పీఓకే ని టార్గెట్ చేయాల్సిందేనా ?
ఇదిలా ఉంటే కేంద్రం కూడా చాలా సీరియస్ గానే ముందుకు అడుగులు వేస్తోంది.
By: Tupaki Desk | 23 April 2025 10:42 AM ISTకాశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడి మీద దేశం యావత్తు రగిలిపోతోంది. ప్రతీ హృదయం ఆగ్రహంతో ఊగిపోతోంది. ఇంతకు ఇంత దెబ్బ తీయాలని కోట్లాది పౌరులతో పాటు నెటిజన్లు గట్టిగా కోరుకుంటున్నారు. అమాయకులను చంపేసి మారణహోమం సృష్టించిన ఈ ఉగ్ర దాడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అదను చూసి కాటి వేసిన ఉగ్ర సర్పానికి దానిని వెనక నుంచి ఆడిస్తున్న వారి పీచమణచడానికి భారత ప్రభుత్వం కచ్చితమైన చర్యలను చేపట్టాల్సి ఉంది అని అంటున్నారు.
ఇదిలా ఉంటే కేంద్రం కూడా చాలా సీరియస్ గానే ముందుకు అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ పర్యటనకు వెళ్ళిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ ఘాతుకం జరగడం విశేషం. మోడీకి సౌదీలో లభించిన మర్యాద గౌరవం ఒక వైపు అంతర్జాతీయ మీడియాలో కధనాలుగా వస్తున్న వేళ భారత్ గుండెలలో ఉగ్ర కత్తిని దించారు.
అంతర్జాతీయ సమాజం నివ్వెరపోయేలా జరిగిన ఈ అతి పెద్ద దాడిని చూసి కేంద్రం సీరియస్ గానే రియాక్ట్ అవుతోంది. సౌదీలో తన పర్యటనను కుదించుకుని మరీ ప్రధాని నరేంద్ర మోడీ భారత్ కి హుటాహుటీన వచ్చారు. అర్ధరాత్రి సౌదీలో విమానం ఎక్కిన ప్రధాని మోడీ తెల్లవారు జాము అయిదు గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఆయన వెంటనే కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ తో పాటు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోహెల్ తో పాటు ఇతర కీలక నేతలతో చర్చించారు. అంతకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ఇదిలా ఉంటే కేంద్ర మంత్రివర్గం అత్యవసర సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలే ఉంటాయని అంటున్నారు. సౌదీ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లె చేరుకున్న ప్రధాని మోడీ విషణ్ణ వదనంతో కనిపించారు. ఆయనలో ఆవేదన స్పష్టంగా కనిపించింది. అంతే కాదు ఉగ్రదాడి జరిగిన క్షణం నుంచి మోడీ యావత్తు ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసిన తీరు చూస్తే కనుక పెను సంచలన నిర్ణయాలే ఉండొచ్చు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితమే కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ పీవోకే మీద కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని స్వాధీనం చేసుకోవాల్సి ఉందని అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అంటే కేంద్రం మదిలో ఆ ఆలోచనలు ఉన్నాయని అర్ధమవుతోంది.
అయితే ఏ కారణం లేకుండా సడెన్ గా చేస్తే ప్రపంచ దేశాల నుంచి తగిన మద్దతు దక్కదని భావించి ఉండొచ్చు అని అంటున్నారు. ఇపుడు అంతర్జాతీయ సమాజం షాక్ అయ్యేలా భయంకరమైన దాడి జరిగింది. ఈ దాడి మూలాలు ఎక్కడ ఉన్నాయో అందరికీ తెలుసు.
ఇక పాక్ ఆక్రమిత ప్రాంతం అంతా ఉగ్రవాద తండాలతో నింపేస్తూ దాయాది వారిని ప్రోత్సహిస్తున్నదని వార్తలు ఎన్నో ఉన్నాయి. ఇపుడు వాటి మీద మెరుపు దాడులు చేయడం ద్వారా మొత్తం ఉగ్ర మూలాలను సమూలంగా మట్టుబెట్టాలన్నది ఒక డిమాండ్ గా ఉంది అదే కనుక జరిగితే ఉగ్ర మూకకలు కాశ్మీర్ తో డైరెక్ట్ లింకులు తెగిపోతాయి. అంతే కాదు సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలనుకునే తెర వెనక శక్తుల ఆట కూడా కట్టించినట్లు అవుతుంది. అదే సమయంలో ఇప్పటికి దాదాపుగా ఎనభై ఏళ్ళ క్రితం పాక్ ఆక్రమించిన కాశ్మీర్ ని తిరిగి భారత్ లో కలుపుకున్నట్లు అవుతుంది.
అయితే ఇది అత్యంత సాహసోపేతమైన విషయంగా చూడాలి. కానీ ఈ విధంగా సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం కాశ్మీర్ లో కల్లోలం కొనసాగుతూనే ఉంటుందని అంటున్నారు. మరి శాశ్వత పరిష్కారం దిశగా భారత్ అడుగులు వేస్తుందా అన్నదే చర్చగా ఉంది.
