Begin typing your search above and press return to search.

ఆపరేషన్‌ గదిలో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ను మరిచిపోకముందే మళ్లీ ఇదేంటి!

సోషల్‌ మీడియాతో ఎంతగా ఉపయోగాలున్నాయో అంతగా దుష్ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   11 Feb 2024 11:30 PM GMT
ఆపరేషన్‌ గదిలో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ను మరిచిపోకముందే మళ్లీ ఇదేంటి!
X

సోషల్‌ మీడియాతో ఎంతగా ఉపయోగాలున్నాయో అంతగా దుష్ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ స్మార్ట్‌ ఫోన్‌ చేతుల్లో ఉంటోంది. దీంతో సోషల్‌ మీడియాను వినియోగించేవారు పెద్ద ఎత్తున పెరిగిపోయారు. ముఖ్యంగా ఇనస్టాగ్రామ్‌ రీల్స్, యూట్యూబ్‌ షార్ట్స్‌ వంటివాటిని చూసేవారు, రీల్స్, షార్ట్స్‌ చేసేవారు ఎక్కువ అయ్యారు.

ఇందులో భాగంగా తమ రీల్స్, షార్ట్స్‌ కోసం ఎక్కువ వ్యూస్‌ రావడం కోసం కొందరు వెర్రి పనులు చేస్తున్నారు. పాపులర్‌ కావడం కోసం తాము ఎలాంటి రీల్స్‌ ను చేస్తున్నామో గమనించకుండా వీడియోలతో హల్చల్‌ చేస్తున్నారు.

ఇలాగే తాజాగా కర్ణాటకలో ఆపరేషన్‌ గదిలో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ను నిర్వహించి ఒక ప్రభుత్వ వైద్యుడు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇదీ తీరులో కర్ణాటకలో మెడికల్‌ విద్యార్థులు కొందరు ఏకంగా ఆస్పత్రిలోనే రీల్స్‌ చేశారు. దీంతో వారిపై కళాశాల యాజమాన్యం జరిమానా విధించింది.

ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని గడగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (జీఐఎంఎస్‌) లో చదువుతున్న 38 మంది విద్యార్థుల ట్రైనింగ్‌ మరో 20 రోజుల్లో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మెడికల్‌ విద్యార్థులు త్వరలో కళాశాలలో జరగనున్న ప్రీ గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమం కోసం ఆస్పత్రిలో రీల్స్‌ చేశారు. ఇందుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు.

దీంతో ఈ వీడియో వైరల్‌ గా మారింది. ఆస్పత్రిలో రీల్స్‌ ఏమిటంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల చర్యపై జీఐఎంఎస్‌ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.

ఆస్పత్రిలో రీల్స్‌ చేసేందుకు ఆస్పత్రి యాజమాన్యం విద్యార్థులకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని జీఐఎంఎస్‌ లె లిపింది. ఆస్పత్రిలో ఇలాంటి వాటిని మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించమని పేర్కొంది. వారు ఏం చేయాలనుకున్నా రోగులకు ఇబ్బంది కలగకుండా వ్యవహరించాల్సి ఉండాల్సిందని పేర్కొంది. రీల్స్‌ లాంటి ఆస్పత్రి బయట చేసుకోవాలని వెల్లడించింది.

నిబంధనలు ఉల్లంఘించి విద్యార్థులు ఘోర తప్పిదానికి పాల్పడ్డారని పేర్కొంది. ఈ నేపథ్యంలో వారికి జరిమానాతో పాటు.. ట్రైనింగ్‌ను మరో 10 రోజులు పొడిగించాం అని ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ బసవరాజ్‌ వెల్లడించారు.

ఇటీవల చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రిలో ఓ వైద్యుడు ఆపరేషన్‌ గదిలో ప్రీవెడ్డింగ్‌ షూట్‌ చేయగా ఇది తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై కర్ణాటక వైద్యారోగ్యశాఖ మంత్రి దినేశ్‌ గుండూరావు మండిపడ్డారు. వైద్యుడిని తక్షణమే సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.