Begin typing your search above and press return to search.

కావలి సీన్ తిరుపతిలో రిపీట్.. హారన్ కొట్టాడని డ్రైవర్ ను కొట్టేశారు

మొన్నటికి మొన్న ఏపీలో చోటు చేసుకున్న ఒక అరాచక ఘటన మళ్లీ రిపీట్ అయ్యింది.

By:  Tupaki Desk   |   11 Nov 2023 4:48 AM GMT
కావలి సీన్ తిరుపతిలో రిపీట్.. హారన్ కొట్టాడని డ్రైవర్ ను కొట్టేశారు
X

మొన్నటికి మొన్న ఏపీలో చోటు చేసుకున్న ఒక అరాచక ఘటన మళ్లీ రిపీట్ అయ్యింది. ఈసారి తిరుపతి రోడ్డు మీద చోటు చేసుకున్న ఈ ఉదంతం చూస్తే.. ఈ బరితెగింపు ఏంటన్న భావన కలుగక మానదు. అర్థరాత్రి వేళ నడిరోడ్డు మీద పుట్టిన రోజు వేడుకలు చేసుకోవటం ఒక ఎత్తు అయితే.. వాహనానికి అడ్డంగా ఉన్నందున హారన్ కొట్టటమే ఆ డ్రైవర్ తప్పిదమైంది. వెనుకా ముందు చూసుకోకుండా.. తమ వేడుకలను డిస్ట్రబ్ చేశాడంటూ సదరు డ్రైవర్ మీద దాడికి దిగిన వైనం విస్మయానికి గురి చేస్తోంది.

తిరుపతిలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన శివ.. శశి స్నేహితులు. అరుగురు యువకులతో కలిసి అర్థరాత్రి తిరుపతి నడిరోడ్డు మీద పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. రోడ్డు మీద టూవీలర్లను అడ్డుగా పెట్టి కేకులు కోస్తూ హడావుడి చేశారు. అదే టైంలో అభిషేక్ ట్రావెల్స్ కు చెందిన బస్సు విజయవాడ నుంచి బెంగళూరుకు వెళుతోంది. మార్గమధ్యంలో రోడ్డు మీద వాహనాలు అడ్డుగా ఉంచేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వారిని దారి ఇవ్వాలని కోరుతూ డ్రైవర్ హారన్ కొట్టాడు.

దీంతో ఆగ్రహించిన ఆరుగురు యువకులు బస్సు మీద రాళ్లు రువ్వారు. దీంతో బస్సు ఒకవైపుఅద్దాలు పగిలాయి. వారిని అడ్డుకున్న డ్రైవర్ ను తీవ్రంగా కొట్టారు. ఇంతలో పోలీసులు రావటంతో వారంతా పారిపోయారు. గంజాయి మత్తులో ఇదంతా చేసి ఉంటారని భావిస్తున్నారు. బస్సులోని ప్రయాణికులు ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ మీద దాడి చేసిన యువకుల్ని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల కావలిలోనూ ఇదే తరహాలో డ్రైవర్ మీద దాడి చేసిన వైనాన్ని మర్చిపోక ముందే.. మరో దాడి ఉదంతం చోటు చేసుకోవటం షాకింగ్ గా మారింది.