Begin typing your search above and press return to search.

భారతరత్న... ఎవరీ కర్పూరి ఠాకూర్‌?

స్వాతంత్య్ర సమరయోధుడు, బీహార్ మాజీ సీఎం, దివంగత కర్పూరి ఠాకూర్‌ ను కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం "భారతరత్న"తో గౌరవించింది.

By:  Tupaki Desk   |   24 Jan 2024 4:31 AM GMT
భారతరత్న... ఎవరీ కర్పూరి ఠాకూర్‌?
X

స్వాతంత్య్ర సమరయోధుడు, బీహార్ మాజీ సీఎం, దివంగత కర్పూరి ఠాకూర్‌ ను కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం ''భారతరత్న"తో గౌరవించింది. నేడు ఆయన వందో జయంతి. అంటే... ఆయన శతాబ్ది జయంతి ఉత్సవాల ప్రారంభానికి ఒకరోజు ముందు ఆయనకు ఈ గౌరవం దక్కిందన్నమాట. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం ఈ పురస్కారానికి ఆమోద ముద్ర వేశారు.

అవును... దేశానికి, ముఖ్యంగా బిహార్‌ ప్రజలకు ఆయన చేసిన మహోన్నత సేవలకు గానూ... మరణించిన 36 ఏళ్లకు కేంద్ర ప్రభుత్వం కర్పూరి ఠాకూర్‌ ను అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. దీంతో భారతరత్న పొందిన వారిలో 49వ వ్యక్తిగా ఠాకూర్ నిలిచారు. కాగా... 2019 ఏడాదిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి చివరిసారిగా కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.

విద్యార్థి దశలోనే పోరాటంలోకి..!:

బిహార్‌ లోని సమస్తీపుర్‌ జిల్లాలోని పితౌంజియా గ్రామంలో గోకుల్‌ ఠాకుర్‌, రాం దులారీ దేవీ దంపతులకు 1924 జనవరి 24న కర్పూరి ఠాకూర్‌ జన్మించారు. అనంతర కాలంలో... పితౌజియా గ్రామం పేరును ఈయన పేరిట కర్పూరి గ్రామ్‌ గా మార్చారు. అతి సామాన్య నాయీ బ్రాహ్మణ రైతు కుటుంబంలో పుట్టిన కర్పూరి ఠాకూర్... విద్యార్థి దశలోనే ఆల్‌ ఇండియా స్టూడెంట్‌ ఫెడరేషన్‌ లో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు!

ఈ క్రమంలోనే క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికి డిగ్రీలో కళాశాలను వదిలేశారు. ఇందులో భాగంగా... భారత స్వాతంత్య్ర సమరంలో పాల్గొని సుమారు 26 నెలలపాటు జైలు జీవితం గడిపారు. ఈ క్రమంలో స్వతంత్రం వచ్చిన అనంతరం సొంత గ్రామంలోనే పాఠశాల అధ్యాపకుడిగా వృత్తి జీవితం ప్రారంభించారు.

పొలిటికల్ కెరీర్ స్టార్ట్!:

సొంత గ్రామంలో పాఠశాల అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఆయన 1952లో తొలిసారి తాజ్‌ పుర్‌ నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాటి నుంచి మొదలు 1988లో చనిపోయేవరకూ 36 ఏళ్ల సుదీర్ఘ కాలం ఓటమి ఎరుగని ప్రజాప్రతినిధిగా ఆయన కొనసాగారు.

ఈ క్రమంలోనే 1970 డిసెంబరు నుంచి 1971 జూన్‌ వరకూ సోషలిస్టు పార్టీ తరఫున.. 1977 డిసెంబరు నుంచి 1979 ఏప్రిల్‌ వరకూ జనతా పార్టీ తరఫున బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం బిహార్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న లాలూప్రసాద్‌ యాదవ్‌, నీతీశ్‌ కుమార్‌ లకు ఈయనే రాజకీయ గురువు అని చెబుతారు!!

ఓబీసీలకు 26% రిజర్వేషన్లు!:

ఆయన జనతాపార్టీ తరుపున 1977 - 79 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముంగేరీలాల్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు ఓబీసీలకు 26% రిజర్వేషన్లు అమలుచేశారు కర్పూరి ఠాకూర్‌. ఇలా ఓబీసీల అభ్యున్నతి కోసం ఆయన వేసిన బీజమే 90వ దశకంలో మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలుకు ప్రాణం పోసింది! ఆ విధంగా... సరళమైన జీవన విధానం, సామాజిక న్యాయం నినాదంతో బిహార్‌ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు కర్పూరి ఠాకూర్!

64 ఏళ్ల వయసులో మరణం!:

1985లో సోన్‌ బర్స అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ లోక్‌ దళ్‌ అభ్యర్థిగా ఎన్నికైన కర్పూరి ఠాకూర్... ఆ పదవీ కాలం ముగియక ముందే 1988 ఫిబ్రవరి 17న 64 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అలా 36 ఏళ్లు నిరాటంకంగా బిహార్‌ విధానసభ సభ్యుడిగా కొనసాగిన ఆయనకు మరణించిన 36 ఏళ్ల తర్వాత భారతరత్న దక్కడం విశేషం. ఇదే సమయంలో... ఆయన శతజయంతిని పురస్కరించుకుని 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేయాలని కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయించింది.