Begin typing your search above and press return to search.

డీకే, సిద్ధరామయ్యా 'కుర్చీ'లాట!

బెంగళూరులో న్యాయవాదుల సమాఖ్య నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న డీకే శివకుమార్, ఖాళీ కుర్చీలను చూపుతూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

By:  Tupaki Desk   |   12 July 2025 11:27 PM IST
డీకే, సిద్ధరామయ్యా కుర్చీలాట!
X

కర్ణాటక రాజకీయాల్లో సీఎం పదవి చుట్టూ మళ్లీ వేడి రాజుకుంది. కాంగ్రెస్‌ అధికారం చేపట్టినప్పటి నుంచే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య కనిపిస్తున్న ‘అసంతృప్తి’ చీకటి రాజకీయంగా కొనసాగుతున్నా.. ఇప్పుడు బహిరంగ వ్యాఖ్యల దశకు చేరుకుంది. ముఖ్యమంత్రి పీఠంపై ఆసక్తిని డీకే తాజా వ్యాఖ్యలతో మరోసారి స్పష్టంగా సంకేతాలిచ్చారు.

- "కుర్చీ దొరికితే వదలొద్దు!"

బెంగళూరులో న్యాయవాదుల సమాఖ్య నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న డీకే శివకుమార్, ఖాళీ కుర్చీలను చూపుతూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. “ఇక్కడ చాలా మంది లాయర్లు ఖాళీ కుర్చీలు ఉన్నా కూర్చోవడంలేదు. కానీ మేమైతే ఓ కుర్చీ కోసం ఏ స్థాయిలోనైనా పోరాడతాం. కుర్చీ దొరికితే వదలొద్దు. అందులో కూర్చోవాలి. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అంటూ వ్యాఖ్యానించారు.

ఈ మాటలు హాస్యంగా కనిపించినా.. రాజకీయంగా మాత్రం గంభీర సంకేతాలివిగా విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార కుర్చీపై డీకే మక్కువను అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి ఎప్పుడైనా తనవయ్యే అవకాశం ఉంటుందని ఆయనలో ఆశ సజీవంగానే ఉందని చెప్పొచ్చు.

-వెంటనే వైరల్‌.. విమర్శలు, వాదనలు!

డీకే వ్యాఖ్యలు కేవలం హాస్యానికి పరిమితం కాలేదు. సీఎం పదవి విషయంలో ఆయన ఆసక్తికి, ఇప్పటి రాజకీయ దిశకు అవి ప్రతిబింబంగా మారాయి. నెట్టింట్లో ఈ వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో.. ‘డీకే సీఎం కావాలనే తపన’పై పునరాలోచనలు ప్రారంభమయ్యాయి.

-రెండున్నరేళ్ల ఒప్పందం నిజమేనా?

2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సీఎం ఎంపిక కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. చివరకు సిద్ధరామయ్య సీనియారిటీ, సామాజిక సమీకరణాల పేరుతో ఎంపికయ్యారు. అయితే, అప్పటినుంచి రెండు సంవత్సరాల తర్వాత సీఎంను మార్చే ప్రణాళిక ఉన్నదనే ప్రచారం రాజకీయం చేస్తోంది. పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు, నేతలు ఇదే మాట చెబుతుండటంతో డీకే ఆశలు బలపడుతున్నాయి.

-పార్టీ చీలిపోయే ప్రమాదం?

అయితే, డీకే ముఖ్యమంత్రి అయితే సిద్ధరామయ్య వర్గం అసంతృప్తిగా మారే ప్రమాదం ఉంది. ఆయనను గద్దె దించితే కాంగ్రెస్‌లో విభేదాలు పెరిగి పార్టీ బలహీనపడే అవకాశముందని హైకమాండ్‌ ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ చిన్న వైఖరిని అయినా జాగ్రత్తగా మేనేజ్‌ చేయాలనే ఉద్దేశంతో సిద్ధరామయ్యకు పూర్తి మద్దతు ఇస్తూ వస్తోంది.

డీకే శివకుమార్ వ్యాఖ్యలు ఇప్పటివరకు నడుస్తున్న ‘నిశబ్ద రాజకీయ పోరాటం’కు బహిరంగ రూపమిచ్చినట్టే. కాంగ్రెస్‌లో కుర్చీలాట ఎప్పుడు ఓ తేలికపాటి అంశంలా కనిపించినా.. గడిచిన అనుభవాల దృష్ట్యా అది పార్టీకి నష్టం కలిగించే విధంగా మారకూడదని విశ్లేషకుల అభిప్రాయం. ఇకపోతే, అధిష్ఠానం ఎంతకాలం ఈ తాత్కాలిక సమతుల్యతను కాపాడగలదో చూడాలి!