Begin typing your search above and press return to search.

కర్ణాటకలో కొత్త చట్టం... పోలీసులు హిట్లర్స్ అయిపోతారా..!

కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఉభయ సభలలోనూ ప్రవేశపెట్టిన కర్ణాటక ద్వేషపూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాల (నివారణ) బిల్లు - 2025 పై కర్నాటకలో గణనీయమైన చర్చ జరిగింది.

By:  Tupaki Desk   |   26 Dec 2025 4:00 PM IST
కర్ణాటకలో కొత్త చట్టం... పోలీసులు హిట్లర్స్  అయిపోతారా..!
X

కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఉభయ సభలలోనూ ప్రవేశపెట్టిన కర్ణాటక ద్వేషపూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాల (నివారణ) బిల్లు - 2025 పై కర్నాటకలో గణనీయమైన చర్చ జరిగింది. సాధారణంగా ద్వేష వ్యతిరేక బిల్లు అని పిలిచే ఈ బిల్లుపై బీజేపీ మండిపడుతోంది.. దీనిని నల్ల చట్టంగా అభివర్ణిస్తోంది. దీనివల్ల పౌర హక్కుల ఉల్లంఘన పుష్కలంగా జరుగుతుందని చెబుతుంది!

అవును... కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఈ (వివాదాస్పద) బిల్లును డిసెంబర్ 18 - 2025న ఆమోదించింది. అయితే.. ఇప్పటికే ఉన్న భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 153ఏ, 295ఏ, ఐటీ చట్టం వంటివి సరిపోవని, అందుకే ఈ కొత్త బిల్లు అని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఇది చట్టంగా మారడానికి ఇంకా గవర్నర్ సంతకం చేయాల్సి ఉంది. మరోవైపు రాష్ట్రంలోని మైనార్టీ వర్గాల నుంచి ఈ బిల్లుకు మద్దతు లభించింది.

ఈ నేపథ్యంలో ఇది ఒక్కసారి అమలోకి వచ్చిన తర్వాత రకరకాల కారణాలతో దుర్వ్నియోగానికి గణనీయమైన అవకాశం ఉందనే వాదనలు పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగా... ప్రతిపక్ష నాయకుల సాధారణ ఎన్నికల ప్రసంగాలు లేదా సోషల్ మీడియా పోస్టులను ద్వేషపూరిత ప్రసంగాలుగా ముద్ర వేయడం ద్వారా వారిపై పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయవచ్చు.

దీంతో.. ఇది ప్రతిపక్షాలను రాజకీయంగా తొక్కి వేయడానికి అధికారపార్టీ చేతిలో బలమైన అస్త్రంగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు! ఇదే సమయంలో... మతపరమైన పండుగలను లేదా జాతీయ నినాదాలను ప్రోత్సహించే ఎవరైనా.. మైనారిటీలపై శత్రుత్వాన్ని రెచ్చగొట్టినందుకు అరెస్టు చేయబడతారు. కాగా.. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 153ఏ కింద ఇప్పటికే 'భారత్ మాతా కీ జై' నినాదాలు చేసినందుకు ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేయబడిన సంగతి తెలిసిందే.

ఇదే క్రమంలో... ప్రభుత్వ అవినీతి లేదా సామాజిక సమస్యల (కుల ఆధారిత వివక్ష వంటివి) గురించి నివేదించే ఏ జర్నలిస్ట్ లేదా సోషల్ మీడియా వినియోగదారుడైనా, సమూహాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ కంటెంట్‌ ను బ్లాక్ చేసే అవకాశాన్ని ఎదుర్కోవచ్చని అంటున్నారు. ఇది పరిశోధనాత్మక జర్నలిజానికి వ్యతిరేకంగా ఒక సాధనంగా మారుతుందని అంటున్నారు.

సామాజిక సమస్యలను (లింగం లేదా జాతి వంటివి) వ్యంగ్యంగా చూపించే ఏ హాస్యనటుడైనా, రచయిత అయినా లేదా డిబేటర్ అయినా వారిపై దురుద్దేశం రెచ్చగొట్టినందుకు అభియోగం మోపబడుతుందని అంటున్నారు. బిల్లులోని అశ్లీలత నిర్వచనం మినహాయింపులు ఉన్నప్పటికీ, సాహిత్య లేదా కళాత్మక వ్యక్తీకరణలను కూడా ఇది ప్రభావితం చేస్తుందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో స్పందించిన ప్రతిపక్ష బీజేపీ... ఈ బిల్లును రాజ్యాంగ విరుద్ధమని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) కింద భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘిస్తుందని పేర్కొంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక్ స్పందిస్తూ... ఈ బిల్లు పోలీసులను హిట్లర్‌ గా మార్చడం లాంటిదని.. రాజ్యాంగ నిర్మాతలకు అవసరం లేని దాని గురించి కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి ఆలోచించారని అన్నారు.

మరోవైపు.. ద్వేషపూరిత ప్రసంగం సమాజంలో హింస, విభజనను పెంచుతుందని.. ప్రస్తుత చట్టాలు తక్కువ శిక్షార్హత రేటును కలిగి ఉన్నాయని.. ఈ బిల్లును సమర్ధిస్తున్నవారు చెబుతున్నారు. ఈ సందర్భంగా.. సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ దీన్ని ఒక సాధనంగా అభివర్ణించిందని చెబుతున్నారు. చర్చ్ లపై దాడులకు వ్యతిరేకంగా క్రైస్తవ నాయకులు దీన్ని ఉపశమనంగా అభివర్ణిస్తున్నారు.