Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు ‘ట్రబుల్ షూటర్’ ట్రబుల్స్? కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు..

కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత కొన్ని రోజులుగా సీఎం మార్పుపై కన్నడ రాజకీయాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   22 Aug 2025 9:00 PM IST
కాంగ్రెస్ కు ‘ట్రబుల్ షూటర్’ ట్రబుల్స్?  కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు..
X

కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత కొన్ని రోజులుగా సీఎం మార్పుపై కన్నడ రాజకీయాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కావాలనే తన చిరకాల వాంఛ తీర్చుకునే దిశగా పార్టీ అధిష్టానంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒత్తిడి పెంచుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్లు తానే పదవిలో కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య చెబుతుండటంతో డిప్యూటీ సీఎం డీకే తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాన్ని తమ వాదనకు బలం చేకూర్చే అంశంగా చూపుతున్నారు. దీంతో కన్నడ నాట నాటకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి.

కాంగ్రెస్ అగ్రనేతలకు నమ్మిన బంటుగా చెప్పుకునే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నోట ఈ మధ్య ఎక్కువగా ఆర్ఎస్ఎస్ ప్రస్తావన వినిపిస్తోంది. దీంతో ఆయన కమలం పార్టీకి దగ్గర అవుతున్నారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని డీకే కొట్టిపారేసినా, అదే సమయంలో తన రాజకీయ జీవితం, ఆర్ఎస్ఎస్ తో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేయడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ గీతమైన ‘నమస్తే సదా వత్సలే’ను ఆయన అసెంబ్లీలో పాడటం, ఆ సమయంలో బీజేపీ సభ్యులు బల్లలు చరిచి హర్షం ప్రకటించడంతో కన్నడ రాజకీయాల్లో ఏదో జరుగుతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయని అంటున్నారు.

2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డీకే శివకుమార్ సీఎం అవుతారని అంతా ఆశించారు. ఎన్నికలకు ముందు తన వర్గానికి ఎక్కువ టికెట్లు ఇప్పించుకోవడం, గాంధీ కుటుంబంతో ఆయనకు ఉన్న అనుబంధం కారణంగా శివకుమార్ పేరు గట్టిగా వినిపించింది. అయితే సీనియర్ నేత సిద్ధ రామయ్య మొండిపట్టు పట్టడంతో కాంగ్రెస్ ఆయననే సీఎం చేసింది. ఆ సమయంలో పార్లమెంటు ఎన్నికల వరకు ఓపిక పట్టాలని డీకే శివకుమార్ కు నచ్చజెప్పిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీపై నమ్మకంతో డీకే శివకుమార్ అప్పట్లో వెనక్కి తగ్గారు. సిద్ధ రామయ్య నాయకత్వానికి జైకొట్టారు.

అయితే పార్లమెంటు ఎన్నికలు ముగిసి ఏడాది అవుతున్నా, సిద్ధ రామయ్య సీఎం పదవిని వదలడం లేదు. మరోవైపు డికేకు పోటీగా పలువురు సీనియర్లను ఎగదోస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మైసూర్ లో భూ కుంభకోణంలో సిద్ధరామయ్యపై విచారణ జరిగింది. ఈ సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానం ఆయనతో రాజీనామా చేయిస్తుందని భావించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ సీఎంను వెనకేసుకు రావడంతో డీకేకు నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆయనతో బీజేపీ సంప్రదింపులు జరుపుతోందని ప్రచారం జరిగింది. అయితే తొలుత ఈ ప్రచారాన్ని డీకే కొట్టిపడేసినా, ఇటీవల ఆయన ప్రవర్తనపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్.. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ట్రబుల్స్ లోకి నెట్టేస్తారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం పదవి ఇవ్వకపోతే తాను బీజేపీతో చేతులు కలిపే అవకాశం ఉందని బెదిరించేందుకే డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించారని అంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇటీవల స్వాతంత్ర్య వేడుకల్లో ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ ను ప్రశంసించడాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో శివకుమార్ ఆర్ఎస్ఎస్ తో తనకు సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవడం పార్టీకి హెచ్చరికగా చెబుతున్నారు. ఎలాగైనా సీఎం అవ్వాలనే బలమైన కోరికతో ఉన్న డీకే శివకుమార్.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న ధోరణితో ఉన్నారని అంటున్నారు. 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తనను సీఎం చేయాలని పార్టీపై ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా డీకే శివకుమార్ ను చెబుతారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎదుర్కొన్న అనేక సవాళ్లను డీకే శివకుమార్ ఒంటి చేత్తో అధిగమించారని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా పొలిటికల్ క్యాంపుల నిర్వహణలో శివకుమార్ సిద్ధహస్తుడిగా చెబుతారు. రాజకీయ సంక్షోభం నెలకొన్ని సమయంలో డీకే శివకుమార్ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలతో క్యాంపులు నిర్వహించి ఆయా ప్రభుత్వాలను కాంగ్రెస్ కాపాడుకునేది. ఇక గత ఎన్నికల సమయంలో కూడా బీజేపీ నుంచి ముప్పు ఉందని కాంగ్రెస్ గెలిచిన తర్వాత కూడా డీకే క్యాంపు పెట్టారు. ఈ నేపథ్యంలో సీఎం పదవి కోసం త్వరలోనే డీకే క్యాంపు ప్రారంభిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.