రెండేళ్ల సమయం - 40 ఏళ్ల సెంటిమెంట్.. డీకే శివకుమార్ కి అతిపెద్ద సవాల్
కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సిద్ధరామయ్య రాజీనామాతో డీకే సీఎం పీఠం ఎక్కడానికి లైన్ క్లియర్ అయింది.
By: Tupaki Political Desk | 29 May 2026 5:00 PM ISTకర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సిద్ధరామయ్య రాజీనామాతో డీకే సీఎం పీఠం ఎక్కడానికి లైన్ క్లియర్ అయింది. అయితే కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న డీకే శివకుమార్ ముందు అతి పెద్ద సవాళ్లు ఉన్నాయి. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో పార్టీని మళ్లీ గెలిపించడం. గత 40 ఏళ్లుగా కర్ణాటకలో ఏ పార్టీ వరుసగా రెండోసారి గెలిచిన చరిత్ర లేదు. ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం డీకేపైనే ఆధారపడి ఉంది. ఇందుకు ఆయనకు కేవలం రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఇప్పటికి మూడేళ్లు అయ్యాయి. మరో రెండు ఏళ్లలో ఎన్నికలకు వెళ్లాల్సివుంటుంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ ఎలా నెట్టుకొస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
40 ఏళ్లుగా రెండో సారి గెలవని పార్టీలు
ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరణకు సిద్ధమవుతున్న సీనియర్ నేత డీకే శివకుమార్ పై కాంగ్రెస్ అతిపెద్ద బాధ్యత మోపిందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని రెండోసారి గెలిపించడమే డీకే శివకుమార్ కర్తవ్యంగా చెబుతున్నారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే ఒక విచిత్రమైన, అత్యంత బలమైన సెంటిమెంట్ కనిపిస్తోంది. 1985లో రామకృష్ణ హెగ్డే నేతృత్వంలోని జనతా పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, మళ్లీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం రిపీట్ కాలేదు. అంటే గత 40 ఏళ్లుగా కర్ణాటకలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని దక్కించుకోలేకపోయిందని అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ఇలా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఐదేళ్లు ముగిసేసరికి ప్రజలు ప్రత్యామ్నాయాన్నే ఎన్నుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు 2023లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, వచ్చే ఎన్నికల్లోనూ ఆ విజయాన్ని పునరావృతం చేయాలని కోరుకుంటోంది. ఈ 40 ఏళ్ల సుదీర్ఘ యాంటీ-ఇంకంబెన్సీ సెంటిమెంట్‌ను బద్దలు కొట్టి, కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపించే వజ్రాయుధంగా డీకే శివకుమార్ ను ఎంపిక చేసింది.
కాలం - కార్యాచరణ, చాలా బాధ్యత
2023 మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య అప్పట్లో కుదిరిన ఒప్పందం ప్రకారం సిద్ధరామయ్య మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. అంటే, ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియడానికి, మరోసారి ఎన్నికలకు వెళ్లడానికి డీకే శివకుమార్ వద్ద ఉన్న సమయం కేవలం రెండేళ్లు మాత్రమే. ఈ తక్కువ వ్యవధిలోనే ఆయన ఎన్నో మైలురాళ్లను అధిగమించాల్సి ఉందని అంటున్నారు. ఇక సిద్ధరామయ్య హయాంలో ప్రవేశపెట్టిన 5 ముఖ్యమైన గ్యారంటీ పథకాలు గృహలక్ష్మి, గృహజ్యోతి, అన్నభాగ్య, యువనిధి, శక్తి వంటివి రాష్ట్ర ఖజానాపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. ఈ పథకాలను ఎక్కడా బ్రేక్ పడకుండా విజయవంతంగా కొనసాగిస్తూనే, రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధుల కొరత రాకుండా చూసుకోవడం డీకేకు పెను సవాల్ గా మారనుందని వ్యాఖ్యానిస్తున్నారు.
కుల వివాదం
సిద్ధరామయ్య ముందుకు తెచ్చిన కుల గణన నివేదికపై రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. డీకే శివకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న బలిష్టమైన ‘వొక్కలిగ’ సామాజిక వర్గంతోపాటు లింగాయత్‌లు కూడా దీనిపై కొంత అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. అటు అహిందా గ్రూపుగా చెప్పే మైనారిటీలు, వెనుకబడిన వర్గాలు, దళితులు ఓటు బ్యాంకును కోల్పోకుండా, ఇటు సొంత సామాజిక వర్గాలను సమన్వయం చేసుకోవడం కొత్త ముఖ్యమంత్రికి కత్తిమీద సామే అంటున్నారు. అంతేకాకుండా సీనియర్ నేత సిద్ధరామయ్య అంత తేలికగా పదవిని వదులుకోవడానికి ఇష్టపడలేదని కన్నడ పొలిటికల్ సర్కిల్స్ టాక్. అహిందా వర్గాల నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ హైకమాండ్ ఇచ్చిన మాట ప్రకారం డీకే వైపే మొగ్గు చూపిందని చెబుతున్నారు. అయితే, సిద్ధరామయ్య వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను కలుపుకుపోవడం, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఎలాంటి అసంతృప్తులు తలెత్తకుండా చూసుకోవడం డీకే శివకుమార్ రాజకీయ చతురతకు పరీక్షగా వ్యాఖ్యానిస్తున్నారు.
బీజేపీని తట్టుకుని నిలబడాలి
మరోవైపు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో బలమైన పట్టున్న జేడీఎస్ ఇప్పటికే డీకే శివకుమార్‌పై ఉన్న పాత కేసులను, అవినీతి ఆరోపణలను టార్గెట్ చేయడానికి సిద్ధమవుతున్నాయని ప్రచారం జరుగుతోంది. బెంగళూరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు, ఆర్థిక లోటును అస్త్రాలుగా చేసుకుని విపక్షాలు ప్రభుత్వంపై దాడి పెంచే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివకుమార్ ఎలా నెట్టుకొస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ‘‘సమస్యలు ఉన్నచోటే డీకే శివకుమార్ ఉంటారు.. ఆ సమస్యలకు పరిష్కారమూ ఆయనే అవుతారు’’ అనేది ట్రబుల్ షూటర్ గా శివకుమార్ పై కాంగ్రెస్ శ్రేణులు పెట్టుకున్న నమ్మకం. అయితే ప్రభుత్వ సారథిగా శివకుమార్ తన పంథాను ఎలా కొనసాగిస్తారు? ట్రబుల్ షూటర్ అనుభవం అక్కరకు వస్తుందా? లేదా? అన్నది కూడా హాట్ టాపిక్ అవుతోంది.
