Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... టీటీడీపీకి కాసాని జ్ఞానేశ్వర్‌ రాజీనామా!

ఊహించినట్లుగానే జరిగింది! తెలంగాణ టీడీపీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించినందుకే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

By:  Tupaki Desk   |   30 Oct 2023 2:45 PM GMT
బిగ్ బ్రేకింగ్... టీటీడీపీకి  కాసాని జ్ఞానేశ్వర్‌  రాజీనామా!
X

ఊహించినట్లుగానే జరిగింది! తెలంగాణ టీడీపీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించినందుకే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తీవ్ర మనస్తాపంతోనే టీడీపీకి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను చంద్రబాబుకు పంపించానని తెలిపారు.

అవును... టీటీడీపీ కి ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు ఈ సందర్భంగా స్పందించిన ఆయన... ఎన్టీఆర్ స్థాపించిన పార్టీతో బడుగు బలహీనవర్గాలకు, పేదలకూ సాయం చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణలో పార్టీ ఏమీ లేనిసమయంలో తాను బాధ్యత తీసుకున్నట్లు తెలిపారు. ఆ సమయంలో ఖమ్మంలో సభ సక్సెస్ అయ్యిందని చెప్పిన కాసాని... 119 నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాల్లో కనీసం జెండాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొందని అన్నారు.

అయితే తాను వచ్చిన తర్వాత గ్రామాల్లో కేడర్ కదిలిందని అన్నారు. ఆ సమయంలో నిన్నమొన్నటివరకూ 50శాతం సీట్లు బీసీలకు ఇద్దామని చెప్పుకొచ్చిన చంద్రబాబు.. తెలంగాణలో చిన్న చిన్న పార్టీలు కూడా పోటీచేస్తున్న ఈ దశలో సడన్ గా ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారని.. అయితే అందుకు గల కారణం మాత్రం చెప్పలేదని కాసాని తెలిపారు. ఈ సందర్భంగా తాను మనస్థాపం చెందినట్లు తెలిపారు.

తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో తాను ఇంతకాలం పార్టీకోసం చేసిన కష్టం అంతా గంగలో పోసిన పన్నీరయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో... తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మెసేజ్ చంద్రబాబుకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఇంతకాలం తనకు సహకరించి, తనతో కలిసి పనిచేసినవారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు అని అన్నారు.

అనంతరం... త్వరలో తనతో ఇంతకాలం కలిసి ఉన్న అనుచరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యి తదుపరి కార్యచరణ ప్రకటిస్తానని అన్నారు. ఈ సందర్భంగా... ఐదు సంవత్సరాలు ప్రజల్లో పనిచేసి ఎన్నికల్లో మాత్రం పోటీచేనప్పుడు ఇంక రాజకీయ పార్టీ ఎందుకని కాసాని కాస్త సీరియస్ గానే స్పందించారు. పడిన కష్టమంతా ఎందుకని ప్రశ్నించారు.

పోటీచేసిన 119 స్థానాల్లోనూ గెలవకపోయినా... కనీసం 25 - 30 కచ్చితంగా గెలిచే సీట్లు ఉన్నాయని... పైగా బాబు అరెస్ట్ తర్వాత పాజిటివ్ రియాక్షన్ వచ్చిందని.. అయినా కూడా కారణం చెప్పకుండా బాబు పోటీ విరమించుకున్నారని కాసాని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలో ఒక వర్గం కాంగ్రెస్ కు సపోర్ట్ చేయమందని కాసాని బాంబ్ పేల్చారు. ఫలితంగా టీడీపీ కార్యకర్తల మనోభావాలను దెబ్బ తీశారని అన్నారు.

తెలంగాణలో టీడీపీ ఉండగా.. దాన్ని నిలబెట్టుకోకపోగా.. ఈసారి కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తామని కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొందరు చెప్పారని కాసాని స్పష్టం చేశారు! ఒక్క బీఫాం పేపర్ తప్ప మరేరకంగానూ పార్టీనుంచి సపోర్ట్ లేకపోయినా.. స్వఛ్చందంగా వచ్చి పోటీ చేస్తున్నప్పుడు కూడా... కారణం చెప్పకుండా పోటీనుంచి గౌర్హాజరవ్వడం సరైన పద్దతి కాదని కాసాని సూటిగా స్పష్టం చేశారు.