వైసీపీ నేత కారుమూరి కష్టాలు ఇంతింత కాదయా!
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కష్టాలు అన్నీ ఇన్నీలా కనిపించడం లేదు. ఒకవైపు వయో సంబంధిత ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.
By: Garuda Media | 17 Sept 2026 10:45 PM ISTవైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కష్టాలు అన్నీ ఇన్నీలా కనిపించడం లేదు. ఒకవైపు వయో సంబంధిత ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. మరోవైపు.. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసు ఆయన వెంటాడుతోంది. తాజాగా ఈ కేసును విచారిస్తున్న విజయవాడ పోలీసు కమిషనర్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు కారుమూరిని కస్టడీలోకి తీసుకున్నారు. గతంలో ఈ కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆయనను అరెస్టు చేయడం చంచల్ గూడ జైల్లో ఉంచడం తెలిసిందే.
అయితే.. ఈ కేసును మరింత లోతుగా విచారించాలని భావించిన సిట్ అధికారులు కస్టడీ పిటిషన్ వేశారు. దీనికి నాంపల్లి కోర్టు ఓకే చెప్పడంతో గురువారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం.. కారుమూరిని విజయవాడకు తీసుకువచ్చారు. ఇక్కడ ఏసీబీ కోర్టులో ఆయనను హాజరు పరిచారు. లాంఛనాల అనంతరం.. సిట్ పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించనున్నారు. ఐదు రోజుల పాటు కస్టడీ విచారణకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
అసలేంటీ కేసు..?
వైసీపీ హయాంలో లిక్కర్ రవాణా స్కామ్‌లో మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. దీనికి కారుమూరి కుమారుడు సహా నాగేశ్వరరావు బాధ్యులని పేర్కొన్న ఈడీ గత ఆగస్టు 23న హైదరాబాద్ కొండాపూర్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. మొత్తం 195 కోట్ల రూపాయల మేరకు కుంభకోణం ఆరోపణలు కారుమూరి కుటుంబాన్ని వెంటాడుతున్నాయి.
గత ప్రభుత్వంలో మద్యం రవాణా కాంట్రాక్టుల టెండర్ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని, ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.195 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు నష్టం చేకూర్చారని కారుమూరిపై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఆయనకు, ఆయన కుమారుడికి రూ.15 కోట్ల వరకు అందినట్టు ఈడీ అధికారులు చెబుతున్నారు. దీంతో కారుమూరికి కష్టాలు ఇప్పట్లో తొలిగేలా లేవని అంటున్నారు. మరోవైపు.. కారుమూరిని కస్టడీకి ఇవ్వడంపై వైసీపీ నేతలు గురువారం నిరసన వ్యక్తం చేయడం గమనార్హం.
