యాపిల్స్' తెచ్చిన తంటా.. కర్ణాటక సీఎం డీకేపై నెటిజన్ల ఫైర్
ఎంగిళి చేసిన పండ్లను తినమనేలా ముఖ్యమంత్రి డీకే చేష్టలు ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు.
By: Tupaki Political Desk | 9 Jun 2026 4:40 PM ISTకర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ అనుకోని వివాదంలో చిక్కుకున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సొంత నియోజకవర్గం కనకపురలో డీకే పర్యటించారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు యాపిల్స్ తో చేసిన భారీ గజమాలను వేసి స్వాగతం పలికారు. అయితే అలా అభిమానులు చూపిన ప్రేమకు ఫిదా అయిన ముఖ్యమంత్రి డీకే.. ఆ యాపిల్ పండ్లను నోటితో కొరికి అభిమానులపైకి విసరడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఎంగిళి చేసిన పండ్లను తినమనేలా ముఖ్యమంత్రి డీకే చేష్టలు ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు.
కనకపుర నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డీకే శివకుమార్ తన చిరకాల కోరిక అయిన ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుని తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చారు. దీంతో అభిమానులు కూడా వేలాదిగా తరలివచ్చారు. ఈ నియోజకవర్గంలో డీకేకు ప్రత్యేకంగా అభిమానులు ఉండగా, వారిని సొంత మనుషుల్లా చూసుకునే డీకే శివకుమార్ సగం కొరికిన యాపిల్ పండ్లను ప్రేమతో వారికి పంచారని అంటున్నారు. అయితే ఓపెన్ టాప్ జీప్ పై నుంచి డీకే సగం తిన్న యాపిల్స్ విసరడం ఎబ్బెట్టుగా ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి ఏమైనా దేవుడిలా ఫీల్ అవుతున్నారా? ఆయన తిన్న పండ్లను ఇతరులకు ఇచ్చి ప్రసాదంలా స్వీకరించమని చెప్పడమేంటి? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అంతేకాకుండా సీఎం డీకే శివకుమార్ యాపిల్స్ ను విసిరిన వీడియోలను వైరల్ చేస్తున్నారు. పదవులు రాగానే ప్రజలంటే అంత చులకనగా చూస్తారా? ఎంగిలి పండ్లను జనంపైకి విసరడం ఏంటి? ఇది నాయకుడి అహంకారానికి, కార్యకర్తల బానిసత్వానికి పరాకాష్ఠ అంటూ నెటిజన్లు, విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. మరోవైపు, ముఖ్యమంత్రి డికె శివకుమార్ అభిమానులు దీనిని విపరీతమైన ప్రేమాభిమానాలకు చిహ్నంగా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈ నెల 3న డీకే ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఏ ముహూర్తాన ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో కానీ, రోజూ ఏదో ఒక తలనొప్పి వెంటాడుతూనే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. తొలుత మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సీనియర్ నేత రామలింగారెడ్డి రాజీనామా చేసి సీఎం డీకేకి షాక్ ఇచ్చారు. ఆయన తర్వాత మరో ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా సరైన ప్రాధాన్యం ఉన్న శాఖలు ఇవ్వలేదని అలకపాన్పు ఎక్కారని అంటున్నారు. వీటికి తోడుగా సోషల్ మీడియా ప్రభావంతో ప్రతి చిన్న విషయం కూడా పెద్ద వివాదంగా మారుతుండటంతో డీకే శివకుమార్ తల పట్టుకుంటున్నారని అంటున్నారు.
