పవర్‌ఫుల్ సీఎం.. అంతకుమించిన వినయం! వైరల్ అవుతున్న డీకే ముందస్తు ముచ్చట
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆగర్భ శ్రీమంతుడు. సంపదలో దేశంలోనే టాప్ లో ఉన్నారు ఆయన.
By: Tupaki Political Desk | 4 Jun 2026 9:54 AM ISTకర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆగర్భ శ్రీమంతుడు. సంపదలో దేశంలోనే టాప్ లో ఉన్నారు ఆయన. అయితే ఇప్పుడు వినయ, విధేయతల్లోనూ తనదే తొలిస్థానంగా డీకే చాటుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు డీకే చూపిన వినయం, విధేయుతపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రమాణస్వీకారాని ముందు విపక్ష నేతలు, స్వపక్షంలోని సీనియర్లు, కన్నడ ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తల ఇంటికి వెళ్లిన డీకే, అందరికీ పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
పెద్దల ఆశీస్సులతోనే ముందడుగు..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు డీకే శివకుమార్ రాష్ట్రంలోని పలువురు ప్రముఖులను, పెద్దలను కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. కేవలం ఆశీస్సులు తీసుకోవడమే కాదు, వారి పాదాలకు నమస్కరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. డీకే నుంచి ఈ గౌరవాన్ని అందుకున్న వారిలో మాజీ ప్రధాని దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రులు యడియారప్ప, సిద్దరామయ్యతోపాటు వ్యాపార దిగ్గజాలు, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులు ఉన్నారు.
విపక్ష నేతల ఇళ్లకు వెళ్లి మరీ..!
ఈ మొత్తం ఎపిసోడ్‌లో అందరినీ బాగా ఆకట్టుకున్న అంశం ఏమిటంటే.. డీకే శివకుమార్ కేవలం తన పార్టీ పెద్దలకే పరిమితం కాలేదు. రాజకీయ వైరాగ్యాన్ని పక్కనబెట్టి, విపక్ష నేతల ఇళ్లకు స్వయంగా వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పను కలిసి ఆయన కాళ్లకు నమస్కరించారు. అంతేకాకుండా దేశ మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్.డి. దేవెగౌడను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత తేనీటి విందు ఇచ్చిన సమయంలో భార్య ఉష, కూతరు ఐశ్యర్వ, కుమారుడు ఆకాశ్ తో కలిసి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించారు. ఈ విధంగా పెద్దల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారని అభినందనలు అందుకుంటున్నారు.
నెట్టింట నెటిజన్ల ఫిదా!
సాధారణంగా అధికారం చేతికి రాగానే నేతల్లో అహంకారం పెరుగుతుందని చాలా మంది నేతలు విమర్శలు ఎదుర్కొంటారు. కానీ, దాదాపు 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన డీకే చూపిన వినయం అందరినీ ఆకట్టుకుంటుందని అంటున్నారు. ప్రధానంగా తన రాజకీయ జీవితం మొత్తం వ్యతిరేకించిన యడియారప్ప, దేవేగౌడ వంటివారిని కలిసి తన సంస్కారం చాటుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విధంగా విపక్ష నేతలను గౌరవించడం ప్రజాస్వామ్యానికి అందం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
