కేసీఆర్ అప్పుడే చెప్పారుగా..ఆంధ్రా బిర్యానీ ఏం తింటాం? కవిత నోట మాట
మరోవైపు ఆంధ్రా-తెలంగాణ మధ్య తీవ్ర చర్చనీయం అవుతున్న బనకచర్ల సాగునీటి ప్రాజెక్టునూ టార్గెట్ చేస్తున్నారు కవిత.
By: Tupaki Desk | 27 Jun 2025 9:29 AM ISTపార్టీకి సంబంధించిన వ్యవహారాలపై తండ్రికి రాసిన లేఖ లీక్ అయిందంటూ ఇటీవల హంగామా చేసి.. సొంత పార్టీ బీఆర్‌ఎస్‌పై తిరుగుబాటు చేసినంత పని చేసిన తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత... ఏదో ఒక రాజకీయ కార్యక్రమంతో ప్రజల్లో ఉండాలని చూస్తున్నారు. సొంత సంస్థ తెలంగాణ జాగృతిని జాగృతం చేసి.. సింగరేణి సెంటిమెంట్‌ను పట్టుకోవాలని చూసి.. చివరగా బీసీ నినాదంతో ఎంపీ ఆర్.క్రిష్ణయ్యతోనూ భేటీ అయ్యారు కవిత. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ జై బీసీ అని నినాదం కూడా చేశారు ఆమె.
మరోవైపు ఆంధ్రా-తెలంగాణ మధ్య తీవ్ర చర్చనీయం అవుతున్న బనకచర్ల సాగునీటి ప్రాజెక్టునూ టార్గెట్ చేస్తున్నారు కవిత. ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వ స్టాండ్‌ను ప్రశ్నిస్తున్నారు. అటువైపు ఏపీ-తెలంగాణ ప్రభుత్వాల మధ్య దీనిపై రగడ జరుగుతుండగా.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ నేపథ్యంతో విరుచుకుపడుతున్నారు. బనకచర్ల వివాదంలో మొదటినుంచి గట్టిగా మాట్లాడుతున్న కవిత... 'ఆంధ్రా బిర్యానీ'పై తాజాగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో కవిత తండ్రి, నాటి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. ఆంధ్రా ప్రాంత బిర్యానీ వంటకాన్ని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ బిర్యానీ సూపర్ అని..ఆంధ్రా బిర్యానీ పేడలా ఉంటుందని తీవ్ర వ్యా్‌ఖ్యలకు దిగారు. ఇప్పుడు కవిత వాటినే పట్టుకుని.. ‘‘ఆంధ్రోళ్ల బిర్యానీ మనమేం తింటాం?’’ అని అన్నారు. ఆ బిర్యానీ ఎలా ఉంటుందో కేసీఆర్ గతంలోనే చెప్పారని పరోక్షంగా తండ్రి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు.
కాగా ఉమ్మడి ఏపీ విడిపోయి 11 ఏళ్లు అయి.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్ల వ్యవధి కూడా ముగిసి.. మూడు ఎన్నికలు కూడా జరిగాక.. రెండు రాష్ట్రాల ప్రజలు విద్వేషాలు మరిచి జీవనం సాగిస్తున్న సమయంలో కవిత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.
కాగా, బనకచర్లకు నిరుడు జూలై 6న రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ తర్వాత గ్రీన్ సిగ్నల్ వచ్చిందని కవిత ఆరోపించారు. నాడు చంద్రబాబుకు రేవంత్ హైదరాబాద్ బిర్యానీ తినిపించి బనకచర్ల నీళ్లను అప్పగిస్తున్నారని పేర్కొన్నారు. విషయం ఇదయితే.. వివాదం ఇలా ఉంటే.. దానిని పక్కనపెట్టి కవిత ఆంధ్రా బిర్యానీపై చేసిన కామెంట్స్ దారుణం అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఆమె రాజకీయ లక్ష్యాలను సాధించుకోవాలంటే ప్రజల్లోకి వెళ్లాలని.. అంతేగాని విద్వేషాలను రెచ్చగొట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
