కశ్మీర్ ఒక ఆరనిమంట.. రగిలించింది అమెరికానే.. ట్రంప్ మినహాయింపు అంతే
కశ్మీర్ దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్య. ఈ వివాదం ఎందరో ప్రాణాలను బలిగొంది, దక్షిణాసియాలో అస్థిరతకు కారణమైంది.
By: Tupaki Desk | 26 April 2025 10:25 AM ISTకశ్మీర్ దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్య. ఈ వివాదం ఎందరో ప్రాణాలను బలిగొంది, దక్షిణాసియాలో అస్థిరతకు కారణమైంది. కశ్మీర్ సమస్య తీవ్రతరం కావడానికి, ప్రాంతంలో ఉగ్రవాదం పెరగడానికి అమెరికానే ప్రధాన కారణమని, అమెరికా అధ్యక్షుల సహకారంతోనే పాకిస్తాన్ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిందని తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.. ఈ ఆరోపణల వెనుక చారిత్రక నేపథ్యం, వివిధ దృక్కోణాలను విశ్లేషించాల్సిన అవసరం ఉంది.
తాజాగా ఓ ఇంట్వర్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్, పాక్‌లు రెండూ తనకు స్నేహితులే అని పేర్కొన్నారు. కశ్మీర్ అంశం గురించి ప్రస్తావిస్తూ.. "కశ్మీర్ సమస్య వెయ్యేళ్లుగా అలాగే ఉంది. ఆ రెండు దేశాలే దాన్ని ఎలాగోలా పరిష్కరించుకుంటాయి" అని అభిప్రాయపడ్డారు. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న మాట నిజమేనని, అయితే అవి ఎప్పుడూ ఉన్నవేనని వ్యాఖ్యానించారు. అయితే, పాకిస్తాన్ 1947లో ఏర్పడిందన్న కనీస జ్ఞానం కూడా ట్రంప్‌కు లేదా అని నెటిజన్లు విమర్శించారు. ట్రంప్ కొంత భారత్ పట్ల అనుకూలంగా ఉన్నా.. మిగతా అధ్యక్షులందరూ పాకిస్తాన్ పాటే పాడేవారు. నాడు సోవియట్ నాశనానికి తర్వాత అప్ఘనిస్తాన్ సహా మధ్యప్రాచ్యంలో ఆధిపత్యానికి అమెరికా ప్రతీసారి పాకిస్తాన్ ను పావుగా వాడుకుందన్నది వాస్తవం.
ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో సోవియట్ యూనియన్‌ను ఎదుర్కోవడానికి అమెరికా పాకిస్తాన్‌తో వ్యూహాత్మక మైత్రిని ఏర్పరచుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు గణనీయమైన సైనిక, ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ సంబంధం భారతదేశంతో అమెరికా సంబంధాలపై ప్రభావం చూపింది. కోల్డ్ వార్ నాటి అమెరికా విదేశాంగ విధానంలో పాకిస్తాన్ ఒక కీలక భాగస్వామిగా మారింది.
కొన్ని నివేదికలు, విశ్లేషణల ప్రకారం, పాకిస్తాన్ దశాబ్దాలుగా మిలిటెంట్ గ్రూపులకు మద్దతునిస్తూ, శిక్షణ ఇస్తూ వస్తోంది. ఇటీవల పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌లకు వ్యతిరేకంగా , 9/11 అనంతర పరిణామాలలో అమెరికా కోసం తాము మిలిటెంట్ గ్రూపులకు మద్దతిచ్చామని అంగీకరించారు. ఈ ప్రకటనలు పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థలకు మద్దతు, దానికి అమెరికా కోల్డ్ వార్ సమయంలో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా అందించిన సహాయం మధ్య సంబంధం ఉండవచ్చనే వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.
కశ్మీర్‌లోని హింసకు, ఉగ్రవాదానికి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న మిలిటెంట్ గ్రూపులే కారణమని భారతదేశం ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఈ గ్రూపులకు పాకిస్తాన్ అండ ఉందని, వారు సరిహద్దుల గుండా చొరబడి కశ్మీర్‌లో అస్థిరతను సృష్టిస్తున్నారని భారత్ వాదిస్తోంది. ప్రచ్చన్న యుద్ధం నేపథ్యంలో అమెరికా పాకిస్తాన్‌కు అందించిన మద్దతు, ఆయుధాలు పరోక్షంగా ఈ మిలిటెంట్ గ్రూపులకు చేరి ఉండవచ్చని, తద్వారా కశ్మీర్‌లో ఉగ్రవాదం పెరగడానికి పరోక్షంగా దారితీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కశ్మీర్ సమస్య కేవలం బయటి శక్తుల ప్రభావం వల్ల మాత్రమే కాకుండా, 1947లో దేశ విభజన నాటి దాని మూలాలు, స్థానిక రాజకీయాలు, ప్రజల ఆకాంక్షలు వంటి అనేక ఇతర సంక్లిష్ట కారణాల వల్ల కూడా ఏర్పడింది.
అమెరికా తన పాత్రను ఎక్కువగా భారత్, పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించడం లేదా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టించడంలోనే చూసింది. ప్రత్యేకించి అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరగకుండా నిరోధించడం అమెరికాకు ముఖ్యమైంది. అయితే, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలపై అమెరికా తన వైఖరిని మార్చుకోవడానికి 9/11 దాడులు ఒక కారణమయ్యాయి. అయినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్‌లో తన కార్యకలాపాలకు పాకిస్తాన్ సహకారం అవసరం కావడంతో, కొన్ని సందర్భాలలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలలో పాకిస్తాన్‌పై తగినంత ఒత్తిడి తేలేదని విమర్శలు ఉన్నాయి.
మొత్తంగా కశ్మీర్ సమస్య సంక్లిష్టమైనది. బహుముఖమైనది. అమెరికా ప్రచ్చన్న యుద్ధ వ్యూహంలో భాగంగా పాకిస్తాన్‌తో సంబంధాలు నెరపడం, ఆ దేశానికి సహాయం అందించడం చారిత్రక సత్యం. పాకిస్తాన్ మిలిటెంట్ గ్రూపులకు మద్దతునిచ్చిందనే ఆరోపణలు, ఆ దేశ రక్షణ మంత్రి యొక్క ఇటీవలి వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరింత చర్చనీయాంశం చేశాయి.
అయితే, అమెరికా నేరుగా కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని సృష్టించిందని లేదా ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడానికి పాకిస్తాన్‌కు ప్రత్యక్షంగా సహాయపడిందని నిరూపించడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ, కోల్డ్ వార్ నాటి భౌగోళిక రాజకీయాలు.. అమెరికా విధానాలు ప్రాంతంలో మిలిటెన్సీ పెరగడానికి పరోక్షంగా దోహదపడి ఉండవచ్చనే వాదనలను కొట్టిపారేయలేము. కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించడంలో ఈ చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కాబట్టి పాకిస్తాన్ కు మద్దతు లభించడం లేదు. అదే జో బైడెన్ ఉండుంటే పాకిస్తాన్ కే సపోర్టుగా నిలబడేవారు. అందులో కాదనలేని వాస్తవం.
