.

72 గంటల దీక్ష

బీసీ బిల్లు ఎంత అవసరమో దేశానికి చాటిచెప్పేందుకు వచ్చేనెల 4, 5, 6 తేదీల్లో 72 గంటల దీక్ష చేయనున్నట్లు జాగృతి నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. బీసీ బిల్లు సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు ఈ దీక్ష చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. బీసీలకు రిజర్వేషన్లు పెంపుపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు.

బిహార్ ఎన్నికల కోసమే..

బీసీ రిజర్వేషన్ల పెంపు కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహిస్తున్న ధర్నాను ఆమె తప్పుపట్టారు. కేవలం బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ఆ ధర్నాను నిర్వహిస్తోందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. బీసీ బిల్లు విషయంలో కాంగ్రెస్ చేయాల్సిన పని చేయకుండా సాగదీత ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. బీజేపీ నేతలు కూడా బీసీలకు అండగా ఉండాల్సిన సమయంలో తప్పించుకుని తిరుగుతున్నారని ఆమె విమర్శలు గుప్పించారు.

42 శాతం రిజర్వేషన్లు

గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత బీసీల తరఫున పోరాటానికి ముందుకొస్తున్నారు. తొలుత 2023 సెప్టెంబర్‌లో ఆమె బీసీ సంఘాలకు మద్దతు ఇస్తూ బీసీ రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ కులాల గణనపై పోరాటం చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అనేక కార్యక్రమాలు, నిరసనలు చేపట్టారు.ఇక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో బీసీల మద్దతు కోసం ప్రయత్నిస్తున్న కవిత ఏకంగా నిరసన దీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు.