భార్యపై కోపంతో పెళ్లి కుదిర్చిన మధ్యవర్తిని చంపేశాడు
సంచలన నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న కర్ణాటకలో తాజా ఉదంతం చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 24 May 2025 11:01 AM ISTపెళ్లై ఏడాది కూడా కాలేదు. పెళ్లైన నాటి నుంచి తరచూ గొడవలే. అవి కాస్తా పెరిగిపెద్దవి కావటమే కాదు.. ఈ మధ్యనే పుట్టింటికి వెళ్లిపోయిన భార్య మీద కోపంతో అనూహ్యంగా వ్యవహరించాడో భర్త. తనకు పెళ్లి కుదిర్చిన మధ్యవర్తిని కత్తితో పొడిచి చంపేసిన వైనం షాకింగ్ గా మారింది. కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ షాకింగ్ ఇన్సిడెంట్ వివరాల్లోకి వెళితే..
సంచలన నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న కర్ణాటకలో తాజా ఉదంతం చోటు చేసుకుంది. మంగళూరుకు చెందిన ముస్తఫా అనే ముప్ఫై ఏళ్ల యువకుడికి ఎనిమిది నెలల క్రితం ఒక మహిళతో వివాహం జరిగింది. ఈ పెళ్లికి మధ్యవర్తిగా 50 ఏళ్ల సులేమాన్ వ్యవహరించాడు. పెళ్లై.. ఇంటికి వచ్చిన నాటి నుంచి కొత్త దంపతుల మధ్య గొడవలు జరిగేవి.
రోజు రోజుకీ ఈ గొడవలు పెరగటమే తప్పించి.. తగ్గకపోయిన పరిస్థితి. ఇదిలా ఉండగా.. భర్త తీరుపై ఆగ్రహంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ముస్తఫా.. తనకు ఇలాంటి అమ్మాయిని సంబంధంగా తీసుకు వస్తారా? అన్న ఆగ్రహంతో తన పెళ్లిని కుదర్చిన పెద్ద మనిషిని నిలదీశాడు.
ఈ క్రమంలో ఇరువురి మధ్య వాదన జరగ్గా.. ఆగ్రహానికి గురైన ముస్తఫా.. సులేమాన్ మెడపై కత్తితో బలంగా పొడవటంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అక్కడితో ఆగని ముస్తఫా.. సులేమాన్ ఇద్దరు కుమారులు రియాబ్.. సియాబ్ లపై కూడా దాడికి పాల్పడ్డాడు. వీరిద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణానికి కారణమైన ముస్తఫాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
