కోల్గేట్.. బిస్లరీ.. కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ సెటైర్ వైరల్
బీఆర్ఎస్ ఈ వ్యూహంతో ఓటర్లలో “అసలు-నకిలీ” భావనను సృష్టించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. తమ పార్టీనే అసలైన తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా, బ్రాండ్‌గా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది.
By: A.N.Kumar | 25 April 2026 12:46 PM ISTతెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగింది. కల్వకుంట్ల కవిత ప్రకటించిన ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (టీఆర్‌ఎస్) పార్టీపై బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) సెటైరికల్‌గా కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. “ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే” అనే ట్యాగ్‌లైన్‌తో బీఆర్ఎస్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారితీసింది.
ఈరోజు జరిగిన సభలో కవిత తన కొత్త పార్టీ పేరు, జెండా, ఎజెండాను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగం కూడా గమనార్హంగా నిలిచింది. ఇంతకాలం తన తండ్రి కేసీఆర్‌పై నేరుగా విమర్శలు చేయని కవిత, ఈసారి మాత్రం రాజకీయంగా కఠినమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉన్న కేసీఆర్.. ఇప్పటి కేసీఆర్ వేరు అంటూ ఆమె వ్యాఖ్యానించడం రాజకీయంగా సంచలనంగా మారింది. కేటీఆర్, హరీశ్‌రావుపై కూడా పరోక్ష విమర్శలు చేయడం ఈ పరిణామానికి మరింత ఆసక్తి తెచ్చింది.
కవిత ప్రసంగం పూర్తయిన కొన్ని నిమిషాలకే బీఆర్ఎస్ స్పందించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో బీఆర్ఎస్ చేసిన ట్వీట్‌లో కోల్గేట్ టూత్‌పేస్ట్, బిస్లరీ నీటి బాటిల్స్ ఒరిజినల్-డూప్లికేట్ చిత్రాలను షేర్ చేస్తూ “ఎన్ని కాపీలు వచ్చినా ఒరిజినల్‌కు ఉన్న విలువ వేరు” అనే సందేశాన్ని ఇచ్చింది. ఈ పోస్టు ద్వారా కవిత పార్టీని ‘కాపీకట్’గా చిత్రీకరించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.
బీఆర్ఎస్ ఈ వ్యూహంతో ఓటర్లలో “అసలు-నకిలీ” భావనను సృష్టించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. తమ పార్టీనే అసలైన తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా, బ్రాండ్‌గా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు కవిత కొత్త పార్టీతో రాజకీయంగా సవాల్ విసురుతుంటే, మరోవైపు బీఆర్ఎస్ తన లెగసీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా హాస్యాన్ని ఆయుధంగా ఉపయోగిస్తోంది.
ఇక ఈ సెటైర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ నేతలు, అనుచరులు ఈ ట్వీట్‌కు మద్దతు తెలుపుతూ షేర్ చేస్తున్నారు. అదే సమయంలో కవిత అనుచరులు కూడా కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. కవిత నుంచి ప్రత్యుత్తరం వచ్చే అవకాశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మొత్తానికి ఈ ట్వీట్‌తో బీఆర్ఎస్ రాజకీయంగా ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. “అసలు తెలంగాణ పార్టీ తమదే” అని. అయితే కవిత పార్టీ ఎజెండా ప్రజల్లో ఎంత మేరకు ఆదరణ పొందుతుందో అనేది కీలకం. ఆమె తీసుకొచ్చిన ‘పాంచజన్యం’ ఎజెండా ప్రజలను ఆకర్షిస్తే, బీఆర్ఎస్ చేసిన సెటైర్ తిరిగి వారిపైనే ప్రభావం చూపే అవకాశమూ ఉంది.
రాబోయే ఎన్నికల్లో ఈ పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉంది. ‘ఒరిజినల్ vs నకిలీ’ అనే న్యారేటివ్ ఎంతవరకు పని చేస్తుందో, ఓటర్లు ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. ప్రస్తుతం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఈ ట్వీట్ కొత్త చర్చలకు తెరలేపింది.
