ఒక్క రాత్రి ఆ పూజలో కూర్చుంటే రూ. 30 లక్షలు..
4G నుంచి 6G వైపు ప్రపంచం అడుగులు వేస్తున్న వేళ ఇంకా మూఢనమ్మకాలను నమ్మే వారు ఉన్నారంటే ఏమనాలో అర్థం కావడం లేదు.
By: Tupaki Desk | 4 May 2026 1:08 PM IST4G నుంచి 6G వైపు ప్రపంచం అడుగులు వేస్తున్న వేళ ఇంకా మూఢనమ్మకాలను నమ్మే వారు ఉన్నారంటే ఏమనాలో అర్థం కావడం లేదు. సమాజం ఎంతగా ఆధునికత వైపు అడుగులు వేస్తున్నా, వికృత చేష్టల నీడలు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనే ఆశ చూపే కేటుగాళ్లు పెరిగిపోతున్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేలా బలహీనతలతో ఆడుకునే వింత పోకడలు వెలుగులోకి రావడం నాగరిక సమాజానికే మచ్చగా మారుతోంది. క్షుద్ర పూజల పేరిట సాగే ఈ చీకటి దందాల్లో చిక్కుకొని ఎంతో మంది మహిళలు జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి. తాజాగా కర్ణాటక రాజధాని శివార్లలో వెలుగు చూసిన ఉదంతం, నేరగాళ్ల ఆలోచనలు ఎంతటి నీచ స్థాయికి దిగజారుతున్నాయో స్పష్టం చేస్తోంది.
కలకలం రేపిన వింత పూజ
బెంగళూరు దక్షిణ జిల్లా పరిధిలోని రామనగర తాలూకాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. భక్తి ముసుగులో ఒక యువతిని అసాంఘికమైన చర్యలకు ఉసిగొల్పాలని చూసిన ఒక వ్యక్తి ఉదంతం పోలీసుల వరకు చేరింది. కిరణ్ అనే వ్యక్తి యువతికి ఫోన్ చేసి, అర్థరాత్రి నిర్వహించే ప్రత్యేక పూజలో పాల్గొంటే ఊహించని రీతిలో ధనవంతురాలు కావొచ్చని నమ్మబలికాడు. కేవలం ఒక రాత్రి చేసే ఈ ప్రక్రియతో జీవితమే మారిపోతుందని, అపర కుబేరురాలు కావచ్చని మాయమాటలు చెప్పాడు. అయితే ఆ పూజ వెనుక అసలు ఉద్దేశం వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడవడం ఖాయం.
నగ్న పూజలు..
నిందితుడు కిరణ్ తన వికృత కోరికను తీర్చుకోవడమా? మరేదైనా అక్రమ కార్యకలాపానికా ఆ యువతిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఒక రాత్రి నగ్నంగా పూజలో కూర్చుంటే రూ.30 లక్షల నగదు ఇస్తానని భారీ ఆశ చూపించాడు. నిందితుడు వృత్తిరీత్యా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నప్పటికీ, ఇంత భారీ మొత్తాన్ని ఆశ చూపడం వెనుక పెద్ద కుట్ర ఉండవచ్చని అనుమానిస్తున్నారు. గత నెల 12న మొదలైన ఈ వేధింపులు, పెరుగుతూ వచ్చాయి. డబ్బు ఆశ చూపి ఆమెను లొంగదీసుకోవాలని నిందితుడు నిరంతరం ప్రయత్నించాడు.
వాట్సాప్ వేదికగా..
కేవలం మాటలతో ఆగకుండా మరింత బరితెగించాడు. పూజకు అర్హురాలివో కాదో పరీక్షించాలంటూ ఆమె నగ్న చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపాలని ఒత్తిడి చేశాడు. అంతటితో ఆగకుండా.. శరీరంపై పుట్టుమచ్చలు ఉంటే పూజకు పనికిరావని, ఫొటోలు పంపడం తప్పనిసరని నమ్మించే ప్రయత్నం చేశాడు. మెసేజ్‌లు పంపిస్తూ, ఆమెను ఆందోళనకు గురిచేశాడు. సాంకేతికతను వాడుకుని ఒక యువతి ఆత్మగౌరవంతో ఆడుకోవాలని చూడడం అతని వికృత మనస్తత్వానికి నిదర్శనం.
నిందితుడి వేధింపులు మితిమీరిపోవడంతో సదరు యువతి తల్లితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడు పంపిన మెసేజ్‌లు, ఫోన్ కాల్ రికార్డుల ఆధారంగా కేసు నమోదు చేయించింది. ఈ వ్యవహారంలో కిరణ్ ఒక్కడే ఉన్నాడా..? లేదంటే అతని వెనుక మంత్రగాళ్ల ముఠా ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి మాయమాటలను నమ్మి మోసపోకూడదని, మూఢనమ్మకాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
ఈ ఘటన ఒక నేరంగానే కాకుండా, సమాజంలో ఇంకా పాతుకుపోయి ఉన్న అజ్ఞానానికి అద్దం పడుతోంది. అడ్డదారుల్లో వచ్చే డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తులు ఉన్న తరుణంలో, మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. ఇటువంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారానే కిరాతకులకు ముకుతాడు వేయడం సాధ్యమవుతుంది. నిందితుడిని త్వరలోనే పట్టుకొని కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కేసు రామనగర ప్రాంతంలో తీవ్ర చర్చకు దారితీసింది.
