'ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ'.. జనసైనికులపై మాజీ మంత్రి ఫైర్!
ఈ సందర్భంగా... జనసేన కార్యకర్తలు సుమారు 15 నిమిషాల పాటు రణరంగం సృష్టించారని మండిపడిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..
By: Tupaki Desk | 24 July 2025 10:53 PM ISTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తణుకులో జనసేన కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఇది కాస్తా తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ర్యాలీ సమయంలో అటుగా వెళ్తున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కాన్వాయ్ లోని ప్రచార రథంపై ఎక్కి హల్ చల్ చేశారు. దీనిపై తాజాగా కారుమూరి స్పందించారు.
అవును... తణుకులో జనసైనికులు చేపట్టిన ర్యాలీ తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... 'బాబు షూరిటీ - మోసం గ్యారంటీ' కార్యక్రమానికి వెళుతున్న కారుమూరి కాన్వాయిని జనసేన కార్యకర్తలు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా... ఆ ప్రచార రథంపై ఎక్కి, జనసేన జెండాలు ఊపుతూ కనిపించారు. ఈ సమయంలో ఈ వ్యవహారంపై మాజీ మంత్రి మండిపడ్డారు.
ఈ సందర్భంగా... జనసేన కార్యకర్తలు సుమారు 15 నిమిషాల పాటు రణరంగం సృష్టించారని మండిపడిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. కారును అడ్డగించడంతో పాటు జండాలు ఊపుతూ బీభత్సం సృష్టించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ.. ఈ తరహా బీభత్సకాండ ఎక్కడా లేదని, ఎన్నడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు!
నాకు ఓటు వేయని వారికి సైతం సంక్షేమ పథకాలు ఇవ్వమన్న నాయకుడు జగన్ అని.. అలాంటి మాజీ సీఎం జగన్ బొమ్మపై కాలుతో తన్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలకు ఉన్న స్వేచ్ఛ తమకు లేదని తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బాహాటంగానే చెబుతున్నారని.. పవన్ కళ్యాణ్ మాత్రం పార్టీలో షోకాజ్ నోటీసు ఇవ్వకుండానే వారి నాయకులను సస్పెండ్ చేస్తున్నారని అన్నారు.
ఈ క్రమంలోనే బుధవారం జరిగిన సంఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని కారుమూరి చెప్పారు. జనసేన చేసిన బీభత్సంతో ప్రజలు ఇబ్బందిపడ్డారని.. జనసేన కార్యకర్తల వైఖరి సరికాదని.. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కారుమూరి డిమాండ్ చేశారు.
