కర్ణాటకలో అధికార బదిలీకి రంగం సిద్ధం.. సిద్ధూతో సహా సీనియర్లు ఔట్!!
పొరుగు రాష్ట్రం కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో త్వరలో అధికార బదిలీ జరగనుందనే ప్రచారం జోరందుకుంది.
By: Tupaki Desk | 27 Oct 2025 12:18 PM ISTపొరుగు రాష్ట్రం కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో త్వరలో అధికార బదిలీ జరగనుందనే ప్రచారం జోరందుకుంది. చాలాకాలంగా అధికార బదిలీపై ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యమంత్రి సిద్దరామయ్యతోసహా కాంగ్రెస్ ప్రముఖులు దీనిని ఖండిస్తున్నా, ఇటీవల సీఎం కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్ర చేసిన వ్యాఖ్యలతో మళ్లీ చర్చ మొదలైంది. ఇదే సమయంలో వచ్చేనెలలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశానికి ముహూర్తం నిర్ణయించారని చెబుతుండటం ‘అధికార బదిలీ’ వార్తలకు బలాన్ని సమకూర్చుతోందని అంటున్నారు.
గత వారం బెళగావి జిల్లాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న యతీంద్ర సిద్ధరామయ్య తన తండ్రి, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయాల్లో చివరి దశకు చేరుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో గత వారం రోజులుగా రాష్ట్రంలో ఎవరి నోట విన్నా అధికార బదిలీపైనే చర్చ జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఉన్న పళంగా పదవి నుంచి తప్పిస్తే తప్పుడు సంకేతాలిచ్చినట్లు అవుతుందని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఇందుకోసం పక్కా వ్యూహాంతో పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే సీఎం పదవిని ముఖ్యమంత్రి సిద్దరామయ్యతోపాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెరిసగం పంచుకోవాలని షరతు విధించినట్లు వార్తలు వినిపించాయి.
ఉప ముఖ్యమంత్రి శివకుమార్ సైతం తాను సీఎం అయ్యే అవకాశాలపై తరచూ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇక సీఎంగా సిద్దు రెండున్నరేళ్లు పదవీ కాలం పూర్తవడంతో ఆయన తప్పుకునే సమయం వచ్చిందని కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల సంకేతాలు పంపినట్లు చెబుతున్నారు. అయితే ఏ కారణం లేకుండా రాజీనామా చేయించడంపై సుదీర్ఘ చర్చలు కొనసాగించిన కాంగ్రెస్ అధిష్టానం.. కాంగ్రెస్ బలోపేతానికి కామరాజ్ మోడల్ ను తెరపైకి తీసుకువచ్చి, సిద్దూతో రాజీనామా చేయించాలని నిర్ణయించిందని ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీలో కామరాజ్ మోడల్ అంటే తెలియని వారుండరు. 1962లో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవానికి 9 ఏళ్లు సీఎంగా పనిచేసిన కుమారస్వామి కామరాజ్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో చైనా యుద్ధం, ఆర్థిక సమస్యలు, దేశంలో పేదరికం మూలంగా కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో సీనియర్లు అంతా స్వచ్ఛందంగా అధికారం వదులుకోవాలని కామరాజ్ ప్రతిపాదించారు. అంతేకాకుండా తన సీఎం పదవిని త్యజించారు. దీంతో అప్పటి కేంద్ర మంత్రులుగా ఉన్న లాల్ బహుదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్ వంటి దిగ్గజాలు కూడా తప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ లో యువనాయకత్వాన్ని ప్రోత్సహించే అవకాశం చిక్కింది. దీంతో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పునకు కామరాజ్ మోడల్ ను తరచూ వాడుతుంటుంది. ఇప్పుడు కర్ణాటకలోనే అదే సిద్ధాంతాన్ని ప్రయోగించాలని భావిస్తోందని అంటున్నారు.
నవంబరు 20 నాటికి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోనుంది. దీంతో అధికార బదిలీకి ఇదే సరైన సమయంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ మొత్తం మంత్రివర్గాన్ని రాజీనామా చేయాలని కోరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం సిద్దరామయ్యతో రాజీనామా చేయిస్తారా? లేదా అన్న విషయంపై క్లారిటీ లేకపోయినా, పార్టీలో కొత్త రక్తం నింపాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తున్నందున దాదాపు 15 మంది మంత్రులపై వేటు కత్తివేలాడుతోందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రెవెన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడ స్వచ్ఛందంగా తప్పుకుంటానని ప్రకటించారు. దీంతో సీనియర్లు పరమేశ్వర, రామలింగారెడ్డి, మహదేవప్ప, శివరాజ్ తంగడిగే, కే.వెంకటేశ్, ఈశ్వర్ ఖండ్రే, ఎంబీ పాటిల్, శివానంద పాటిల్, దినేశ్ గుండారావ్ తదితరులు తప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు. ఇదే జరిగితే డిసెంబరులో బెళగావిలో నిర్వహించే విధానసభ సమావేశాలకు కొత్త నాయకత్వం కొలువుదీరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
