Begin typing your search above and press return to search.

పర్యాటక ప్రియుల కలల గమ్యం ఇప్పుడు వెలవెలబోతున్నదెందుకు..?

ప్రతి పర్యాటక ప్రియుడి కలల గమ్యమైన హిమాలయ ప్రాంతం ఇప్పుడు బోసిపోయింది. సాధారణంగా వేసవిలో సందర్శకులతో కిటకిటలాడే కాశ్మీర్ లోయ, లేహ్, లడఖ్ ప్రాంతాలు ఈ ఏడాది నిర్మానుష్యంగా మారాయి.

By:  Tupaki Desk   |   14 Jun 2025 3:52 PM IST
పర్యాటక ప్రియుల కలల గమ్యం ఇప్పుడు వెలవెలబోతున్నదెందుకు..?
X

ప్రతి పర్యాటక ప్రియుడి కలల గమ్యమైన హిమాలయ ప్రాంతం ఇప్పుడు బోసిపోయింది. సాధారణంగా వేసవిలో సందర్శకులతో కిటకిటలాడే కాశ్మీర్ లోయ, లేహ్, లడఖ్ ప్రాంతాలు ఈ ఏడాది నిర్మానుష్యంగా మారాయి. ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' కారణంగా దేశవ్యాప్తంగా పర్యాటకుల్లో ఆందోళన నెలకొంది.

మే నుండి సెప్టెంబర్ వరకు ఉత్తర భారతదేశ పర్యటనకు అనువైన సమయంగా పరిగణిస్తారు. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ ప్రదేశాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రహదారులు వెలవెలబోగా, రోడ్డు పక్కన ఉండే చిన్న దుకాణాలు మూసివేశాయి. స్థానిక టూర్ ప్లానర్లు, ప్రయాణ సంస్థలు, చిన్న వ్యాపారులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. సాధారణంగా వేసవి కాలంలో వచ్చే ఆదాయంతోనే వారు ఏడాది మొత్తం జీవిస్తారు. కానీ ఈసారి ఆ చక్రం విరిగిపోవడంతో వారి జీవితాలపై తీవ్ర ప్రభావం పడనుంది.

ఈ నేపథ్యంలో జమ్మూ & కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పహల్గాం వీధుల్లో సైకిల్ యాత్ర చేసి ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఉగ్రవాదం, రక్తపాతం రాష్ట్ర అభివృద్ధికి, పర్యాటక రంగానికి ఆటంకం అని స్పష్టం చేశారు. కాశ్మీర్ లోయ ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగానికి కీలకమైన పాత్ర ఉన్నందున ఇది రాజకీయ విభేదాలకు అతీతంగా కొనసాగాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కాశ్మీర్ లోయను సందర్శించి, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెనాబ్ రైల్వే వంతెన, భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టే అంజి వంతెనను ప్రారంభించడం ద్వారా ప్రజల్లో నమ్మకం కలిగించాలనుకున్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు.

అయితే ప్రభుత్వ చర్యలు ఆశించిన మేర ప్రజల్లో విశ్వాసాన్ని నింపలేకపోయాయని ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. పర్యాటకులు ఇంకా భయభ్రాంతులకు గురై ఉన్నారు. కాశ్మీర్ ప్రాంతానికి రావాలనే ఉత్సాహాన్ని ప్రదర్శించడం లేదు.

పహల్గాం దాడి అనంతరం హిమాలయ ప్రాంత పర్యాటక రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అక్కడి వేలాది కుటుంబాలకు జీవనాధారం అయిన పర్యాటక రంగం త్వరగా కోలుకోవాలని, భద్రతా పరిస్థితులు మెరుగుపడాలని, పర్యాటకులకు భరోసా కలగాలని అందరూ ఆశిస్తున్నారు.