Begin typing your search above and press return to search.

బెంగళూరులో తొలి కోవిడ్ మరణం.. కర్ణాటకలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు

కర్ణాటకలో కోవిడ్-19 కేసుల పెరుగుదలపై ఆరోగ్య శాఖా మంత్రి దినేష్ గుండు రావు స్పందించారు.

By:  Tupaki Desk   |   25 May 2025 4:26 PM IST
బెంగళూరులో తొలి కోవిడ్ మరణం.. కర్ణాటకలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు
X

కర్ణాటకలో కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో బెంగళూరులో తొలి కోవిడ్-19 మరణం నమోదైంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. శనివారం ఈ మరణం సంభవించింది. ప్రస్తుతం కర్ణాటకలో మొత్తం 38 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉండగా, అందులో 32 కేసులు బెంగళూరు నుంచే నమోదయ్యాయి. ఈ పరిణామం ప్రజల్లో కొద్దిగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, ఆరోగ్య శాఖా మంత్రి దినేష్ గుండు రావు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం.. గత 24 గంటల్లో 108 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒక వ్యక్తి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 38 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మొత్తం 38 యాక్టివ్ కేసులలో 32 కేసులు బెంగళూరు నుంచే ఉన్నాయి. గత 24 గంటల్లో నగరంలో 92 మందికి పరీక్షలు చేయగా, ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. బళ్లారి, బెంగళూరు రూరల్, మంగళూరు, విజయనగర జిల్లాల్లో ఒక్కొక్క యాక్టివ్ కేసు ఉండగా, మైసూర్ జిల్లాలో రెండు యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. మరణించిన వ్యక్తి 85 ఏళ్ల వృద్ధుడు.

ముంబై నుంచి తిరిగి వచ్చిన ఒక మహిళకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెను హోమ్ ఐసోలేషన్‌లో ఉంచారు. బెళగావిలో గత నెల పుణెకు వెళ్లి వచ్చిన ఒక గర్భిణికి కూడా పాజిటివ్‌గా తేలింది. కోవిడ్ సోకిన వారికి ప్రత్యేక చికిత్స అందించేందుకు ధార్వాడ్‌తో సహా అనేక జిల్లా ఆసుపత్రులలో 10 పడకల ఐసీయూ వార్డులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సాంకేతిక సలహా కమిటీ (Technical Advisory Committee - TAC) సూచనల మేరకు ఆదివారం నుంచి కర్ణాటకలోని ఎనిమిది వైద్య కళాశాలల్లో కోవిడ్ పరీక్షలను ప్రారంభించాలని ఆరోగ్య శాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఇది కేసుల గుర్తింపును వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.

కర్ణాటకలో కోవిడ్-19 కేసుల పెరుగుదలపై ఆరోగ్య శాఖా మంత్రి దినేష్ గుండు రావు స్పందించారు. రాష్ట్రంలో , బెంగళూరులో కేసులలో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. శనివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. "భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా సాధారణ పరిస్థితి. గత 15 రోజులుగా కోవిడ్-19 కేసుల సంఖ్యలో స్వల్ప పెరుగుదల ఉంది" అని తెలిపారు.

పరిస్థితిని చర్చించడానికి రాష్ట్ర సాంకేతిక సలహా కమిటీ ఇటీవల సమావేశమైందని ఆయన తెలిపారు. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు, ముఖ్యంగా ఆసుపత్రులలో ఉన్నవారు కోవిడ్-19 పరీక్ష చేయించుకోవాలని కోరారు. సాధారణ జీవితం భయం లేకుండా కొనసాగించవచ్చని మంత్రి దినేష్ గుండు రావు పునరుద్ఘాటించారు. తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ (SARI) కేసులకు మాత్రమే కోవిడ్ పరీక్షలు తప్పనిసరి అని మంత్రి చెప్పారు.