కర్ణాటకలో మరో ఘోరం.. నైటీ ధరించిందని నిప్పు పెట్టిన భర్త
ఎనిమిదేళ్ల క్రితం నందగడకు చెందిన క్రిష్ణాజీకి.. మంజులా పాటిల్ కు పెళ్లైంది. అయితే.. భార్య నైటీ ధరించటం భర్త క్రిష్ణాజీకి ఇష్టం ఉండదు.
By: Garuda Media | 23 April 2026 10:36 AM ISTఇటీవల కాలంలో దారుణ నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది కర్ణాటక. మొన్నటికి మొన్న తనను ప్రేమించినోడు తనను పెళ్లి చేసుకోడన్న అనుమానంతో.. వెస్ట్రన్ స్టైల్ లో అంటూ ఊరించి..కుర్చీకి కట్టేసి.. పెట్రోల్ పోసి ప్రియుడ్ని తగలబెట్టిన ఉదంతం తెలిసిందే. తాజాగా తాను ఎంత చెప్పినా భార్య నైటీ ధరిస్తుందన్న ఆగ్రహంతో కిరోసిన్ పోసి తగలబెట్టిన భర్త దుర్మార్గ ఉదంతమిది. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఉదంతంలోకి వెళితే..
ఎనిమిదేళ్ల క్రితం నందగడకు చెందిన క్రిష్ణాజీకి.. మంజులా పాటిల్ కు పెళ్లైంది. అయితే.. భార్య నైటీ ధరించటం భర్త క్రిష్ణాజీకి ఇష్టం ఉండదు. ఎప్పుడైనా నైటీ ధరిస్తే.. కయ్యిన అరుస్తుంటాడు. తీవ్ర ఆగ్రహానికి గురవుతుంటాడు. అలాంటివి తనకు న్చవంటూ సీరియస్ అవుతుంటాడు. నైటీ ధరిస్తే తప్పేముందని భార్య సమాధాన పరుస్తూ వస్తోంది. తాను ఎంత చెప్పినా నైటీ ధరించటంపై భర్త ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉండేవాడు.
తాజాగా నైటీ ధరించిన భార్యను చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తాను ఎంత చెప్పినా.. నైటీ వేసుకోవటం మానటం లేదన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. తీవ్ర గాయాల బారిన పడ్డ ఆమెను.. స్థానికులు రక్షించి దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఎనభై శాతం గాయాలకు గురైనట్లుగా వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం బ్రిమ్స్ కు.. అక్కడి నుంచి గోవాలోని ఆసుపత్రికి తరలించారు.
ఎనిమిదేళ్ల వారి వైవాహిక జీవితంలో నైటీ ధరించొద్దనిభర్త.. ధరిస్తే తప్పేం ఉంటుందని భార్య ఇద్దరి మధ్య నైటీ వ్యవహారం గొడవకు దారి తీస్తూనే ఉంది. తాజాగా అది అనూహ్య పరిస్థితికి దారి తీసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని.. తమ పని తాము చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. బర్నింగ్ కేసుల్లో 40 శాతం దాటితేనే కోలుకోవటం కష్టంగా ఉంటుందని.. తాజా ఉదంతం ఎనభై శాతం కావటంతో కోలుకోవటం కష్టమని వైద్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మరోవైపు.. ప్రాణాల కోసం భార్య ఆసుపత్రిలో పోరాటం చేస్తోంది. ఈ ఉదంతం గురించి తెలిసిన వారు షాక్ తింటున్నారు.
