Begin typing your search above and press return to search.

బెయిల్ తో గ్యాంగ్ రే*ప్ నిందితుల సంబరాలు.. వీడియో వైరల్!

అవును... 2024 జనవరిలో తన పై కొంతమంది వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

By:  Tupaki Desk   |   23 May 2025 6:08 PM IST
బెయిల్  తో గ్యాంగ్  రే*ప్  నిందితుల  సంబరాలు.. వీడియో వైరల్!
X

కర్ణాటకలో సభ్యసమాజం తలదించుకునే సంఘటన చోటుచేసుకుంది! ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, కొన్ని నెలలు జైల్లో ఉన్న అనంతరం బెయిల్ పై విడుదలైన నిందితులు చేసిన పని తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జైలు నుంచి బయటకు వచ్చిన నిందితులు రోడ్లపై విజయోత్సవ ర్యాలీ తరహాలో వాహనాలపై వెళ్తూ హల్ చల్ చేశారు. దీంతో.. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి!

అవును... 2024 జనవరిలో తన పై కొంతమంది వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ ప్రైవేట్ హోటల్ లో తన స్నేహితుడితో ఉండగా.. నిందితులు దౌర్జ్యన్యంగా గదిలోకి చొరబడి, తనను సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ క్రమంలో మొత్తం 19 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఏడుగురిని ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు! ఈ క్రమంలో నిందితుల్లో 12 మంది పది నెలల క్రితం విడుదలవ్వగా.. ఏడుగురు ప్రధాన నిందితులకు మాత్రం ఇటీవలే బెయిల్ లభించింది. దీంతో.. బెయిల్ పై బయటకు వచ్చిన నిందితులు రోడ్లపై ర్యాలీగా వెళ్తూ హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

నిందితులు బెయిల్ పై బయటకు రావడంతో వారి స్నేహితులు ఇలా స్వాగత ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా... కార్లు, బైకులపై స్పీడుగా వెళ్తూ, బిగ్గరగా మ్యూజిక్ ప్లే చేస్తూ, అరుస్తూ వారు వేడుక చేసుకున్నారు. దీనిపై స్పందించిన నెటిజన్లు వారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.