21 రోజులు.. 21 ఎన్ కౌంటర్లు.. ముగిసిన ఆపరేషన్ కర్రెగుట్టలు
తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొనసాగిన ఆపరేషన్ ముగిసింది.
By: Tupaki Desk | 15 May 2025 1:31 PM ISTతెలంగాణ, ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొనసాగిన ఆపరేషన్ ముగిసింది. ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత ఎక్కువగా ఉండటంతో పలువురు మావోయిస్టులు, సెంట్రల్ కమిటీ నేతలు రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని కర్రె గుట్టల్లో తలదాచుకున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. గత నెల 21న పెద్దఎత్తున కర్రె గుట్టల వద్దకు చేరుకున్న బలగాలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. ఇలా మొత్తం 21 రోజులు పాటు గాలించగా, ప్రతిరోజూ ఎదురుకాల్పులతో కర్రె గుట్టల్లో భీకర యుద్ధం జరిగింది. ఈ ఘటనల్లో మొత్తం 31 మంది మావోయిస్టులు మరణించినట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి.
ఆపరేషన్ కర్రె గుట్టల్లో మొత్తం 31 మంది మావోయిస్టులు హతమైనట్లు సీఆర్‌పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్(జీపీ)తోపాటు ఛత్తీస్‌ఘడ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ అధికారికంగా ప్రకటించారు. గత నెలలో ప్రారంభించిన ఆపరేషన్ 21 రోజులు కొనసాగిందని, మొత్తం 21 ఎన్‌కౌంటర్లు జరిగాయని వారు వెల్లడించారు. మావోయిస్టు సమస్య అంతానికి ఇది ఆరంభమేనని, లొంగిపోవడం తప్ప మావోయిస్టులకు మరో మార్గం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ మావోయిస్టు పార్టీ, ఛత్తీస్‌ఘడ్ నక్సల్స్ కర్రె గుట్టల్లో ఉన్నట్లు సమాచారం రావడంతో ఏప్రిల్ 21న ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో బలగాలు కూంబింగ్ జరపగా, మావోయిస్టులు కాల్పులు జరపడంతో 21 సార్లు ఎదురుకాల్పలు జరపాల్సివచ్చిందని వెల్లడించారు. అంతేకాకుండా 450 బీరు బాంబులు, ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. మరణించిన 31 మంది మావోయిస్టుల్లో ఇప్పటివరకు 28 మంది మాత్రమే గుర్తించారు. ఇందులో ఏడుగురి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. చనిపోయిన మావోయిస్టులపై కోటి 72 లక్షల రూపాయల రివార్డులు ఉన్నట్లు చెప్పారు.
కాగా, ఆపరేషన్ కర్రె గుట్టల్లో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్లలో ఇంకా మావోయిస్టు మృతుల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు. ఆపరేషన్ ముగిసిన తర్వాత భద్రతా బలగాలు చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ లో మావోయిస్టుల మృతదేహాలు లభిస్తూనే ఉన్నాయి. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. కర్రె గుట్టల్లో చాలా మంది వరకు మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారని అంటున్నారు. మరోవైపు ఈ ఆపరేషనులో 18 మంది జవాన్లు కూడా గాయపడ్డారు.
