కర్నాటకంలో బిగ్ ట్విస్ట్.. సీఎం మార్పు వేళ కీలక పరిణామం
కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా ప్రకటన అనంతరం ఆసక్తికర విషయం వెలుగుచూసింది.
By: Tupaki Political Desk | 28 May 2026 11:25 AM ISTకర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా ప్రకటన అనంతరం ఆసక్తికర విషయం వెలుగుచూసింది. ఢిల్లీలో అధిష్టానంతో చర్చల అనంతరం బెంగళూరు చేరకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించిన సిద్ధూ తన రాజీనామాను వెల్లడించారు. ఈ విషయాన్ని మంత్రి పరమేశ్వర్ అధికారికంగా మీడియాకు వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ ను కలిసేందుకు సీఎంవో అపాయింట్మెంట్ కోరింది.
అందుబాటులో లేని గవర్నర్
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా సమర్పిస్తారనే సమయంలో గవర్నర్ అందుబాటులో లేరన్న విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండు రోజులుగా ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై గురువారం ఉదయం అధికారిక ప్రకటన విడుదలైంది. అయితే అంతకుముందే గవర్నర్ థామర్ చంద్ గెహ్లోత్ ముంబై వెళ్లినట్లు చెబెతున్నారు. బుధవారం రాత్రి కుటుంబ వ్యవహారం కోసం గవర్నర్ ముంబైకి వెళ్లినట్లు చెబుతున్నారు. మధ్యాహ్నం కల్లా గవర్నర్ బెంగళూరు వస్తారా? లేదా? అన్నది హాట్ టాపిక్ అవుతోంది.
సిద్ధూకి డీకే పాదాభివందనం
ముఖ్యమంత్రిగా తప్పుకుంటున్నట్లు సిద్ధరామయ్య చెప్పిన అనంతరం కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న డీకే శివకుమార్ ఆయన కాళ్లకు నమస్కరించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2023లో జరిగిన ఎన్నికల సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న డీకే ముఖ్యమంత్రి పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం ముందు సీనియర్ నేత అన్న ఆలోచనతో సిద్ధూకి అవకాశం ఇచ్చినట్లు చెబుతున్నారు. అప్పట్లోనే ఇద్దరి మధ్య అధికార పంపకంపై ఒప్పందం కుదిరిందని అంటున్నారు. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య మూడేళ్ల పదవీకాలం పూర్తికావడంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
30న డీకే ప్రమాణస్వీకారం
కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత మంత్రివర్గంలో ఆయన ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. తదుపరి ప్రభుత్వంలో మొత్తం నలుగురు ఉప ముఖ్యమంత్రులు పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నారని అంటున్నారు.
