Begin typing your search above and press return to search.

కర్ణాటక సర్వే ఫలితం..రేవంత్, చంద్రబాబు ప్రభుత్వాలకు గట్టి హెచ్చరికే

సరిగ్గా రెండేళ్లు అవుతోంది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి.. గెలిచిన వెంటనే సీఎం పదవి కోసం రేస్ మొదలైంది.

By:  Tupaki Desk   |   24 May 2025 5:50 PM IST
కర్ణాటక సర్వే ఫలితం..రేవంత్, చంద్రబాబు ప్రభుత్వాలకు గట్టి హెచ్చరికే
X

సరిగ్గా రెండేళ్లు అవుతోంది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి.. గెలిచిన వెంటనే సీఎం పదవి కోసం రేస్ మొదలైంది. చివరకు చెరో రెండున్నరేళ్లు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లు సీఎంలుగా ఉండేలా ఒప్పందం కుదిర్చింది అధిష్ఠానం. ఇప్పుడు మరో ఆరు నెలల్లో సిద్ధరామయ్య పదవి నుంచి దిగిపోవాల్సి ఉంది. ఈలోగానే కర్ణాటకలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, కొడెమో టెక్నాలజీస్ 10,481 శాంపిల్స్‌ తో ఏప్రిల్ 17- మే 18 మధ్య నిర్వహించిన సర్వే పెద్ద బాంబు పేల్చింది.

కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. ప్రతిపక్ష బీజేపీ ఏకంగా 51 శాతం ఓట్లతో 136 నుంచి 159 సీట్లతో ఘన విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. కాంగ్రెస్ 40.3 శాతం ఓట్లతో కేవలం 62-82 స్థానాలకు పడిపోతుందని.. జేడీఎస్ మరింత ఘోరంగా 5 శాతం ఓట్లతో 3-6 స్థానాలు మాత్రమే గెలుచుకుంటుందని తెలిపింది.

ఈ సర్వే ప్రకారమే చూస్తే.. అధికార కాంగ్రెస్ పై బీజేపీ 10 శాతం పైగా ఓట్ల ఆధిక్యంలో ఉంది. రెండేళ్ల కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ 42.88 శాతం ఓట్లతో 135 స్థానాలు, బీజేపీ 36 శాతం ఓట్లతో 66, జేడీఎస్ 13.29 శాతం ఓట్లతో 19 సీట్లు నెగ్గాయి. నాడు బీజేపీ అవినీతి పాలన, యడియూరప్ప స్థానంలో బొమ్మైను సీఎంగా చేయడం, ఇతర వైఫల్యాలతో ఓడిపోయింది. కానీ, రెండేళ్లలోనే సీన్ మారిపోయింది. బీజేపీ బాగా పుంజుకొంది. దీనికితోడు ఇటీవల పాకిస్థాన్ పై మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు బీజేపీ మైలేజీని బాగా పెంచాయని తెలుస్తోంది.

ఇక సూపర్ సిక్స్ అంటూ హామీలతో కర్ణాటకలో నెగ్గిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయడంలో నానాతిప్పలు పడుతోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కర్ణాటకకే చెందిన మల్లికార్జున ఖర్గే అయితే.. సాధ్యం కాని హామీలు ఎందుకిచ్చారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. వీటికితోడు పాలనా వైఫల్యాలు కూడా హస్తం పార్టీని కర్ణాటకలో దెబ్బకొట్టేలా కనిపిస్తున్నాయి.

కర్ణాటక మోడల్ నే ఫాలో అవుతూ.. ఏడాదిన్నర కిందట జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చింది. ఇక్కడా కొన్ని ఇబ్బందులు పడుతూనే వాటిని అమలు చేస్తోంది. ప్రధానంగా రైతు రుణమాఫీపై విమర్శలు బాగా వచ్చాయి. దీనికితోడు ఖజానా ఖాళీ కావడం, మంత్రివర్గం పూర్తిస్థాయిలో లేకపోవడం, కొన్ని పాలనా నిర్ణయాలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెనక్కు లాగుతున్నాయి.

కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ విజయాలను చూసి ఏపీలో సూపర్ సిక్స్ పేరిట టీడీపీ కూటమి హామీలు ఇచ్చింది. టీడీపీ/జనసేన మ్యానిఫెస్టోను విడుదల కూడా చేశాయి. అయితే, వీటిలో చాలా తేలికైన మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాలనే అమలు చేయలేకపోతోంది చంద్రబాబు ప్రభుత్వం. ప్రతిపక్ష వైసీపీ దాడి నుంచి తప్పించుకోలేక నానా తిప్పలు పడుతోంది.

మరి ఆరు నెలల్లో తెలంగాణలో, వచ్చే ఏడాది నాటికి ఏపీలో ప్రభుత్వాలు రెండేళ్లు పూర్తి చేసుకుంటాయి. అప్పటికి ఏదైనా సంస్థ సర్వే చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో?