ఐదేళ్లు నేనే సీఎం..కుర్చీ దిగను.. ముదిరిన కన్నడ నాట రగడ
తాజాగా ఓ ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధరామయ్య ఐదేళ్లు తానే సీఎం అని బాంబు పేల్చారు.
By: Tupaki Desk | 10 July 2025 7:48 PM ISTఎన్నికల అనంతరం కుదిరిన ఒప్పందం ప్రకారం చెరో రెండేళ్లు సీఎంగా ఉండాలి.. మరొక్క నాలుగు నెలల్లో ఆ గడువు పూర్తికావొస్తోంది.. మరి అధికార మార్పిడి అంత సులువుగా జరుగుతుందా..? ఇప్పుడు కర్ణాటకలో ఇదే పెద్ద ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ దేశంలో సొంతంగా అధికారంలో ఉన్నది మూడే మూడు రాష్ట్రాలు. ఒకటి తెలంగాణ, రెండు కర్ణాటక, మూడోది హిమాచల్ ప్రదేశ్. మిగతా రెండు రాష్ట్రాల్లో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా కర్ణాటకలో మాత్రం కిస్సా కుర్సీకా (కుర్చీ ఎవరిది) అనే రగడ తప్పేలా లేదు.
2023 వేసవిలో జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. బీసీ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఒకవైపు, అర్థబలంతో పాటు కరిష్మా కలిగిన డీకే శివకుమార్ మరోవైపు.. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం పదవి ఎవరికి ఇవ్వాలో తెలియక కాంగ్రెస్ అధిష్ఠానం కొన్ని రోజుల పాటు తర్జనభర్జన పడింది. చివరకు చెరో రెండున్నరేళ్ల ఒప్పందంతో ముందుగా సిద్ధరామయ్య సీఎం అయ్యారు. ఈ ప్రకారం నవంబరు-డిసెంబరు నాటికి ఆయన దిగిపోవాలి. ఇప్పటికే డీకే వర్గం ఎమ్మెల్యేలు బహిరంగంగానే అధికార మార్పిడి గురించి మాట్లాడుతున్నారు. డీకే చివరకు కల్పించుకుని వారిని వారించాల్సి వచ్చింది.
తాజాగా ఓ ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధరామయ్య ఐదేళ్లు తానే సీఎం అని బాంబు పేల్చారు. కర్ణాటకలో అధికార మార్పిడిపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. డీకే కోసం తనను సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ హైకమాండ్ అడగలేదు కదా? అని తెలిపారు. ఈ మేరకు జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని స్పష్టం చేశారు.
సీఎంగా తాను పూర్తికాలం కొనసాగుతానని స్పష్టంగా ఎప్పుడో చెప్పానని.. ఈ నెల 2న కూడా ప్రకటన ఇచ్చానని సిద్ధరామయ్య గుర్తుచేశారు. అప్పుడు డీకే శివకుమార్ కూడా అక్కడే ఉన్నారని తెలిపారు. సీఎం పదవికి ఆయన కూడా పోటీదారే. ఎవరైనా పోటీ పడొచ్చు. అందులో తప్పు లేదు.. కానీ కుర్చీ ఇప్పుడు ఖాళీగా లేదు అని డీకేనే అన్నారు కదా? అని సిద్ధరామయ్య గుర్తుచేశారు.
అంతేగాక అధిష్ఠానం నాయకత్వం మార్పిడిపై నిర్దిష్ట టైమ్‌లైన్, సూచనలు వంటివి ఏమీ చేయలేదని సిద్ధు వెల్లడించారు. అసలు రెండున్నరేళ్లు అనే ప్రతిపాదనే లేదని మరో సంచలన విషయం బయటపెట్టారు. ఒకవేళ హైకమాండ్ నిర్ణయం ఏదైనా ఉంటే తమకు చెబుతుందని, దానిని అమలు చేస్తామని కూడా తెలిపారు. పార్టీ నాయకత్వంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా కూడా ప్రశ్నలు లేవనెత్తలేదని.. డీకేకు కొందరు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని సిద్ధు అంగీకరించారు. గురువారం తాను రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ కోరానని, అదింకా నిర్ధారణ కాలేదని బదులిచ్చారు.
సీఎంగా ఐదేళ్లు తానే అని సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యల అనంతరం తానేమీ చేసేది లేదని.. డీకే నిర్వేదం వ్యక్తం చేశారు. తన ప్రయత్నాల విఫలమైనా, ప్రార్థనలు విఫలం కాలేదని వేదాంత ధోరణిలో మాట్లాడారు.
