Begin typing your search above and press return to search.

కరీంనగర్‌లో పట్టపగలు కాల్పుల కలకలం: పీఎంజే జ్యువెలరీలో భారీ దోపిడీ

కరీంనగర్ నగరంలో పట్టపగలు జరిగిన దారుణ ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

By:  A.N.Kumar   |   3 May 2026 5:00 PM IST
కరీంనగర్‌లో పట్టపగలు కాల్పుల కలకలం: పీఎంజే జ్యువెలరీలో భారీ దోపిడీ
X

కరీంనగర్ నగరంలో పట్టపగలు జరిగిన దారుణ ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. నగరంలోని Karimnagar జ్యోతినగర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ PMJ Jewellers షాపులో ఐదుగురు దొంగలు తుపాకులతో దూసుకెళ్లి కాల్పులు జరిపి భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా, కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు సమాచారం.

సాక్షుల కథనాల ప్రకారం, మధ్యాహ్న సమయంలో రెండు బైకులపై వచ్చిన ఐదుగురు దుండగులు ఒక్కసారిగా షాపులోకి చొరబడ్డారు. లోపలికి వెళ్లిన వెంటనే తుపాకులు చూపించి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. కౌంటర్లలో ఉన్న బంగారు నగలను సేకరిస్తుండగా, కొంతమంది సిబ్బంది అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన దొంగలు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ దోపిడీ జరిగిన ప్రదేశం కోర్టు సర్కిల్ సమీపంలోని శివా థియేటర్ లైన్‌గా ఉండటం, ఆ ప్రాంతం ఎప్పుడూ జనసంచారం ఎక్కువగా ఉండటం గమనార్హం. అలాంటి రద్దీ ప్రాంతంలో ఈ స్థాయిలో ప్లాన్ చేసి దోపిడీ జరగడం పోలీసులకే సవాల్‌గా మారింది. దొంగలు ముందుగానే షాపును టార్గెట్ చేసి, పూర్తి ప్రణాళికతో వచ్చారని అనుమానిస్తున్నారు.

ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. షాపులో ఉన్న సీసీటీవీ కెమెరాలు మొత్తం ఘటనను రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఆ ఫుటేజ్‌ను విశ్లేషిస్తూ నిందితుల గుర్తింపుపై దృష్టి సారించారు. దొంగలు పారిపోయిన మార్గాలను గుర్తించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను కూడా సేకరిస్తున్నారు.

పోలీసులు నగరంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. “నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తాం. దోపిడీకి గురైన ఆభరణాలను కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటాం” అని అధికారులు తెలిపారు.

ఈ ఘటనతో నగరంలోని ఇతర జ్యూవెలరీ వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆయుధాలతో వచ్చి కాల్పులు జరిపి దోపిడీ చేయడం వంటి ఘటనలు అరుదుగా జరుగుతాయి. దీంతో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల తెలంగాణలోని ఇతర నగరాల్లో కూడా జ్యూవెలరీ షాపులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్‌వర్క్ పని కావచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సాధారణ ప్రజల్లో కూడా భయం నెలకొంది. “మేము కష్టపడి సంపాదించిన డబ్బుతో నగలు కొనుగోలు చేస్తాం. ఇలాంటి ఘటనలు జరిగితే షాపులకు వెళ్లడానికే భయపడాల్సి వస్తుంది” అని ఒక స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని భద్రతను మరింత బలోపేతం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.