Begin typing your search above and press return to search.

డికె శివకుమార్ టీమ్‌పై ఏడీఆర్ సంచలన నివేదిక..అందరూ కోటీశ్వరులే..

కర్ణాటకలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), కర్ణాటక ఎలక్షన్ వాచ్ సంచలన నివేదిక విడుదల చేశాయి.

By:  Tupaki Political Desk   |   6 Jun 2026 12:30 PM IST
డికె శివకుమార్ టీమ్‌పై ఏడీఆర్ సంచలన నివేదిక..అందరూ కోటీశ్వరులే..
X

కర్ణాటకలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), కర్ణాటక ఎలక్షన్ వాచ్ సంచలన నివేదిక విడుదల చేశాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన 13 మంది మంత్రుల అఫిడవిట్లను కూలంకుషంగా విశ్లేషించిన ఏడీఆర్ ఆసక్తికరమైన నిజాలను బయటపెట్టింది. ఈ నివేదిక ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. కొత్తగా బాధ్యతలు తీసుకున్న మంత్రులందరూ కోటీశ్వరులేనని ఏడీఆర్ స్పష్టం చేసింది. ఈ 13 మంది మంత్రుల సగటు ఆస్తుల విలువ అక్షరాలా రూ.206.15 కోట్లుగా తేలింది.

కనకపుర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రూ.1,413.80 కోట్ల ఆస్తులతో ఈ జాబితాలో అందరికంటే అత్యంత ధనికుడిగా అగ్రస్థానంలో నిలిచారు. అంతేకాదు, దాదాపు రూ.265.06 కోట్ల అప్పులతో అత్యధిక లయబిలిటీస్ ఉన్న నేత కూడా ఆయనే కావడం గమనార్హం. మంగళూరు నియోజకవర్గానికి చెందిన యు.టి. ఖాదర్ ఫరీద్ రూ.6.97 కోట్ల ఆస్తులతో ఈ 13 మందిలో అత్యంత తక్కువ ఆస్తి కలిగిన మంత్రిగా నిలిచారు.

ఆర్థికంగానే కాకుండా కేసుల విషయంలోనూ కర్ణాటక కొత్త మంత్రులు వంద శాతం రికార్డు సాధించారు. ప్రమాణ స్వీకారం చేసిన 13 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది. ఇందులో మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, మొత్తం మంత్రులలో ముగ్గురిపై హత్యాయత్నం, ఫోర్జరీ, లంచం వంటి అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

మంత్రుల విద్యార్హతలు, వయస్సు విషయానికి వస్తే, ఈ మంత్రివర్గంలో 77 శాతం మంది అంటే 10 మంది మంత్రులు డిగ్రీ, అంతకంటే ఎక్కువ చదువుకున్న వారు కాగా, మిగిలిన 23 శాతం మంది అంటే ముగ్గురు 10 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నారు. వయస్సు పరంగా చూస్తే ముగ్గురు మంత్రులు 40-50 ఏళ్ల వయసులోపు ఉండగా, మిగిలిన 10 మంది మంత్రులు 51-75 ఏళ్ల వయస్సు గల సీనియర్లు. కాగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఒక్క మహిళకు కూడా స్థానం దక్కకపోవడంతో మహిళా ప్రాతినిధ్యం పూర్తిగా సున్నాగా మిగిలిపోయింది. ప్రజాస్వామ్యంలో పారదర్శకతను కోరుకునే వారి కోసం ఏడీఆర్ ఇచ్చిన ఈ సమగ్ర నివేదిక ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.