అయినా ఆ ఇద్దరి పైనే కవిత గురి.. ఏమై ఉంటుంది?
తెలంగాణ రాజకీయాల్లో అంతర్గత విభేదాలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీ భవిష్యత్తుపైనే కాకుండా, కుటుంబ రాజకీయాలపైనా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
By: Tupaki Desk | 3 Sept 2025 3:37 PM ISTతెలంగాణ రాజకీయాల్లో అంతర్గత విభేదాలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీ భవిష్యత్తుపైనే కాకుండా, కుటుంబ రాజకీయాలపైనా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
తాజాగా కల్వకుంట్ల కవిత మరోసారి తన దృష్టిని హరీష్ రావు, సంతోష్ వైపు మళ్లించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. గతంలో బీఆర్ఎస్ ను వీడిన కొండా సురేఖ హరీశ్ రావుపై చేసిన ఆరోపణలే ప్రస్తుతం కవిత కూడా చేయడం గమనార్హం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, దానికి హరీష్ రావు ప్రత్యక్షంగా సంబంధముంంటూ చేసిన ఆరోపణలు కేవలం వ్యక్తిగత స్థాయిలో కాకుండా, అటు బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పడేశాయి.. ఈ ఆరోపణలు అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయుధంగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా, ఆయన “ట్రబుల్ షూటర్ కాదు,.. బబుల్ షూటర్” అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు, ఒకరిపై ఒకరు చేసే ఆరోపణలు ఎలాంటి స్థాయికి చేరుకున్నాయో స్పష్టంగా చూపిస్తోంది.
అయితే ఈసారి కవిత కేవలం హరీష్ రావుతో ఆగలేదు. తన సొంత అన్న కేటీఆర్‌ను కూడా లక్ష్యంగా చేసుకోవడం పార్టీ వర్గాలను మరింత కుదిపేసింది. తనపై జరుగుతున్న కుట్రను కేటీఆర్ పట్టించుకోలేదని, 103 రోజులపాటు మాట్లాడకపోవడం ద్వారా నిర్లక్ష్యం చూపారని ఆమె ఆరోపించారు. ఇది కేవలం వ్యక్తిగత సంబంధాల సమస్య కాదు; పార్టీ నాయకత్వంలో ఉన్న లోతైన విభేదాలకు ప్రతిబింబం.
తెలంగాణ సీఎంపైనా..
ఈ వాదనల్లో రేవంత్ రెడ్డి పేరు వినిపించడం మాత్రం రాజకీయ విశ్లేషకులను మరింత ఆలోచనలో పడేస్తోంది. అసలైన ప్రతిపక్ష నేతను ఎదిరించాల్సిన సమయంలో, కవిత మాత్రం “హరీష్ రావు రేవంత్‌కు ముందే లొంగిపోయాడు” అనే మాటతో చర్చల దిశను మార్చేశారు. దీని వెనుక నిజంగా ఏదైనా అవగాహన ఉందా, లేక ఇది కవిత వ్యూహాత్మక వ్యాఖ్యలు మాత్రమేనా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
సస్పెండ్ చేసిన అదే పంథా..
ఇదిలావుంటే, కవిత పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యాక కూడా తన పంథాను మార్చుకోకపోవడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమె పోరాటం కేవలం తన స్థానాన్ని కాపాడుకోవడానికేనా, లేక పార్టీ భవిష్యత్తుపైనా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
బయటపడ్డ బలహీనతలు
మొత్తానికి, కవిత ఆరోపణలు బీఆర్ఎస్‌లోని అంతర్గత విభేదాలను పొడసూపుతున్నాయి. కుటుంబంలోనూ, పార్టీలోనూ ఎవరి మీద విశ్వాసం ఉంచాలో కేసీఆర్‌కు కూడా సవాల్‌గా మారుతోంది. అయితే ఆసక్తికరమేమిటంటే — కవిత బాణాలు ఎప్పుడూ హరీష్ , సంతోష్ రావు వైపే దూసుకెళుతున్నాయి. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక లోతైన వ్యూహాత్మక గణాంకమా అనేది రాబోయే రోజులు నిర్ణయించనున్నాయి.
